జింబాబ్వేపై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు సాధించిన సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి హిట్టింగ్ చేశాక వెనక్కి తిరిగి చూడకూడదని అనుకున్నామని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 71 పరుగులతో విజయం సాధించింది.


సూర్యకుమార్ ఈ మ్యాచ్‌లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టాడు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా కలిసి 66 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడారు. అప్పటికే భారత్ మూడు ముఖ్యమైన వికెట్లను కోల్పోయింది. దీంతో ఇన్నింగ్స్‌ను నిర్మించాల్సిన బాధ్యత వీరిపై పడింది.


"నేను, హార్దిక్ కలిసి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్లాన్ చాలా స్పష్టంగా ఉంది. పాజిటివ్ ఇంటెంట్‌తో ఆడాలని మేం అనుకున్నాం. అలానే బంతిని గట్టిగా కొట్టడం ప్రారంభించాం. జట్టులో వాతావరణం నిజంగా బాగుంది." అని సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్‌లో పేర్కొన్నాడు. గురువారం అడిలైడ్‌ ఓవల్‌లో జరిగే రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌తో భారత్‌ తలపడనుంది.


బ్యాటింగ్ విధానం గురించి మాట్లాడుతూ "నా ప్రణాళిక ఎల్లప్పుడూ స్పష్టంగా ఉంటుంది, నేను నెట్స్‌లో అదే పని చేస్తాను, నేను అవే షాట్‌లను ప్రాక్టీస్ చేస్తాను. నేను పరిస్థితిని బట్టి, జట్టుకు ఏమి అవసరమో అలాగే బ్యాటింగ్ చేస్తాను. ఇది నిజంగా మంచిది. ప్రపంచ నంబర్ వన్ స్థానంలో ఉన్నా స్కోరు సున్నా నుంచే ప్రారంభించాలి. తదుపరి గేమ్‌లో ఇది ఎలా జరుగుతుందో చూద్దాం." అన్నాడు.