SL vs AFG, Asia Cup 2023:
ఆసియాకప్ -2023లో అఫ్గానిస్థాన్ కథ ముగిసింది. ఆ జట్టు సూపర్ 4కు చేరకుండానే నిష్క్రమించింది. శ్రీలంకపై పోరాడి ఓడింది. కానీ.. ఇది గుర్తించుకోదగ్గ ఓటమే! వారి పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పఠాన్లు సింహళీయులకు చుక్కలు చూపించారు. 37.4 ఓవర్లకు 289 పరుగులకు ఆలౌట్ అయ్యారు. హష్మతుల్లా షాహిది (59; 66 బంతుల్లో 3x4, 1x6), మహ్మద్ నబీ (65; 32 బంతుల్లో 6x4, 5x6) అదరగొట్టారు. అంతకు ముందు లంకలో కుశాల్ మెండిస్ (92; 84 బంతుల్లో 6x4, 3x6) అదరగొట్టాడు. త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. ఓపెనర్ పాథుమ్ నిసాంక (41; 40 బంతుల్లో 6x0), చరిత్ అసలంక (36; 43 బంతుల్లో 2x4, 1x6) రాణించారు.
ఆరంభం భయకానకం
సూపర్ -4కు చేరాలంటే అఫ్గానిస్థాన్ 37.1 ఓవర్లకు 292 పరుగులు చేయాలి! అందుకు తగ్గట్టే ఆడింది ఆ జట్టు. ఆరంభం నుంచీ దంచుడే లక్ష్యంగా పెట్టుకుంది. అలాగని చెత్త షాట్లేమీ ఆడలేదు. చక్కని బంతుల్ని గౌరవించింది. చెత్త బంతుల్ని వేటాడింది. ముఖ్యంగా పోరాడితే పోయేదేమీ లేదన్న మైండ్‌సెట్‌తో ఛేజ్ చేసింది. నిజానికి వారికి శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు రెహ్మనుల్లా గుర్బాజ్ (4), ఇబ్రహిమ్ జర్దాన్ (7) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఈ క్రమంలో గుల్బదిన్ నయీబ్ (22; 16 బంతుల్లో 4x4), రెహ్మత్ షా (45; 40 బంతుల్లో 5x4, 1x6) దంచికొట్టారు. 15.5 ఓవర్లకే స్కోరును 100కు చేర్చారు. జట్టు స్కోరు 50 వద్ద నయీబ్, 121 వద్ద రెహ్మత్ షా ఔటయ్యారు.
నబీ, షాహిది విధ్వంసం
మహ్మద్ నబీ, హస్మతుల్లా షాహిదీ వచ్చాక ఛేజింగ్ మరింత థ్రిల్లింగ్‌గా మారింది. వీరిద్దరూ పోటీపడి మరీ లంకేయుల బౌలింగ్‌ను చితకబాదారు. నబీ 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. మరోవైపు షాహిది ఇందుకు 51 బంతులు తీసుకున్నాడు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్‌కు 47 బంతుల్లో 80 పరుగుల భాగస్వామ్యం అందించారు. జట్టు స్కోరు 201 వద్ద నబీని థీక్షణ, 234 వద్ద కరీమ్ జన్నత్ (22), 237 వద్ద షాహిదిని వెల్లలగె ఔట్ చేశాడు. దాంతో సూపర్ 4 చేరాలంటే 13 బంతుల్లో 27 పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఇంకేముంది రషీద్ ఖాన్ (27 నాటౌట్; 16 బంతుల్లో 4x4, 1x6), నజీబుల్లా జర్దాన్ (23; 15 బంతుల్లో 1x4, 2x6) కలిసి పోరాడారు. 23 బంతుల్లో 39 పరుగుల భాగస్వామ్యం చేశారు.
ఆఖరి వరకు థ్రిల్లింగ్
37 ఓవర్లకు అఫ్గాన్ 289/8కి చేరుకుంది. ఆ తర్వాతి బంతికి మూడు పరుగులు చేయాలి. కానీ ధనంజయ వేసిన 37.1వ బంతికి ముజీవ్ ఔటయ్యాడు. అప్పటికీ మరో అవకాశం కనిపించింది. 37.4 ఓవర్లకు 295కు స్కోర్ తీసుకెళ్లాలి. అంటే ఆరు చేయాలి. వరుసగా రెండు బంతులు డాట్ అయ్యాయి. నాలుగో బంతికి సిక్స్ కొట్టాల్సి ఉండగా ఫజల్‌హక్ ఫారూఖీ ఎల్బీ అయ్యాడు. దాంతో అఫ్గాన్ 289కి ఆలౌటైంది.
లంకేయుల బ్యాటింగ్ తీరిది
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంకేయులకు శుభారంభమే లభించింది. ఓపెనర్లు పాథుమ్ నిసాంక, కరుణరత్నె (32) తొలి వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యం అందించారు. అఫ్గాన్ బౌలర్లను ఎదుర్కొని బౌండరీలు సాధించారు. వీరిద్దరినీ గుల్బదిన్ నయీబ్ పెవిలియన్‌కు పంపించాడు. 10.2వ బంతి నిసాంక, 14.4వ బంతికి కరుణరత్నె వికెట్ కీపర్ నజీబుల్లా జర్దాన్‌కు క్యాచ్ ఇచ్చారు. సదీర సమర విక్రమ (3) సైతం త్వరగానే ఔటయ్యాడు.
నిలబడ్డ మెండిస్
వరుస వికెట్ల పతనంతో ఇబ్బందుల్లోకి జారుకున్న లంకను మెండిస్, అసలంక ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 99 బంతుల్లో 102 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూనే బౌండరీలు బాదేశారు. దాంతో సింహళీయులు 27.3 ఓవర్లకు 150 పరుగుల మైలురాయికి చేరుకున్నారు. 55 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టిన మెండిస్ ఆపై మరింత సమయోచితంగా ఆడాడు. సొగసైన బౌండరీలు బాదాడు. అత్యంత ప్రమాదకరంగా మారిన ఈ జోడీని జట్టు స్కోరు 188 వద్ద అసలంకను ఔట్ చేయడం ద్వారా నయీబ్ విడదీశాడు. అప్పుడు మెండిస్‌కు ధనంజయ డిసిల్వా (14) అండగా నిలిచాడు. వీరిద్దరూ 29 బంతుల్లో 33 పరుగుల భాగస్వామ్యం అందించారు.
ఆఖర్లో ఆ ఇద్దరు!
ఐదు పరుగుల వ్యవధిలోనే ధనంజయ, మెండిస్ ఔటవ్వడంతో శ్రీలంక స్కోరు వేగం కాస్త తగ్గింది. క్రీజులో కుదురుకున్నాక దునిత్ వెల్లలగె (33 నాటౌట్), మహీశ థీక్షణ (28) అదరగొట్టారు. ఒక్కో పరుగూ జోడించారు. ఎనిమిదో వికెట్‌కు అత్యంత కీలకమైన 64 (63 బంతుల్లో) పరుగుల భాగస్వామ్యం అందించారు. శ్రీలంకను పటిష్ఠ స్థితికి చేర్చారు. జట్టు స్కోరును 291/8కు చేర్చారు.