Yashasvi Jaiswal bought  new flat : ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్న టీమ్ఇండియా యువ ఆట‌గాడు య‌శ‌స్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ముంబైలో అత్యంత ఖ‌రీదైన బాంద్రా ఈస్ట్ ప్రాంతంలో ఓ కొత్త ఫ్లాట్‌ను కొన్న‌ట్లు స‌మాచారం. బాంద్రాలోని టెన్ బీకేసీ ప్రాజెక్టు‌లో 1100 చదరపు గజాల ఫ్లాట్‌‌ను యశస్వి రూ.5.38 కోట్లకు సొంతం చేసుకున్నాడని , అత్యంత అధునాత‌న స‌దుపాయాలు ఉన్న ఫ్లాట్‌ను య‌శ‌స్వి గ‌ల నెల‌లోనే త‌న పేరిట రిజిస్ట్రేష‌న్ చేయించుకున్న‌ట్లు  రియల్ ఎస్టేట్ డేటాబేస్ ప్లాట్‌ఫామ్  వెల్లడించింది. ప్రస్తుతం ఈ అపార్ట్‌మెంట్ నిర్మాణ దశలో ఉండగా.. జనవరి 7న రిజిస్ట్రేషన్ జరిగిందని తెలుస్తోంది. 


భారత యువ బ్యాటర్, భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియా నయా సంచలనం యశస్వి జైస్వాల్‌  వరుసగా రెండు  మ్యాచ్‌లలోనూ డబుల్ సెంచరీతో మెరిశాడు.  ఈ సిరీస్‌లో మూడు మ్యాచుల్లో 545 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో ఐసీసీ టెస్టు బ్యాట‌ర్ల ర్యాంకింగ్స్‌లో త‌న కెరీర్ అత్యుత్త‌మ ర్యాంకుకు చేరుకున్నాడు. ఏకంగా 14 స్థానాలు మెరుగుప‌ర‌చుకుని టాప్ 15లోకి వ‌చ్చాడు. రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి  236 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్స్‌లతో 214 పరుగులు చేశాడు. అసలు బజ్‌బాల్‌ ఆటంటే ఏంటో ఇంగ్లాండ్‌ జట్టుకు తెలుసొచ్చేలా చేశాడు. వన్డే తరహా ఆటతీరుతో బ్రిటీష్‌ బౌలర్లపై ఎదురుదాడి చేసిన జైస్వాల్‌... వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ద్వి శతకంతో మెరిసి అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 


రికార్డుల మోత
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2023-25 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా యశస్వి నిలిచాడు. ప్రస్తుతం 7 మ్యాచుల్లో 861 పరుగులు చేశాడు. జైస్వాల్‌ తర్వాత 855 పరుగులతో ఆస్ట్రేలియా బ్యాటర్‌ ఉస్మాన్‌ ఖవాజా ఉన్నాడు. టీమిండియా తరపున టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఎడమచేతివాటం బ్యాటర్‌గా యశస్వి నిలిచాడు. ఇంతకుముందు గంగూలీ పేరిట ఉన్న 535  పరుగుల రికార్డును 545 పరుగులతో యశస్వి జైస్వాల్‌ బద్దలు కొట్టాడు. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన భారత బ్యాటర్‌గా యశస్వి రికార్డు నమోదు చేశాడు.


ఒక  ఇన్నింగ్స్‌లో జైస్వాల్‌ 12 సిక్స్‌లు కొట్టాడు. వసీమ్‌ అక్రమ్‌ కూడా ఒక ఇన్నింగ్స్‌లో 12 సిక్సులు కొట్టాడు. వీరిద్దరూ సంయుక్తంగా  అగ్రస్థానంలో నిలిచారు. టెస్టుల్లో.. ఒకే ఓవర్‌లో మూడు సిక్స్‌లు కొట్టిన ఐదో భారత బ్యాటర్‌ యశస్వి. అతడి కంటే ముందు ధోనీ, హార్దిక్‌, రోహిత్, ఉమేశ్‌ ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ చేసిన ఏడో భారత బ్యాటర్‌గానూ  యశస్వి జైస్వాల్ అరుదైన ఘనతను సాధించాడు. వరుసగా రెండు ద్విశతకాల బాదిన మూడో టీమ్‌ఇండియా క్రికెటర్‌గానూ నిలిచాడు. వినోద్ కాంబ్లి, విరాట్ కోహ్లీ అతడి కంటే ముందు రెండు మ్యాచ్‌ల్లోనూ డబుల్‌ సెంచరీలు చేశారు.  ఇక ఐపీఎల్‌లో 37 మ్యాచులు ఆడాడు. 1,172 ప‌రుగులు చేశాడు. ఇందులో ఓ శ‌త‌కం, 8 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి.