ఆదివారం జరగనున్న ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2022 ఫైనల్‌లో బాబర్ అజామ్ నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఐకానిక్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. 1992 ODI ప్రపంచ కప్ ఫైనల్ కూడా ఇదే మైదానంలో జరిగింది. 30 ఏళ్ల క్రితం ఇదే వేదికపై ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ 22 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి తొలి ప్రపంచకప్‌ ఫైనల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా కొనసాగారు.


ఆస్ట్రేలియాలో జరిగే T20 ప్రపంచ కప్ 2022 ట్రోఫీని పాకిస్తాన్ గెలిస్తే బాబర్ ఆజం 2048లో పాకిస్థాన్ ప్రధాని అవుతాడని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సరదాగా జోస్యం చెప్పాడు. సునీల్ గవాస్కర్ మాట్లాడిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో షేన్ వాట్సన్‌ను కూడా చూడవచ్చు.


"పాకిస్థాన్ ప్రపంచకప్ గెలిస్తే, 2048లో బాబర్ ఆజం పాకిస్థాన్ ప్రధానమంత్రి అవుతాడని మీకు తెలుసా?" అని స్టార్ స్పోర్ట్స్‌లో గవాస్కర్ అన్నారు. ఇంగ్లండ్ vs పాకిస్తాన్ T20 ప్రపంచ కప్ 2022 ఫైనల్‌కు ముందు, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను కూడా పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్ ప్రయాణం, 1992లో చారిత్రాత్మక ప్రపంచ కప్ విజయం మధ్య సారూప్యత గురించి అడిగారు.


“అవును, చాలా సారూప్యతలు ఉన్నాయి. మేం ట్రోఫీని గెలవడానికి ప్రయత్నిస్తాం. ఈ జట్టుకు నాయకత్వం వహించడం నాకు గొప్ప గౌరవం. మైదానంలో మా 100 శాతం ప్రదర్శన ఇచ్చి గెలవడానికి ప్రయత్నిస్తాం. మేం ఆశించిన విధంగా టోర్నీని ప్రారంభించలేదు. కానీ జట్టు బాగా పోరాడింది." అని మ్యాచ్‌కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో బాబర్ అన్నారు.