T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ లో ఇంగ్లండ్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన భారత జట్టు స్వదేశానికి చేరుకుంది. కోచ్ ద్రవిడ్, షమీ, దినేశ్ కార్తీక్, ఇంకా జట్టు సహాయ సిబ్బంది తదితరులు భారత్ కు వచ్చారు. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వేరే విమానంలో స్వదేశానికి చేరుకున్నారు. ఈనెల 18 న ప్రారంభమయ్యే న్యూజిలాండ్ సిరీస్ కు ఎంపికైన వారు మెల్ బోర్న్ నుంచి సరాసరి ఆక్లాండ్ కు బయలుదేరారు. ముంబయి విమానాశ్రయంలో అభిమానులు కోహ్లీతో ఫొటోలు దిగారు.
కోచ్ ద్రవిడ్ కు విరామం
టీమ్‌ఇండియా కోచింగ్ బాధ్యతలకు రాహుల్ ద్రవిడ్ కొన్నాళ్లు విరామం ఇవ్వనున్నాడు. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లడం లేదని తెలిసింది. కొన్ని రోజులు కుటుంబంతో గడిపి విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నాడు. దాంతో న్యూజిలాండ్ పర్యటనలో భారత్‌కు ఎన్‌సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా ఉంటాడు. నవంబర్ 18 నుంచి 30 వరకు కివీస్ తో 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. ఈ సిరీసుల్లో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్ కు విశ్రాంతి ఇచ్చారు.
తాత్కాలిక కోచ్ గా లక్ష్మణ్
'వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోనే సహాయ బృందం న్యూజిలాండ్ బయల్దేరనుంది. హృషికేశ్ కనిత్కర్ (బ్యాటింగ్), సాయిరాజ్ బహుతులే (బౌలింగ్) వీవీఎస్‌కు తోడుగా ఉంటారు' అని బీసీసీఐ వర్గాలు పీటీఐకి తెలిపాయి. టీమ్‌ఇండియాకు వీవీఎస్ కోచింగ్ ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్ సిరీసుల్లో ఈ బాధ్యతలు నిర్వహించాడు. ద్రవిడ్ విశ్రాంతి తీసుకొనేందుకు సహకరించాడు.
టీ20లకు హార్దిక్.. వన్డేలకు ధావన్
న్యూజిలాండ్ తో టీ20 సిరీసుక్ కు హార్దిక్ పాండ్య సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 18న వెల్లింగ్టన్, 20న మౌంట్ మాంగనూయ్, 20న నేపియర్‌లో పొట్టి క్రికెట్ పోటీలు ఉంటాయి. వన్డే సిరీసుకు శిఖర్ ధావన్ కెప్టెన్సీ చేస్తాడు. నవంబర్ 25న ఆక్లాండ్, 27న హ్యామిల్టన్, 30న క్రైస్ట్ చర్చ్‌లో వన్డేలు జరుగుతాయి. డిసెంబర్ 4 నుంచి బంగ్లాదేశ్‌లో భారత్ పర్యటిస్తుంది. ఇందులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ ఆడనున్నారు.
టీమిండియాకు సచిన్ టెండుల్కర్ బాసటగా నిలిచారు. ఇప్పటికీ మన జట్టు టీ 20 క్రికెట్‌లో నెంబర్ వన్ అంటూ ప్రశంసించారు.