Tamim Iqbal: ఈనెలాఖరు నుంచి పాకిస్తాన్ - శ్రీలంక వేదికలుగా జరుగబోయే  ఆసియా కప్  ప్రారంభానికి కొద్దిరోజుల ముందే  బంగ్లాదేశ్ వన్డే సారథి  తమీమ్ ఇక్బాల్  ఆ జట్టుకు ఊహించని షాకిచ్చాడు.  తాను సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు.  సారథిగా దిగిపోవడమే గాక ఆసియా కప్‌కూ తమీమ్ దూరం కానున్నాడు. ఆసియా కప్‌లో ఇది బంగ్లాదేశ్‌ ఆటపై కచ్చితంగా ప్రభావం చూపేదే.. 


ఇటీవలే  అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్..  ఒక్క రోజులోనే దానిని వెనక్కి తీసుకున్నాడు.   అయితే వెన్నునొప్పితో బాధపడుతున్న  బంగ్లాదేశ్ వన్డే సారథి.. మరికొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు.  మరో రెండు నెలల్లో భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌కు తమీమ్ ఆడటం   అత్యంత కీలకం.  ఈ నేపథ్యంలో గాయాన్ని పెద్దది చేసుకుని ఇబ్బందిపడేకంటే  ఆసియా కప్ నుంచి తప్పుకోవడమే బెటర్ అన్న అభిప్రాయంతో ఉన్న  తమీమ్.. ఢాకాలో గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించాడు.  


బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు  నజ్ముల్ హసన్‌తో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న తమీమ్ మాట్లాడుతూ.. ‘నేను కెప్టెన్‌గా తప్పుకుంటున్నా. ఇకనుంచి ఆటగాడిగా  దృష్టి సారిస్తా.  నాకు అవకాశం వచ్చినప్పుడు  జట్టు కోసం అండగా ఉంటా..’ అని చెప్పుకొచ్చాడు.  


 






గత కొంతకాలంగా  లోయర్ బ్యాక్ పెయిన్‌తో బాధపడుతున్న తమీమ్.. ఆసియా కప్‌కూ దూరంగా ఉండనున్నాడు. అయితే ఆ తర్వాత బంగ్లాదేశ్.. న్యూజిలాండ్‌తో ఆడే వన్డే సిరీస్‌కు మాత్రం అందుబాటులో ఉంటానని ఆ లోపు తాను పూర్తిస్థాయిలో ఫిట్ అవుతానని తెలిపాడు. 


గత నెలలో తమీమ్.. వన్డేల నుంచి తప్పుకుంటున్నట్టు  తెలిపాడు. కానీ షకిబ్ అల్ హసన్, మొష్రఫీ మొర్తజాతో పాటు బీసీబీ  జోక్యం చేసుకుని తమీమ్‌ను బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వద్దకు తీసుకెళ్లారు. బంగ్లా ప్రధాని కూడా  తమీమ్‌ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని  సూచించడంతో అతడు రిటైర్మెంట్‌కు తాత్కాలికంగా  బ్రేక్ వేశాడు. ఇదే విషయమై తమీమ్ మాట్లాడుతూ.. ‘ప్రధానితో మేం సుదీర్ఘంగా చర్చించాం. ఆమె నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని కోరారు.  సాధారణంగా నేను ఎవరికైనా ఈజీగానే నో చెబుతాను. కానీ  దేశంలో అత్యంత  ముఖ్యవ్యక్తి అడిగేసరికి కాదనకపోయా..’ అని చెప్పాడు. 


 






కాగా ఆగస్టు 30 నుంచి మొదలుకాబోయే ఆసియా కప్‌లో  బంగ్లాదేశ్ తొలి మ్యాచ్‌ను 31న ఆడనుంది.  శ్రీలంకతో క్యాండీ వేదికగా జరుగబోయే మ్యాచ్‌తో ఆసియా కప్ వేటను మొదలుపెట్టనుంది.  గ్రూప్ - బిలో ఉన్న బంగ్లాదేశ్..  లీగ్ దశలో  శ్రీలంక, అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. 






















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial