SKY About Rohit Sharma:  భారత కెప్టెన్ రోహిత్ శర్మ, టీమిండియా టీ20 సంచలనం సూర్యకుమార్ యాదవ్ మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. రోహిత్ శర్మ మాత్రమే సూర్య ఆటను చాలా కాలంగా చూస్తున్నాడు. వారిద్దరూ దేశవాళీ క్రికెట్లో ముంబయికు కలిసి ఆడారు. అలాగే ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీలో రోహిత్ కెప్టెన్సీలో సూర్యకుమార్ ఆడుతున్నాడు. ఈ విధంగా సూర్య క్రికెట్ గురించి రోహిత్ కు బాగా తెలుసు. హిట్ మ్యాన్ స్కై ఎదుగుదలను దగ్గరగా చూశాడు. అలానే సూర్యకు ఆట గురించి చాలా సూచనలు, సలహాలు ఇచ్చాడు. 


ఇప్పుడేం చెప్పడంలేదు


అయితే కొంతకాలంగా భారత్ తరఫున సూర్యకుమార్ టీ20 ఫార్మాట్ లో అదరగొడుతున్నాడు. అవకాశం వచ్చిన ప్రతి మ్యాచులో మంచి స్కోరు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరాడు. కాబట్టి ఇప్పుడు రోహిత్ తన ఆట గురించి ఏమీ చెప్పడంలేదని సూర్య అంటున్నాడు. 'నాకు రోహిత్ తో మంచి అనుబంధం ఉంది. అతను నన్ను చాలాకాలంగా చూస్తున్నాడు. నా ఆట గురించి నేను అతనితో మాట్లాడతాను. నా అభిప్రాయాలను తెలియజేస్తాను. అలాగే అతని అభిప్రాయాన్ని తీసుకుంటాను. అయితే ఈ సీజన్ లో నేను బాగా బ్యాటింగ్ చేయడం రోహిత్ చూస్తున్నాడు. అప్పుడు అతను నాకేమీ చెప్పలేదు. ఇప్పుడు నేను నీ గురించి చెప్పడానికి ఏమీ లేదు' అని నాతో అన్నాడు.' అని సూర్య ఓ వార్తా సంస్థతో అన్నాడు. 


అందుకే ఎక్కువ లగేజ్


టీ20 ప్రపంచకప్ సమయంలో సూర్యకుమార్ గురించి రోహిత్ సరదాగా వ్యాఖ్యానించాడు. సూర్య బ్యాటింగ్ కు వెళ్లినప్పుడు తనతో అనవసర బ్యాగేజ్ ను తీసుకెళ్లడని.. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం చాలా సూట్ కేసులు తీసుకెళ్తాడని చమత్కరించాడు. దీనిపై తాజాగా సూర్య వివరణ ఇచ్చాడు. వెళ్లే ప్రదేశం వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని దుస్తులు తీసుకెళతానని స్కై తెలిపాడు. 'నాతో పాటు నా భార్య వస్తుంది. కాబట్టి సూట్ కేసులు ఎక్కువే ఉంటాయి. ముఖ్యంగా విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఉండే వాతావరణానికి తగ్గట్లుగా బట్టలు తీసుకెళతాను. వేర్వేరు బట్టలకు వేర్వేరు బూట్లు ఉన్నాయి. అందుకే లగేజ్ ఎక్కువ అవుతుంది. దాని గురించే రోహిత్ మాట్లాడాడు. నేను మైదానంలో ఉన్నప్పుడు వేరే దాని గురించి ఆలోచించను. నేను స్కోరు చేశానా లేదా అనేది ఆలోచించను. తిరిగి వచ్చాక ఎవరితోనూ క్రికెట్ గురించి మాట్లాడను. మళ్లీ జట్టంతా కలిసి కూర్చున్నప్పుడే ఆట గురించి డిస్కస్ చేస్తాం.' అని సూర్య తెలిపాడు. 


సూర్య టెస్ట్ క్రికెట్ లో అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో హైదరాబాద్ పై 80 బంతుల్లో 90 పరుగులు చేశాడు. అందులో 15 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. నేను టెస్ట్ క్రికెట్ లోకి రావడానికి ఎంతో సమయం లేదని నాకనిపిస్తోంది. నేను ఈ ఫార్మాట్ లో ఆడాను. రెడ్ బాల్ క్రికెట్ గురించి నాకు అవగాహన ఉంది. అని సూర్య చెప్పాడు.