Chamika Karunaratne Hospitalized:  ఆటల్లో గాయాలు అవడం సర్వసాధారణం. ఔట్ సైడ్ ఆడే ఏ క్రీడలో అయినా క్రీడాకారులు గాయాలపాలవుతుంటారు. క్రికెట్లోనూ చాలాసార్లు చాలామంది ఆటగాళ్లు గాయాల బారిన పడుతుంటారు. అయితే కొన్నిసార్లు ఆ గాయాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆస్ట్రేలియా ఆటగాడు ఫిలిప్ హ్యాస్ మెడ వెనుక బంతి తగిలి ప్రాణాలు కోల్పోయిన ఘటనను క్రికెట్ ప్రపంచం అంత త్వరగా మర్చిపోలేదు. అలాగే మార్క్ బౌచర్ కంటికి గాయమవటంతో అతడు ఒక కంటి చూపును కోల్పోయాడు. అలాగే తన క్రికెట్ కెరీర్ ను అర్ధంతరంగా ముగించాడు. 


ప్రస్తుతం శ్రీలంక ఆటగాడు చమిక కరుణరత్నేకు అలాంటిదే తీవ్ర గాయం అయ్యింది. దానివలన అతని పళ్లు నాలుగు ఊడిపోయాయి. అసలేమయిందంటే.... లంక ప్రీమియర్ లీగ్ లో భాగంగా బుధవారం క్యాండీ ఫాల్కన్స్- గాలే గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. చమిక కరుణరత్నే ఫాల్కన్ తరఫున ఆడుతున్నాడు. ఆఫ్ సైడ్ సర్కిల్ లోపల ఫీల్డింగ్ చేస్తున్న కరుణరత్నే గ్లాడియేటర్స్ ఆటగాడు కొట్టిన బంతిని క్యాచ్ పట్టుకునేందుకు వెనక్కు పరిగెత్తాడు. అయితే అతడు ఆ బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. దీంతో బంతి నేరుగా అతని నోటిని బలంగా తాకింది. అంతే అతని పళ్లు నాలుగు ఊడిపోయాయి. క్యాచ్ అయితే పట్టాడు కానీ గాయం తీవ్రతకు ఒక్క క్షణం ఏం జరుగుతుందో అతనికి అర్ధం కాలేదు. 


వెంటనే అతడు మైదానాన్ని వీడాడు. అనంతరం గాలేలోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. ప్రస్తుతం కరుణరత్నే క్షేమంగా ఉన్నాడని ఫాల్కన్స్ యాజమాన్యం తెలిపింది. ఈ మ్యాచులో గాలే జట్టుపై ఫాల్కన్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 121 పరుగుల లక్ష్యాన్ని 15 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది కెండీ ఫాల్కన్స్ జట్టు. కెండీ ఫాల్కన్స్ జట్టుకి లంక యంగ్ ఆల్‌రౌండర్ వానిందు హసరంగ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 


ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2022 టోర్నీలో ఆడిన చమీక కరుణరత్నే, ఏడాది నిషేధానికి గురయ్యాడు. శ్రీలంక క్రికెట్ అసోసియేషన్ నిబంధనలను బేఖాతరు చేసినందుకు ఛమీక కరుణరత్నెను ఏడాది పాటు ఏ ఫార్మాట్ ఆడకుండా నిషేధించిన లంక బోర్డు,  ఐదు వేల యూఎస్ డాలర్ల  (భారత కరెన్సీలో  సుమారు రూ. 4 లక్షలు) జరిమానా కూడా విధించింది..


టీ20 ప్రపంచకప్ 2022 కోసం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన ఛమీక కరుణరత్నే, బ్రిస్బేన్‌లోని ఓ క్యాసినోలో తప్పతాగి, అక్కడ కొంతమందితో గొడవపడ్డట్టు సమాచారం. ఇంగ్లాండ్ పర్యటనలో కరోనా నిబంధనలను ఉల్లంఘించి ముగ్గురు లంక క్రికెటర్లు, బయో బబుల్ దాటి స్వేచ్ఛగా విహరించడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. అప్పటి నుంచి లంక క్రికెటర్లపై కఠిన ఆంక్షలు విధిస్తోంది  బోర్డు.