Ind Vs Eng 3rd Odi Highlights: ఇంగ్లాండ్ బ్యాట‌ర్ టామ్ బాంట‌న్ పై భార‌త దిగ్గ‌జ క్రికెట‌ర్ సునీల్ గావ‌స్క‌ర్ ఫైర‌య్యాడు. మూడో వ‌న్డేలో అన‌వ‌స‌రంగా రివ్యూ వేస్ట్ చేయ‌డంపై మండిప‌డ్డాడు. క్రికెట్ అనేది స్కూల్ గేమ్ కాదని, అంత‌ర్జాతీయ లెవ‌ల్లో ఆడుతున్న‌ప్పుడు కాస్త బాధ్య‌త‌గా ఉండాల‌ని చుర‌క‌లు అంటించాడు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ఇంగ్లాండ్ ఛేజింగ్ లో కుల్దీప్ యాద‌వ్ వేసిన‌ 18వ ఓవ‌ర్ ఆఖ‌రి బంతిని బాంట‌న్ ఆడాడు. అది అత‌ని బ్యాడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీప‌ర్ కేఎల్ రాహుల్ చేతుల్లో ప‌డింది. దీంతో సంబ‌రాలు చేసుకుంటూ రాహుల్ అప్పీల్ చేయ‌గా, అంపైర్ ఔటిచ్చాడు. దీనిపై బాంట‌న్ కాస్త తిక‌మ‌క‌ప‌డ్డాడు. త‌న బ్యాట్ కు ఎడ్జ్ త‌గిలిందో లేదోన‌ని కాసేపు నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న జో రూట్ తో చ‌ర్చించాడు. ఆ త‌ర్వాత తీరిక‌గా రివ్యూ తీసుకున్నాడు. అయితే రివ్యూలో బ్యాట్ కు బంతి తాకింద‌ని తేల‌డంతో అంపైర్ నిర్ణ‌యాన్నే థ‌ర్డ్ అంపైర్ స‌మ‌ర్థించాడు. దీంతో ఉస్సూరుమంటూ బాంట‌న్ పెవిలియ‌న్ కు వెళ్లిపోయాడు. 






ఆ మాత్రం తెలియ‌దా..?


క్యాచ్ ఔట్ కోసం రివ్యూ తీసుకుని, దాన్ని వేస్ట్ చేయ‌డంపై గావస్క‌ర్ అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. బ్యాట‌ర్ కు త‌న బ్యాటుకు బంతి తాకిందో లేదో క‌చ్చితంగా తెలుస్తుంది. ఒక‌వేళ బ్యాట్.. ప్యాడ్ కు గానీ, గ్రౌండ్ కు తాకిన‌ప్పుడు మాత్రమే కాస్త సందేహం వ్య‌క్త‌మ‌వుతుంది. అయితే బాంట‌న్ కేసులో బ్యాట్ అటు ప్యాడ్ కు గానీ, ఇటు గ్రౌండ్ కు గానీ తాక‌లేదు. ఎడ్జ్ విష‌యంలో త‌న‌కో ఐడియా ఉండాల‌ని, అన‌వ‌స‌రంగా రివ్యూను వేస్ట్ చేశాడ‌ని గావస్క‌ర్ పేర్కొన్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడుతున‌ప్పుడు అనుక్ష‌ణం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఏమ‌ర‌పాటుకు ఏమాత్రం తావివ్వ‌కూడ‌ద‌ని వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్ లో భార‌త్ 356 ప‌రుగుల భారీ స్కోరు చేయ‌గా, ఇంగ్లాండ్ 214 ప‌రుగులకే ఆలౌట్ అయ్యి, 142 ప‌రుగుల తేడాతో ఘోర ప‌రాజ‌యం పాలైంది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్ ను 3-0తో భార‌త్ క్లీన్ స్వీప్ చేసింది.  



సెంచ‌రీ చేస్తే బాగుండేది..
మ‌రోవైపు ఈ వ‌న్డే సిరీస్ లో అనూహ్యంగా తుదిజ‌ట్టులో చోటు ద‌క్కించుకున్న శ్రేయ‌స్ అయ్య‌ర్.. సిరీస్ లో 181 ప‌రుగులు చేసి, రెండో లీడింగ్ ఇండియ‌న్ బ్యాట‌ర్ గా నిలిచాడు. ఇక మూడో వ‌న్డేలో సెంచ‌రీ మిస్ కావ‌డంపై అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. నిజానికి ఈ వ‌న్డేలో సెంచ‌రీ చేస్తాన‌ని ఆశించాన‌ని, అది మిస్ కావ‌డంతో కాస్త నిరాశ‌కు లోన‌య్యాన‌ని శ్రేయ‌స్ చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్ లో రాణించ‌డం ఆనందంగా ఉంద‌ని వ్యాఖ్యానించాడు. జ‌ట్టు క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్న‌ప్పుడు మెరుపు ఇన్నింగ్స్ తో మూమెంటం మార్చాడు. ఇక రెండో వ‌న్డేలో మంచి స్థితిలో బ్యాటింగ్ చేస్తున్న‌ప్పుడు అన్ ల‌క్కీగా ర‌నౌట‌య్యాడు. మూడో వ‌న్డేలో మంచి పునాది ల‌భించిన స్థితిలో బ్యాటింగ్ చేసిన తాను సెంచ‌రీ చేస్తే బాగుండేన‌ని వ్యాఖ్యానించాడు. ఆదిల్ ర‌షీద్ బౌలింగ్ లో లెగ్ సైడ్ కు వెళ‌తున్న బంతిన వేటాడి శ్రేయ‌స్ ఔట‌య్యాడు. ఈ మ్యాచ్ లో త‌ను 78 ప‌రుగుల‌తో సెకండ్ హ‌య్యెస్ట్ స్కోర‌ర్ గా నిలిచాడు. వ‌చ్చేవారం నుంచి ప్రారంభ‌మ‌య్యే ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీకి మెరుగ్గా స‌న్న‌ద్ధ‌మ‌య్యేందుకు ఈ సిరీస్ విజ‌యం ఉప‌క‌రిస్తుంద‌ని శ్రేయ‌స్ వ్యాఖ్యానించాడు. జ‌ట్టు అన్నిరంగాల్లో స‌త్తా చాటి, మెగాటోర్నీకి సిద్ధంగా ఉంద‌ని తెలిపాడు. 


Read Also: Champions Trophy Team India Squad: ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించిన బీసీసీఐ, గాయంతో పేసర్ బుమ్రా దూరం