Noman Ali Hat-Trick: ముల్తాన్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ బౌలర్ అద్భుతం చేశాడు. పాక్ స్పిన్నరో నోమన్ అలీన్ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో తొలి మూడు బంతులలో విండీస్ బ్యాటర్లను ముగ్గుర్ని ఔట్ చేశాడు. దాంతో టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన తొలి పాక్ స్పిన్నర్‌గా నోమన్ అలీ నిలిచాడు. ఆ ఓవర్లో తొలి బంతికి గ్రీవ్స్(1) ఇచ్చిన క్యాచ్ ను కెప్టెన్ బాబర్ అజం అందుకున్నాడు. రెండో బంతికి టెవ్లిన్ ఇమ్లాచ్ (0) ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మొదట నోమన్ అలీ అప్పీల్ చేసినా అంపైర్ త్వరగా స్పందించలేదు. కానీ పాక్ బౌలర్ మరింత పట్టుదులతో అప్పీల్ చేయడంతో అంపైర్ వేలేత్తడంతో టెవ్లిన్ 6వ వికెట్ గా వెనుదిరిగాడు. 

ఆ ఓవర్లో 3వ బంతికి సింక్లేర్ (0)ను సైతం డకౌట్ చేశాడు. నోమన్ అలీ వేసిన బంతిని సింక్లేర్ బ్యాట్ ను తాకి సెకండ్ స్లిప్స్ లోకి వెళ్లగా కెప్టెన్ బాబర్ అజం అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో నోమన్ అలీ ఖాతాలో అరుదైన రికార్డ్ చేరింది. దాంతో హ్యాట్రిక్ వికెట్లు తీసిన పాక్ స్పిన్నర్ గా అరుదైన జాబితాలో నోమన్ అలీ చేరాడు. నోమన్ అలీ స్పిన్ మాయాజాలంతో విండీస్ ఓ దశలో 38 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. టెయిలెండర్ల పోరాటంతో విండీస్ 41.1 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. గుడకేశ్ మోతీ (55) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా,  కీమర్ రోచ్ (25) చేయగా.. 11వ నెంబర్ బ్యాటర్ జోమిల్ వారికన్ 40 బంతుల్లోనే 36 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. లేకపోతే వందలోపే విండీస్ చాప చుట్టేసేది. ఈ మ్యాచ్‌లో నోమన్ అలీ ఐదు వికెట్ల ఇన్నింగ్స్(6/41)తో విండీస్ భరతం పట్టాడు.

 

టెస్టుల్లో పాకిస్తాన్ బౌలర్ల హ్యాట్రిక్..వసీం అక్రమ్, పాక్ వర్సెస్ శ్రీలంక  (1999)వసీం అక్రమ్, పాక్ వర్సెస్ శ్రీలంక  (1999)అబ్దుల్ రజాక్, పాక్ వర్సెస్ శ్రీలంక (2000)మహ్మద్ సమీ, పాక్ వర్సెస్ శ్రీలంక (2002)నసీం షా, పాక్ వర్సెస్ బంగ్లాదేశ్ (2020)నోమన్ అలీ, పాక్ వర్సెస్ వెస్టిండీస్ (2025)

ఇప్పటివరకూ టెస్టుల్లో పాకిస్తాన్ బౌలర్లు 5 పర్యాయాలు హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టగా, తాజాగా ఆరోసారి పాక్ బౌలర్ ఈ ఫీట్ సాధించాడు. అయితే ఇప్పటివరకూ వసీం అక్రమ్ రెండు సార్లు శ్రీలంక మీద హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ఆపై అబ్దుల్ రజాక్, మహ్మద్ సమీ సైతం శ్రీలంక మీద టెస్టుల్లో హ్యాట్రిక్ తీశారు. మరో పేసర్ నసీం షా 2020లో బంగ్లాదేశ్ మీద హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. కానీ వీరంతా ఫాస్ట్ బౌలర్లు, మీడియం పేసర్లు కాగా టెస్టు క్రికెట్లో హ్యాట్రిక్ వికెట్ల ఘనత సాధించిన తొలి పాక్ స్పిన్నర్‌గా నోమన్ అలీ నిలిచాడు. శనివారం నాడు విండీస్ తో ముల్తాన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో నోమన్ అలీ ఈ ఫీట్ నెలకొల్పాడు.