IND vs BAN 3rd ODI: బంగ్లాదేశ్ పర్యటనలో టీమ్‌ఇండియాకు వరుస షాకులు తగులుతున్నాయి! గాయాలు, ఫిట్‌నెస్‌ సమస్యలతో ముగ్గురు ఆటగాళ్లు సిరీస్‌కు దూరమయ్యారని కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, బౌలర్లు దీపక్‌ చాహర్, కుల్దీప్‌ సేన్‌ మూడో వన్డే ఆడటం లేదని పేర్కొన్నాడు. కుర్రాళ్లు గాయాల పాలవ్వడం బాధాకరమని, తాము కోరుకున్నట్టుగా పూర్తి స్థాయి జట్టు లేదని వెల్లడించాడు.


'రోహిత్‌ మూడో వన్డే ఆడడు. ముంబయికి వెళ్లి వైద్య నిపుణులను సంప్రదిస్తాడు. టెస్టు మ్యాచుల కోసం తిరిగొస్తాడో లేదో తెలియదు. ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుంది' అని రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు. ఇక దీపక్‌ చాహర్‌ రెండో వన్డేలో కేవలం మూడు ఓవర్లే వేశాడు. ఫిట్‌నెస్ సమస్యతో మళ్లీ మైదానంలోకి రాలేదు. యువ పేసర్‌ కుల్దీప్‌ సేన్‌ వెన్ను నొప్పితో రెండో వన్డేకు ఎంపికవ్వలేదు. వీరిద్దరూ సిరీస్‌కు దూరమయ్యారని ద్రవిడ్‌ తెలిపాడు.




'ఆ ముగ్గురూ తర్వాతి వన్డే ఆడటం లేదు' అని ద్రవిడ్‌ అన్నాడు. గాయపడ్డప్పటికీ రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ చేసిన తీరు నచ్చిందని పేర్కొన్నాడు. దాదాపుగా జట్టును విజయానికి చేరువ చేశాడని వెల్లడించాడు. 'గాయపడ్డాక అలా  బ్యాటింగ్‌ చేయడం అద్భుతం. నిజానికి అతడి చేతి ఎముకలు పక్కకు తొలిగాయి. దాన్ని సరిచేసుకొనేందుకు ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. చేతికి కుట్లు వేశారు. రెండు మూడు సూదులు ఇచ్చారు. అలాంటి స్థితిలో టీమ్‌ఇండియాను విజయానికి చేరువ చేయడం ప్రశంసనీయం' అని ద్రవిడ్‌ అన్నాడు.


రెండో వన్డేలో శ్రేయస్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్‌ కీలక ఇన్నింగ్సులు ఆడారని ద్రవిడ్‌ తెలిపాడు. వారిద్దరి భాగస్వామ్యం బాగుందని ప్రశంసించాడు. వారిద్దరూ కలిసి మరో 30-40 పరుగులు చేసుకుంటే ఫలితం మరోలా ఉండేదని వెల్లడించాడు. వారిద్దరూ బాగా ఆడి టీమ్‌ఇండియాను పోటీలోకి తీసుకొచ్చారని పేర్కొన్నాడు.