Manoj Tiwary has announced his retirement from all forms of cricket : ప‌శ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మ‌నోజ్ తివారీ(Manoj Tiwary )  ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రక‌టించనున్నాడు. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బిహార్‌తో మ్యాచ్ త‌న‌కు చివ‌రిద‌ని మనోజ్‌ తివారీ ప్రకటించేశాడు. గతంలో ఓసారి రిటైర్మెంట్‌ ప్రకటించి వెనక్కి తీసుకున్న మనోజ్‌ తివారీ... ఈసారి మాత్రం రిటైర్‌మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోనని తెలిపాడు. త‌న రంజీ కెరీర్.. ఈడెన్ గార్డెన్స్‌తో త‌న‌కున్న అనుబంధాన్ని చెప్తూ ఓ భావోద్వేగ పోస్ట్ చేశాడు.  2006లో రంజీల్లో అరంగేట్రం చేసిన తివారీ 2008లో టీమిండియాలో అరంగేట్రం చేశాడు. అయితే.. అత‌డికి కేవ‌లం 12 వ‌న్డేలు, 3 టీ20లు ఆడే అవ‌కాశం వ‌చ్చింది. భార‌త జ‌ట్టు త‌ర‌ఫున 2015లో జింబాబ్వేపై చివ‌రి మ్యాచ్ ఆడేసిన తివారీ రంజీల‌పై దృష్టి పెట్టాడు. 141 ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన మనోజ్‌ తివారీ... 30 సెంచ‌రీలు, 45 హాఫ్ సెంచ‌రీలు బాదాడు. టీమిండియాలో చోటు కోల్పోయిన తివారీ ఐపీఎల్‌లో మెరిశాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌, కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్, రైసింగ్ పూణే సూప‌ర్ జెయింట్స్‌  ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వ‌హించాడు.


 

అప్పట్లో అలా..

2023 అగస్టులో రిటైర్‌మెంట్‌ ప్రకటించిన మనోజ్‌ తివారీ... వారం రోజుల తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. రిటైర్మెంట్‌ను  వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. బెంగాల్ జట్టుకు రంజీ ట్రోఫీ అందించడం తన కల అని దానిని ఎలాగైనా వచ్చే ఏడాది సాధించి తీరుతానని ఆ తర్వాత మళ్లీ రిటైర్మెంట్ తీసుకుంటానని చెప్పాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడు స్నేహశీశ్ గంగూలీ (సౌరవ్ గంగూలీ సోదరుడు)  చేసిన విజ్ఞప్తి మేరకు తన నిర్ణయాన్ని మార్చుకున్నానని తెలిపాడు. ‘రాజ్ దా (స్నేహశీశ్) నన్ను కన్విన్స్ చేశాడు. రంజీ ట్రోఫీలో మరో ఏడాది ఆడాలని కోరాడు. అందుకే నేను రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నా. వచ్చే రంజీ సీజన్‌లో బెంగాల్‌కు ఆడతా. కానీ ఆ తర్వాత మాత్రం రిటైర్మెంట్ వెనక్కి తీసుకోను..’ అని చెప్పాడు.

 

నా భార్యను అడిగా..

తాను రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవడంపై తన భార్యాను సలహాలు అడిగానని, ఆమె కూడా అందుకు సమ్మతం తెలపడం కూడా తనను మళ్లీ క్రికెట్ ఆడే విధంగా ప్రోత్సహించిందని తివారి తెలిపాడు. ‘నేను రిటైర్మెంట్ తర్వాత నా భార్యతో చర్చించా.  తాను కూడా నేను మరో సీజన్ ఆడేందుకు  మోటివేట్ చేసింది. గతేడాది బెంగాల్ జట్టుకు రంజీ చేరగా దానికి నేనే సారథ్యం వహించిన విషయాన్ని గుర్తు చేస్తూ  మరో ఏడాది ఆడమని చెప్పింది.  నేను రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత చాలా మంది అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా నన్ను రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని కోరుతూ మెసేజ్‌లు పెట్టారు..’ అని  తెలిపాడు. బెంగాల్ క్రికెట్ తనకు ఎంతో ఇచ్చిందని.. అటువంటి క్యాబ్ కోసం తాను ఒక్క ఏడాదిని ఇవ్వడం పెద్ద విషయమే కాదని తివారి  వ్యాఖ్యానించాడు. బెంగాల్ తరఫున  తాను మరో ఏడాది  ఆడి ఆ తర్వాత  రిటైర్మెంట్ తీసుకుంటానని, అప్పుడు మాత్రం యూటర్న్ ఉండదని అన్నాడు.