Sunil Gavaskar livid with BCCI : భారతదేశంలో ఇప్పటి వరకు జీవించి ఉన్న వారిలో అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్, మాజీ కెప్టెన్ దత్తాజీరావు గైక్వాడ్ (DK Gaekwad )95 ఏళ్ళవయసులో కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యల వల్ల  12 రోజులు  బరోడా ఆసుపత్రిలో చిక్సిత పొందిన ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. అయితే దత్తాజీరావ్‌ గైక్వాడ్‌ మరణించిన నాలుగు రోజుల తర్వాత భారత జట్టు ఆటగాళ్లు సంతాపం తెలిపారు. ఇంగ్లండ్‌తో మూడో టెస్టు మూడో రోజు ఆట సందర్భంగా అతనికి నివాళిగా.. భారత జట్టు ఆటగాళ్లు చేతికి బ్లాక్ బ్యాండ్స్ ధరించి మైదానంలోకి అడుగుపెట్టారు. మరణించిన నాలుగు రోజుల తర్వాత నల్ల బ్యాండ్లతో భారత జట్టు బరిలోకి దిగడంపై దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ అగ్రహం వ్యక్తం చేశాడు. అయనొక భారత జట్టుమాజీ కెప్టెన్‌ అని, జట్టు మేనెజ్‌మెంట్‌ మొదటి రోజు ఆటలోనే నివాళి అర్పించి ఉండే బాగుండేదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. గైక్వాడ్‌ భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించారని... ఆయన ఉన్న లేకపోయినా గౌరవించాల్సిన అవసరం మనకు ఉందని గవాస్కర్‌ అన్నారు. ఆయన మృతి పట్ల మొదటి రోజు ఆటలోనే సంతాపం వ్యక్తం చేయాల్సిందన్నారు. ఈ నిర్ణయాన్ని ముందుగా ఎందుకు తీసుకోలేదో తనకు అర్థం కావడం లేదన్న గవాస్కర్‌... . గతంలో ఎప్పుడూ కూడా ఇంత ఆలస్యం జరగలేదని గుర్తు చేశారు. 

 

దత్తాజీరావ్‌ గైక్వాడ్‌ కెరీర్‌

దత్తాజీరావు గైక్వాడ్ మాజీ క్రికెటర్, మాజీ హెడ్ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ తండ్రి. జూన్ 1952లో ఇంగ్లండ్ పై టీమిండియా తరఫున తొలి టెస్ట్ ఆడిన గైక్వాడ్ 9 ఏళ్ల పాటు 11 టెస్టులు ఆడాడు. 350 పరుగులు చేశాడు. వాటిలో నాలుగు టెస్టులకు కెప్టెన్ గా ఉన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో బరోడా తరఫున 17 ఏళ్ల పాటు ఆడాడు. 1947 నుంచి 1964 మధ్య 110 మ్యాచ్ లలో 17 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలతో 5788 రన్స్ చేశాడు. దత్తాజీరావు గైక్వాడ్ తన చివరి టెస్టును 1961లో పాకిస్థాన్ పై ఆడారు.

 

2016లో 87 ఏళ్ల వయసులో మాజీ క్రికెటర్ దీపక్ శోధన్ తర్వాత దేశంలో జీవించి ఉన్న ఓల్డెస్ట్ టెస్ట్ క్రికెటర్ ట్యాగ్ ఈ దత్తాజీరావు గైక్వాడ్ పేరుకి మారింది. అయితే గత 12 రోజులుగా దత్తాజీరావు బరోడా హాస్పిటల్లోని ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నట్లు న్యూస్ ఏజెన్సీ పీటీఐ వెల్లడించింది. దత్తాజీరావు గైక్వాడ్ తనయుడు అన్షుమన్ గైక్వాడ్ కూడా ఇండియా తరఫున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. ఆ తర్వాత టీమిండియా కోచ్ గానూ పని చేశాడు. దత్తాజీరావు గైక్వాడ్ మరణానికి ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ సంతాపం తెలిపింది.

 

మూడో టెస్ట్‌ సాగుతుందిలా..?

రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత్‌ పట్టు బిగించింది. రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్‌ ఆధిపత్యం ప్రదర్శించగా... మూడోరోజు టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌లో బ్రిటీష్‌ జట్టును త్వరగానే అవుట్‌ చేసిన భారత జట్టు... అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో మెరుగ్గా బ్యాటింగ్‌ చేసి టెస్ట్ మ్యాచ్‌పై పట్టు బిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ప్రస్తుతం 322 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్‌ చేతిలో ఇంకా ఎనిమిది వికెట్లు ఉన్నాయి. యశస్వి జైస్వాల్‌ మరోసారి శతక గర్జన చేశాడు.  ఇంకో రెండు రోజులు ఆట మిగిలి ఉన్న వేళ... భారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.