నిప్పులు చెరిగిన నార్జే
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. ఇది ఎంత పెద్ద తప్పుడు నిర్ణయమో కాసేపటికే లంకకు అర్థమైంది. పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై నార్జే చెలరేగిపోయాడు. నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పిచ్ బౌలర్లకు అనుకూలించడం... అవుట్‌ఫీల్డ్ నెమ్మదిగా ఉండడంతో బ్యాటింగ్ చేయడం లంకేయుల వల్ల కాలేదు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో పాథుమ్ నిసంకను అవుట్ చేయడం ద్వారా బార్ట్‌మన్ లంక పతనాన్ని ప్రారంభించాడు. 13 పరుగుల వద్ద లంక తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత నార్జే బంతితో నిప్పులు చెరిగాడు. తొలుత కుశాల్ మెండిస్‌ను అవుట్ చేసిన నార్జే.. ఆ తర్వాత కమిందు మెండీస్‌ను కూడా పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో లంక 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత శ్రీలంక బ్యాటర్ల కష్టాలు మరింత పెరిగాయి. కేశవ్ మహరాజ్ ఒకే ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి లంకను చావు దెబ్బ కొట్టాడు. 8.2 బంతికి తొలుత వసీందు హసరంగను అవుట్ చేసిన కేశవ్ మహరాజ్... ఆ తర్వాతి బంతికే సధీర సమరవిక్రమను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 31 పరుగులకు ఒకే వికెట్ కోల్పోయి పర్వాలేదనే స్థితిలో ఉన్న లంక... 40 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. అనంతరం చరిత్ అసలంక, ఏంజెలో మ్యాథ్యూస్‌ను.. నార్జే అవుట్ చేశాడు. ఏంజెలో మాథ్యూస్ 16 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అనంతరం కగిసో రబాడ కూడా రెండు వికెట్లు తీయడంతో లంక 19.4 ఓవర్లలో 77 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బౌలర్లలో నార్జే నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసి లంకను చావు దెబ్బ కొట్టాడు. కేశవ్ మహరాజ్, కగిసో రబాడ రెండు వికెట్లు తీశారు.
సఫారీ కూడా కష్టంగానే
78 పరుగుల లక్ష్యాన్ని సఫారీ జట్టు సునాయసంగా ఛేదిస్తుందని అంతా అనుకున్నారు. అయితే.. పిచ్ పేస్‌కు, స్పిన్‌కు అనుకూలిస్తుండడంతో సౌతాఫ్రికా బ్యాటర్లు కూడా ప్రతీ పరుగుకు శ్రమించాల్సి వచ్చింది. రెండో ఓవర్‌లోనే దక్షిణాఫ్రికా ఓపెనర్ హెండ్రిక్స్‌ను తుషారా అవుట్ చేశాడు. కాసేపటికే మార్‌క్రమ్ కూడా అవుటయ్యాడు. దీంతో 4 ఓవర్లలో 23 పరుగులకే సఫారీ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. వికెట్లు పడకున్నా దక్షిణాఫ్రికాకు పరుగులు అంత తేలిగ్గా రాలేదు. 10 ఓవర్లలో దక్షిణాఫ్రికా 47 పరుగులు మాత్రమే చేయగలిగింది. హెన్రిచ్ క్లాసెన్ 19, స్టబ్స్ 13, డేవిడ్ మిల్లర్ ఆరు పరుగులు చేయడంతో 16.2 ఓవర్లలో దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని ఛేదించగలిగింది. నాలుగు వికెట్లతో లంక పతనాన్ని శాసించిన నార్జేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.