Kapil Dev on IPL:  1983లో ఇండియాకు ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్ క్రికెట్ ఒత్తిడిపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ క్రికెట్ ఆడడం వలన ఆటగాళ్లకు డిప్రెషన్ కు గురవుతున్నారన్న మాటలపై... కపిల్ దేవ్ కొన్నాళ్ల క్రితం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ఇప్పుడు మరోసారి డిప్రెషన్ పై అలాంటి వ్యాఖ్యలే చేసి చర్చనీయాంశంగా మారారు. 


కొన్ని నెలల క్రితం తాను తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నానని భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చెప్పాడు. ఆ తర్వాత క్రికెట్ నుంచి ఒక నెల విరామం తీసుకున్నాడు. అలాగే అప్పట్లో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కూడా మానసిక సమస్యలతో క్రికెట్ నుంచి చాలా విరామం తీసుకున్నాడు. ప్రస్తుతం చాాలామంది క్రికెటర్లు ఒత్తిడి అనే మాటను ఉపయోగిస్తున్నారు. ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్, విరామం లేని షెడ్యూల్స్ తో మానసికంగా అలసిపోతున్నామని చెప్తున్నారు. దీనిపైనే తాజాగా కపిల్ దేవ్ మాట్లాడారు. 


ఒత్తిడి అనిపిస్తే ఆడడం మానేయండి


'మేం ఐపీఎల్ ఆడుతున్నాం. చాలా ఒత్తిడి ఉంది. ఈ మధ్య కాలంలో ఈ మాట తరచుగా వింటున్నాను. అలాంటి వాళ్లకు నేను ఒకటే చెప్తాను. ఒత్తిడి ఉంటే క్రికెట్ ఆడకండి. మిమ్మల్ని ఆడమని ఎవరు అడుగుతున్నారు. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు ఒత్తిడి అనేది ఎలా సాధ్యమవుతుంది' అని కపిల్ ప్రశ్నించారు. కోల్ కతాలో ఓ ఈవెంట్ కు హాజరైనప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. 


'100 కోట్ల మంది ఉన్నదేశంలో 20 మందికి మాత్రమే దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం వస్తుంది. దానికి గర్వించాలి. కానీ మీరు ఒత్తిడి ఉందని అంటున్నారు. మీరు ప్రజల నుంచి చాలా ప్రేమను పొందుతున్నారు. మీరు పనిచేయకూడదనుకుంటే చేయకండి. మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయడంలేదు కదా. ఆడడం ఒత్తిడి అనుకుంటే వెళ్లి అరటిపళ్ల దుకాణం పెట్టుకుని, కోడి గుడ్లు అమ్ముకోండి. చేసే పనిని ఒత్తిడిగా కాకుండా ఆనందంగా చేస్తే అప్పుడు అది తేలికగా అనిపిస్తుంది. ఒత్తిడి అని ఫీలైతే అది మంచిదికాదు.' అని కపిల్ దేవ్ అన్నారు.