Ind Vs Eng Odi Series Clean Sweap: సిరీస్ క్లీన్ స్వీప్.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. 142 రన్స్ తో ఇంగ్లాండ్ ఘోర పరాజయం
3 వన్డేల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఇంగ్లాండ్ తోనే జరిగిన టీ20 సిరీస్ ను కూడా 4-1తో గెలుచుకుంది.ఈ సిరీస్ విజయంతో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఆత్మ విశ్వాసంతో భారత్ సిద్ధం కానుంది.

Ahmadabad Odi Result Update: బౌలర్లు సమష్టిగా రాణించడంతో ఇంగ్లాండ్ తో జరిగిన మూడో వన్డేలో 142 పరుగులతో భారత్ విజయం సాధించింది. బుధవారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ సరిగ్గా 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. శుభమాన్ గిల్ (112) సెంచరీతో కదం తొక్కాడు. ఆదిల్ రషీద్ కు నాలుగు వికెట్లు దక్కాయి. ఛేదనలో 34.2 ఓవర్లలో 214 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌటైంది. టామ్ బాంటన్, గస్ అట్కిన్సన్ చెరో 38 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచారు. బౌలర్లలో అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాలకు తలో రెండు వికెట్లు దక్కాయి. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. అంతకుముందు ఇంగ్లాండ్ తోనే జరిగిన టీ20 సిరీస్ ను కూడా 4-1తో గెలుచుకున్న సంగతి తెలిసిందే.ఈ సిరీస్ విజయంతో వచ్చేవారం ప్రారంభమయ్యే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఆత్మ విశ్వాసంతో భారత్ సిద్ధం కానుంది.
ఆరంభంలోనే షాక్..
భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. గాయం కారణంగా చురుగ్గా కదలలేకపోయిన ఓపెనర్ బెన్ డకెట్ (34)ను అర్షదీప్ బోల్తా కొట్టించాడు. అంతకుముందు ఓవర్ కు పదికిపైగా రన్ రేట్ తో ఇంగ్లాండ్ పరుగులు సాధించింది. డకెట్ ఔటైన తర్వాత మిగతా బ్యాటర్లు పోరాట పటిమ కనబర్చ లేకపోయారు. ఫిల్ సాల్ట్ (23), బాంటన్, జో రూట్ (24), హారీ బ్రూక్ (19) తమకు దక్కిన శుభారంభాల్ని భారీ స్కోర్లుగా మలచ లేకపోయారు. కెప్టెన్ జోస్ బట్లర్ (6), లియామ్ లివింగ్ స్టన్ (9) కూడా ఔటవడంతో ఇంగ్లాండ్ కు విజయంపై ఆశలు సన్నగిల్లాయి. చివరలో అట్కిన్సన్ కాస్త బ్యాట్ ఝుళిపించి, ఓటమి అంతరాన్ని తగ్గించాడు. కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ లకు చెరో వికట్ దక్కింది. బౌలింగ్ చేసిన భారత బౌలర్లు అందరికీ వికెట్ లభించడం విశేషం.
భారత్ భారీ స్కోరు..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఈ వేదికపై భారీ స్కోరును నమోదు చేసి రికార్డులకెక్కకింది. గిల్ తోపాటు విరాట్ కోహ్లీ (52), శ్రేయస్ అయ్యర్ (78) అర్థ సెంచరీలు బాదడంతో జట్టు స్కోరు ఒక దశలో 400 పరుగులు దాటుతుందని పించింది. అయితే కీలకదశలో వికెట్లు తీసిన ఇంగ్లాండ్ బౌలర్లు కాస్త పుంజుకున్నారు. చివర్లో కేఎల్ రాహుల్ (40) టీ20 తరహాలో ఆడటంతో జట్టు భారీ స్కోరు చేసింది. సరిగ్గా 50వ ఓవర్ ఆఖరి బంతికి 356 పరుగులకు ఆలౌటైంది. మార్క్ వుడ్ కు రెండు, సాకిబ్ మహ్మూద్, అట్కిన్సన్, రూట్ లకు తలో వికెట్ దక్కింది. సెంచరీతో చెలరేగిన గిల్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి.