India pacer Mohammed Shami ruled out of IPL: గాయం కారణంగా భారత సీనియర్ పేస్‌ బౌలర్‌ మహమ్మద్ షమి(Mohammed Shami) వచ్చే నెలలో జరగనున్న ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌-IPLలో ఆడటంలేదని..బీసీసీఐ(BCCI) వర్గాలు తెలిపాయి. షమి ఎడమకాలి చీలమండకు గాయం వల్ల యునైటెడ్ కింగ్‌డమ్‌(UK) లో శాస్త్ర  చికిత్స చేయించుకోవాల్సి ఉందని బోర్డు వర్గాలు చెప్పాయి. 33 ఏళ్ల షమి. గత నవంబరులో ప్రపంచకప్‌ ఫైనల్‌లో చివరి మ్యాచ్ ఆడాడు.గాయం కారణంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న  టెస్ట్‌ సిరీస్‌కు అతనికి విశ్రాంతి ఇచ్చారు. జనవరి చివరి వారంలో లండన్‌లో కొన్ని చీలమండ ఇంజెక్షన్లు తీసుకున్న షమి  తేలికపాటి పరుగులు సాధన చేశాడు. అయితే 3 వారాల తర్వాత ఇంజెక్షన్ల ప్రభావం పూర్తిగా తగ్గిపోవడంతో  నొప్పి మళ్లీ తిరగబెట్టింది. ఇక శస్త్రచికిత్స మినహా మరే మార్గంలేదని బీసీసీఐ వర్గాలు చెప్పాయి. నొప్పితోనే ప్రపంచకప్ ఆడిన షమి ఆ ప్రభావం మ్యాచ్‌లపై పడనివ్వలేదని సమాచారం.


గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత గాయపడిన షమీ ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‍తో పాటు దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు అఫ్గానిస్థాన్‍తో టీ20 సిరీస్‍కు కూడా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం జరుగుతున్న భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‍లోనూ ఆడటం లేదు. ఐపీఎల్ 2024 సీజన్‌లోనే మైదానంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది అని ఇప్పటివరకు అందరూ భావించారు. కానీ అది కూడా సాధ్యం కాదని ఇప్పుడు బిసిసిఐ ప్రకటనతో తేలిపోయింది. 


ఒకప్పుడు  భార్య పెట్టిన గృహ హింస కేసు, వ్యక్తిగత జీవితంలో ఆటుపోట్లు, కోర్టు సమన్లు  ఆత్మహత్య చేసుకొందామన్న ఆలోచనలు రోడ్డు ప్రమాదం ఇలా ఒకటా రెండా షమీని సమస్యలు చుట్టుముట్టాయి. అయినా షమీ వెనక్కి తగ్గలేదు. ఇంకా దృఢంగా తయారయ్యాడు. చాలాకాలం వరకు  జట్టులో చోటు దొరకకపోయినా కుంగిపో లేదు. తానేంటో నిరూపించుకోవాలన్న కసితో తీవ్రంగా సాధన చేశాడు.  దానికి తగ్గ ఫలాలను అందిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో తన కుటుంబం గురించి మీడియా తో పంచుకున్నాడు. తన కుమార్తె ఐరాను కలుసుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తంచేశాడు. కుటుంబ విభేదాల వల్ల కొన్నాళ్లుగా షమీ తన భార్య హసిన్‌ జహాన్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కుమార్తెను చూడటానికి, మాట్లాడటానికి తనను అనుమతించడం లేదని, కొన్ని సందర్భాల్లో మాత్రమే మాట్లాడుతున్నానని తెలిపాడు. ఎవరూ తన కుటుంబాన్ని, పిల్లలను కోల్పోవాలనుకోరు. కానీ కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఆరోగ్యంగా ఉంటూ అన్నింటిలో విజయం సాధించాలని  కోరుకుంటున్నానన్నాడు. 


మరోవైపు బెంగాల్‌ తరపున మహమ్మద్‌ షమీ సోదరుడు మహమ్మద్‌ రంజీ అరంగేట్రం చేశాడు. షమీ లాగే కైఫ్‌(Mohammed Kaif)కు కూడా చిన్నప్పటి నుంచి క్రికెట్‌ అంటే ఎంతో మక్కువ. తనకంటే ఆరేళ్ల పెద్దవాడైన షమీ అంతర్జాతీయ క్రికెట్లో సాగుతుండటం చూసిన కైఫ్ స్ఫూర్తి పొందాడు. స్పీడ్, సీమ్, స్వింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నాడు. టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించాలనే కైఫ్‌ కల నెరవేరే దిశగా షమీ అండగా నిలుస్తున్నాడు.