T20 World Cup 2024 SL vs SA:  టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup 2024)లో దక్షిణాఫ్రికా(SA)తో జరిగిన తొలి పోరులో శ్రీలంక(SL) ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. బౌలర్లకు అనుకూలించిన పిచ్‌పై లంక బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఎనిమిది మంది లంక బ్యాటర్లకు కనీసం రెండంకెల స్కోరు చేయలేదంటే... లంక పతనం ఎలా సాగిందో చెప్పొచ్చు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 77 పరుగులు మాత్రమే చేయగలిగింది. దక్షిణాఫ్రికా 16.2 ఓవర్‌లో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో లంక ఓటమికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటంటే...




 

1‌) తెలియని పిచ్‌పై బ్యాటింగా

పిచ్‌ ఎలా స్పందిస్తుందో తెలియకుండా... గతంలో జరిగిన మ్యాచ్‌లను పూర్తిగా అంచనా వేయకుండా టాస్‌ గెలవగానే శ్రీలంక కెప్టెన్‌ హసరంగ బ్యాటింగ్‌ తీసుకున్నాడు. అదే హసరంగ టాస్‌ గెలవగానే బౌలింగ్‌ తీసుకుని ఉంటే పిచ్‌ ఎలా స్పందిస్తుందనే దానిపై ఒక అంచనా ఉండేది. దానికి తగ్గట్లు ప్రణాళిక అమలు చేస్తే లంకకు విజయావకాశాలు ఉండేవని క్రికెట్‌ నిపుణులు అంచనా వేశారు. టాస్‌ గెలవగానే బ్యాటింగ్‌ ఎంచుకోవడం ఎంత పెద్ద తప్పు లంకకు చాలా త్వరగానే తెలిసి వచ్చింది. ముందుగా లంక బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంటే మ్యాచ్ ఫలితం భిన్నంగా ఉండేది.

 

2) కెప్టెన్సీలో లోపాటు

ఈ మ్యాచ్‌లో హసరంగ కెప్టెన్సీలో చాలా పెద్ద తప్పులు చేశాడు. బౌలర్లకు ఉపయోగపడే పిచ్‌పై హసరంగ నాలుగో నెంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి చాలా పెద్ద తప్పు చేశాడు. అలా వచ్చి ఖాతా తెరవకుండానే హసరంగ పెవిలియన్‌ చేరాడు. హసరంగ పరుగులేమీ చేయకుండానే అవుట్‌ అవ్వడం... శ్రీలంక జట్టుపై ఒత్తిడి పెంచింది. హసరంగ తొలి పది ఓవర్లపాటు అసలు స్పిన్నర్‌కు బౌలింగే ఇవ్వలేదు. దక్షిణాఫ్రికా జట్టులో కేశవ్‌ మహరాజ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసిన విషయం తెలిసినా స్పిన్నర్‌కు బౌలింగ్‌ ఇవ్వకుండా హసరంగ తప్పు చేశాడు. కేశవ్ మహారాజ్ మొదటి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేస్తున్నప్పుడు పిచ్‌లో టర్న్‌ కనిపించింది. హసరంగా ఆరంభంలోనే స్పిన్నర్‌ను బరిలోకి దింపితే దక్షిణాఫ్రికా బ్యాట‌ర్లు స్పిన్‌ వలల్లో చిక్కే వారేమో. 11వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన హసరంగ కూడా రెండు వికెట్లు తీశాడు. అతను ముందుగా బౌలింగ్ చేసి ఉంటే దక్షిణాఫ్రికా బ్యాటర్లు కచ్చితంగా ఇబ్బంది పడేవారు.
  

 

3‌) పేలవమైన బ్యాటింగ్‌

శ్రీలంక బ్యాటర్లు ఏ దశలోనూ బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేయలేదు. తొలి 6 ఓవర్లలో పిచ్ బౌలర్లదేనని తేలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో స్కోరును 120 నుంచి 130కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే.. మ్యాచ్ ఫలితం మారి ఉండేది. శ్రీలంక బ్యాటర్లు చెత్త షాట్లు ఆడి అనవసరంగా వికెట్లు పారేసుకున్నారు. ముఖ్యంగా దసున్ షనక, ఏంజెలో మాథ్యూస్ చెత్త షాట్లు ఆడి ఔటయ్యారు. వీరిద్దరూ 20 ఓవర్లు ఆడాలని పట్టుబట్టి ఉంటే దక్షిణాఫ్రికా ముందు పోరాడే స్కోరు ఉండేది.