Chennai T20 Live Updates: చెన్నైలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టీ20లో టాస్ నెగ్గిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. తొలి టీ20లో నెగ్గిన భారత్ ఈ మ్యాచ్ లోనూ విజయం సాధించి, సిరీస్ లో ఆధిక్యాన్ని 2-0తో చేసుకోవాలని భావిస్తోంది. అయితే పక్కటెముకల నొప్పితో నితీశ్ రెడ్డి టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. రింకూ కూడా గాయంతో దూరమయ్యాడు. వారి స్థానంలో వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ జట్టులోకి వచ్చారు. ఇక, ఒకరోజు ముందే తుదిజట్టును ప్రకటించిన ఇంగ్లాండ్ జట్టులో రెండు మార్పులు చేసింది. జాకబ్ బెతెల్ స్థానంలో జేమీ స్మిత్ పేసర్ గస్ అట్కిన్సన్ స్థానంలో బ్రైడెన్ కార్స్ ను జట్టులోకి తీసుకుంది. పేస్ దళాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకుగాను ఈ మార్పు చేసినట్లు కనిపిస్తోంది. తొలి మ్యాచ్ లో భారీగా పరుగులు సమర్పించుకున్న అట్కిన్సన్ పై అందుకే వేటు వేసింది. 






ఇంగ్లాండ్ పై అద్భుత రికార్డు..
పొట్టి ఫార్మాట్లో భారత్ కు అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య 25 మ్యాచ్ లు ఆడగా, 14 టీ20లను భారత్ నెగ్గగా, 11 మ్యాచ్ ల్లో ఇంగ్లాండ్ గెలుపొందింది. ఇక కోల్కతాలో జరిగిన మ్యాచ్ లో ఆరంభంలో వికెట్ నుంచి లభించిన మద్ధతుతో భారత బౌలర్లు రెచ్చిపోయారు. ఫైర్ పవర్ తో కూడిన జోస్ బట్లర్ సేనను కట్టడి చేశారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి ప్రత్యర్థి బ్యాటర్లకు కొరకరాని కొయ్యలా మారాడు. మూడు కీలకమైన వికెట్లు తీసి సత్తా చాటాడు. అలాగే ఆరంభంలోనే రెండు వికెట్లు తీసిన అర్షదీప్ సింగ్.. ఇంగ్లాండ్ ను కట్టడి చేశాడు. అలాగే 97 వికెట్లతో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లోనే వంద వికెట్ల మార్కును చేరుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. దీంతో ఈ వంద వికెట్ల క్లబ్బులోకి ప్రవేశించిన తొలి భారత బౌలర్ గా నిలవనున్నాడు. ఇక బౌలర్లలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ సమయోచితంగా రాణించాడు. 


బలమే.. బలహీనతై..
గత కొంతకాలంగా ఏ ఫార్మాట్ అయిన దూకుడైన ఆటతీరుతో వార్తల్లో నిలవడం ఇంగ్లాండ్ కు ఆనవాయితీగా వస్తోంది. ఐదు టీ20ల సిరీస్ కు ముందు ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ ఫియర్లెస్ క్రికెట్ ఆడతామని హెచ్చరికలను భారత జట్టుకు పంపాడు. అయితే కోల్కతాలో జరిగిన మ్యాచ్ లో మాత్రం ఇంగ్లాండ్ బ్యాటర్లు తేలిపోయారు. బట్లర్ ఫిఫ్టీ చేయడం మినహా మిగతా బ్యాటర్లు రాణించలేకపోయారు. హ్యారీ బ్రూక్ మాత్రమే రెండంకెల స్కోరును చేరగా, మిగతావారు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. దీంతో ఈ మ్యాచ్ లో తమ బ్యాటింగ్ పవర్ ను రుచి చూపించాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. జట్టులో హిట్టర్లకు లోటేం లేదు. లియామ్ లివింగ్ స్టన్, జోస్ బట్లర్, బ్రూక్, డకెట్ తదితర హిటర్లకు లోటేం లేదు. ఇక బౌలింగ్ లో జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్ లతో పటిష్టంగా ఉంది. ఈ మ్యాచ్ లో నెగ్గి సిరీస్ సమం చేయడంతోపాటు గతేడాది టీ20 ప్రపంచకప్ సెమీస్ లో భారత్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. 


భారత్ ప్లేయింగ్ లెవన్ : సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్.


ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవన్ : జోస్ బట్లర్ (కెప్టెన్), డకెట్, బ్రూక్, లివింగ్ స్టన్, జేమీ స్మిత్, ఫిల్ సాల్ట్, జేమీ ఒవర్టన్, బ్రైడెన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్


Also Read: ICC Test Team Of The Year 2024: ముగ్గురు భారతీయ ప్లేయర్లకు చోటు.. అత్యధికంగా ఇంగ్లాండ్ నుంచి నలుగురు.. పాక్, సౌతాఫ్రికా నుంచి నిల్..