T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌లో వ్యక్తిగత రికార్డులపై దృష్టి పెట్టొద్దని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) అంటున్నాడు. సెంచరీలు కాకుండా జట్టుకు అవసరమైన స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధించాలని సూచించాడు. విరాట్‌ కోహ్లీ వంటి బ్యాటర్లు మిడిలార్డర్‌పై ఒత్తిడిని తొలగించేలా ఆడాలని సలహా ఇచ్చాడు.


ఆసియాకప్‌లో విరాట్‌ కోహ్లీ (Virat Kohli) ఫామ్‌లోకి వచ్చాడు. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న సెంచరీ సైతం చేశాడు. అయితే టీమ్‌ఇండియా ఈ టోర్నీలో ఫైనల్‌కు వెళ్లలేదు. తాజాగా విరాట్‌ మరో రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్లో 11,000 పరుగుల మైలురాయి అధిగమించిన భారత తొలి ఆటగాడిగా నిలిచాడు. 354 టీ20ల్లో అతడు 11,030 పరుగులు సాధించాడు. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ అతడిపై భారీ ఆశలు పెట్టుకుంది. కాగా టీ20 ప్రపంచకప్‌లో విరాట్‌ కోహ్లీ వంటి ఆటగాళ్లు ఎలాంటి అప్రోచ్‌తో ఆడాలని ప్రశ్నించగా గౌతీ జవాబిచ్చాడు.


జట్టు గెలవనప్పుడు ఎన్ని రికార్డులు బద్దలు కొట్టినా అర్థం లేదని గంభీర్‌ అన్నాడు. 'జట్టు విజయానికి అవసరమైన పరుగులు చేయాలన్న తపనతో ఉండాలి. వ్యక్తిగత రికార్డులు లేదా హాఫ్‌ సెంచరీలు, సెంచరీలు చేయడంలో అర్థం లేదు. మీరు 20 చేసినా లేదా 40 పరుగులు చేసినా టీమ్‌ఇండియా 170-180 స్కోర్‌ సాధించేందుకు అవసరమైన స్ట్రైక్‌రేట్‌తో ఆడండి. ఒకవేళ ఛేదిస్తుంటే మిడిలార్డర్‌పై ఒత్తిడి తొలగించేలా బ్యాటింగ్‌ చేయండి' అని గౌతీ తెలిపాడు.


టీ20 ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీలో వ్యక్తిగత రికార్డులతో పనిలేదని అందుకే ఇంపాక్ట్‌ఫుల్‌ రన్స్‌ సాధించడంపై దృష్టి పెట్టాలని గంభీర్‌ సూచించాడు. 'ఇలాంటి టోర్నీలకు వెళ్లేటప్పుడు వ్యక్తిగత రికార్డులను ఇంటివద్దే వదిలేయాలి. టోర్నీలో మీరు 200 పరుగులు చేసినా జట్టు గెలిస్తే మీ వారసత్వం నిలబడుతుంది. ఒకవేళ 500 చేసినా ఓటమి పాలైతే ఆ పరుగులకు విలువే ఉండదు' అని పేర్కొన్నాడు.