Cheteshwar Pujara hits another ton: టీమిండియా టెస్టు స్టార్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దేశవాళీ ప్రతిష్ఠాత్మకమైన రంజీట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున పరుగుల వరద పారిస్తున్నాడు. సెంచరీల మీద సెంచరీలు చేస్తూ సెలక్షన్ కమిటీకి హెచ్చరికలు పంపుతున్నాడు. తన బ్యాటింగ్ శైలిని పూర్తిగా మార్చేసుకున్న పుజారా బజ్‌బాల్ ఆటతో ఆకట్టుకుంటున్నాడు. ఎంతటి ప్రమాదకర బౌలర్‌ను అయినా తన డిఫెన్స్‌తో నిస్సహాయులుగా మార్చేసే పుజారా ఇప్పుడు తన ఎటాకింగ్ గేమ్‌తో బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు.
టీ 20 తరహా బ్యాటింగ్
దేశవాళీ రంజీ ట్రోఫీ 2024లో పుజారా దుమ్ములేపుతున్నాడు. ఈ సీజన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న పుజారా ఇప్పిటికే మూడు సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో పరుగుల వరద పారించాడు. అందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న పుజరా..తాజాగా మరో ఫస్ట్ క్లాస్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. రాజ్‌కోట్ వేదికగా మణిపూర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా అద్బుతమైన సెంచరీతో సత్తా చాటాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పుజారా తన శైలికి విరుద్దంగా టీ20 తరహాలో ఆడాడు. 105 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 108 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పుజారాకు ఇది 63వ సెంచరీ. ప్రస్తుత సీజన్‌లో ఓవరాల్‌గా 7 మ్యాచ్‌లు ఆడిన పుజారా 77 సగటుతో తో 673 పరుగులు చేశాడు.ఇందులో పుజారా మూడు సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో పరుగుల వరద పారించాడు. పుజారా ప్రస్తుత ఫామ్‌ను చూస్తే రీ ఎంట్రీ ఇచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. భారత్ తరపున టెస్టుల్లో పుజారాకు ఘనమైన రికార్డు ఉంది. 103 టెస్టుల్లో పుజారా 43 సగటుతో 7195 పరుగులు చేశాడు. అతడి కెరీర్‌లో 19 సెంచరీలు, మూడు డబుల్ సెంచరీలు ఉన్నాయి.
ఈ రంజీ ట్రోఫీలోనే...
స్పెషలిస్ట్ టెస్ట్ బ్యాటర్ అయిన పూజారా 243 రన్స్‌తో విరుచుకుపడ్డాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (World Test Championship)లో బ్యాటింగ్‌లో విఫలమై జట్టుకు దూరమైన నయావాల్ Pujara ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 17వ ద్విశతకం నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు తాను సిద్దంగా ఉన్నానంటూ సెలెక్టర్లుకు సందేశాలు పంపాడు. జార్ఘండ్ బౌలర్లను ఉతికారేస్తూ 356 బంతుల్లో డబుల్ సెంచరీ బాది జట్టుకు భారీ స్కోర్ అందించాడు. దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న పుజారా.. తొలి మ్యాచ్‌లోనే ద్వి శతకం చేయడం విశేషం. ఈ డబుల్ సెంచరీతో చెలరేగిన పుజారా అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు.
పుజారా రికార్డులు
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన నాలుగో ఆటగాడిగా పుజారా నిలిచాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా లెజెండ్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ (Don Bradman) 37 డబుల్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా పుజారా 19, 730 రన్స్‌తో రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్ 19,729ను పుజారా అధిగమించాడు.