Champions Trophy Team India Squad: ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించిన బీసీసీఐ, గాయంతో పేసర్ బుమ్రా దూరం
Jasprit Bumrah ruled out of ICC Champions Trophy 2025 | టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి దూరమయ్యాడు.

Team India Squad for Champions Trophy 2025: ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే భారత జట్టుకు ఎదురుదెబ్బ తగలింది. టీమిండియా స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా (Jasprit Bumrah) ఐసీసీ కీలక టోర్నీకి దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ సందర్భంగా వెన్నునొప్పి సమస్య బారిన పడిన బుమ్రా ఇంకా కోలుకోలేదు. దాంతో యువ పేసర్ హర్షిత్ రాణాకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛాన్స్ ఇచ్చింది.
ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించి బీసీసీ సెలక్షన్ కమిటీ బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా పేరు ప్రకటించింది. స్టార్ బ్యాటర్, యువ సంచలనం యశస్వీ జైస్వాల్‌కు తుది 15 మందిలో చోటు దక్కలేదు. నాన్ ట్రావెలింగ్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ జాబితాలో జైస్వాల్‌ను చేర్చారు. అదే సమయంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఈ ఐసీసీ టోర్నీకి ఎంపిక చేశారు.
ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ షమీ, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా.
నాన్ ట్రావెలింగ్ సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లు వీరే: ముగ్గురు ప్లేయర్లను నాన్ ట్రావెలింగ్ సబ్‌స్టిట్యూట్‌గా సెలక్షన్ కమిటీ ఎంపికి చేసింది. వీరిలో యశస్వి జైస్వాల్ ఓపెనర్ బ్యాటర్ కాగా, మహ్మద్ సిరాజ్ పేసర్ బౌలర్, ఆల్ రౌండర్ శివం దూబెలను నాన్ ట్రావెలింగ్ సబ్‌స్టిట్యూట్‌గా తీసుకున్నారు. జట్టుకు ఏ క్షణంలోనైనా అవసరం పడితే ఈ ఆటగాళ్లు దుబాయ్ వెళ్లనున్నారని బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా ఓ ప్రకటనలో తెలిపారు.
గాయం నుంచి కోలుకోని బుమ్రా..
ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రాపై ఓవర్ బర్డన్ పడింది. జట్టుకు వికెట్ అవసరం అయినప్పుడల్లా కెప్టెన్ రోహిత్ శర్మ పేసర్ బుమ్రాకు బంతినిచ్చాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో పెట్టుకుని బుమ్రాపై భారం తగ్గించాల్సిందని మాజీ క్రికెటర్లతో పాటు టీమిండియా ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ బుమ్రాకు ఏదైనా పెద్ద గాయం అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండే అవకాశం ఉండదని అంతా అనుకున్నట్లే జరిగింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తరువాత బుమ్రా జట్టుకు దూరంగా ఉంటున్నాడు.
ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగే మూడో వన్డేలో ఆడి బుమ్రా ఫిట్‌నెస్‌ను చాటుకంటాడని ప్రచారం జరిగింది. వెన్నునొప్పి కారణంగా బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైనట్లు సెలక్షన్ కమిటీ పిడుగు లాంటి వార్త చెప్పింది. బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి పరిమితమయ్యాడు. అతడి స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాకు బీసీసీఐ ఛాన్స్ ఇచ్చింది.