AUS vs NZ, 1st Innings Highlights: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ తొలి సూపర్‌ 12 మ్యాచు అద్భుతంగా సాగుతోంది. ఆతిథ్య ఆస్ట్రేలియాకు న్యూజిలాండ్ 201 పరుగుల భారీ టార్గెట్‌ నిర్దేశించింది. ఓపెనర్లు డేవాన్‌ కాన్వే (92*; 58 బంతుల్లో 7x4, 2x6), ఫిన్‌ అలెన్‌ (42; 16 బంతుల్లో 5x4, 3x6) ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు. సిడ్నీ మైదానంలో ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదేస్తూ అభిమానులను ఉర్రూతలూగించారు.






అలెన్‌ మొదలెట్టాడు!


టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు శుభారంభం దక్కింది! క్రీజులోకి అడుగుపెట్టిన క్షణం నుంచి ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ దంచికొట్టుడు మొదలుపెట్టాడు. ఓవర్‌కాస్ట్‌ కండీషన్స్‌ను అస్సలు పట్టించుకోలేదు. హేజిల్‌వుడ్‌ను మినహాయించి ఆడిన ప్రతి బౌలర్‌ను చితకబాదేశాడు. కేవలం 16 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. ప్రమాదకరంగా మారిని అతడిని జట్టు స్కోరు 56 వద్ద హేజిల్‌వుడ్‌ బౌల్డ్‌ చేశాడు.




కాన్వే ముగించాడు!


మరోవైపు కాన్వే నిలకడగా ఆడటంతో పవర్‌ ప్లే ముగిసే సరికి కివీస్‌ 65/1తో నిలిచింది. కేన్‌ విలియమ్సన్‌ (23) బంతికో పరుగు చొప్పున చేశాడు. అతడిని ఆడమ్‌ జంపా ఔట్‌ చేశాడు. అప్పటికి స్కోరు 125. గ్లెన్‌ ఫిలిప్స్‌ (12) సైతం ఎక్కువ సేపు క్రీజులో ఉండలేదు. మరోవైపు కాన్వే విలువైన షాట్లు ఆడుతూ 36 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. ఆఖర్లో జిమ్మీ నీషమ్‌ (26*; 13 బంతుల్లో 2x6)తో కలిసి చితకబాదాడు. నాలుగో వికెట్‌కు 24 బంతుల్లో 48 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించాడు. జట్టు స్కోరును 200/3కు చేర్చాడు.