Shubman Gill: టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ డేటింగ్ చేస్తోందని కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్‌తో శుభ్‌మన్‌గిల్‌కు చెడిందని... అప్పటినుంచి గిల్ సారా అలీఖాన్‌తో డేటింగ్ చేస్తున్నాడని బీటౌన్ కోడై కోసింది. దీనిపై సారా అలీఖాన్ స్పష్టత ఇచ్చింది. తాజాగా కాఫీ విత్ కరణ్ జోహార్ షోకు ఈ బ్యూటీ హాజరైంది. మీరు శుభ్‌మన్ గిల్‌తో డేటింగ్‌లో ఉన్నారా? అంటూ సారాను కరణ్ అడిగారు. దీనికి నవ్వుతూ సమాధానమిచ్చింది సారా అలీ ఖాన్. ఆ సారాను నేను కాదంటూ చెప్పేసింది. అందరూ నా పేరు వెనకాలే పడ్డారంటూ నవ్వేసింది. శుభ్‌మన్ గిల్ జీవితంలో మరో సారా ఉందని, అది తాను కాదని స్పష్టం చేసింది. తాను గిల్‌తో డేటింగ్ చేయలేదని చెప్పడమే గాక ఆమె మరో సారా అని చెప్పడంతో అభిమానుల్లో ఆ మూడో సారా ఎవరన్న ఆసక్తి నెలకొంది.
సచిన్ కూతురితో గిల్ డేటింగ్ లో ఉన్నాడని గడిచిన రెండేళ్లుగా రూమర్లు వస్తున్నాయి. ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరి పోస్టును ఒకరు లైక్ చేసుకోవడంతో పాటు ప్రైవేట్ పార్టీలలో కలిసినప్పుడు క్లోజ్‌గా మూవ్ అవడంతో ఈ ఇద్దరి మధ్య ప్రేమ నిజమేనన్న చర్చ నడిచింది. మధ్యలో విడిపోయి.. మళ్లీ ఇటీవలే కలిశారని వార్తలు వచ్చాయి. శ్రీలంకతో జరిగిన మ్యాచులో 92 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ అవుటవ్వడంతో సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్ నిరాశ చెందింది. గిల్ అవుటవ్వగానే సారా ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేసింది. శతకానికి కేవలం ఎనిమిది పరుగుల దూరంలో గిల్ అవుట్వడంతో లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ కూడా నిరాశకు గురయ్యారు. ఈ మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చిన ఆమె.... గిల్ అవుటయ్యాక ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్ రెండు సిక్స్‌లు బాదగా.. ఈ రెండు సందర్భాల్లోనూ సారా టెండూల్కర్ చప్పట్లతో అతన్ని అభినందించింది. గిల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చప్పట్లు కొడుతూ ఆనందంలో మునిగిపోయింది. శుభ్‌మన్ గిల్ ఫోర్లు, సిక్సర్లు కొట్టినప్పుడల్లా సారా కేరింతలు కొడుతూ ఎంకరేజ్ చేసింది. హసన్ మహమూద్ బౌలింగ్‌లో గిల్ ఎడ్జ్ తీసుకున్న బాల్ థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీకి వెళ్లింది. ఈ ఫోర్ తర్వాత సారా టెండూల్కర్ ఫుల్ ఎగ్జైంట్‌గా పీలై గట్టిగా చప్పట్లు కొడుతూ సెలబ్రేట్ చేసుకుంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాను దున్నేసింది.
సారా టెండూల్కర్-గిల్ మధ్య మళ్లీ ప్రేమ మొదలైందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. శుభ్‌మన్ గిల్ కోసమే సారా టెండూల్కర్ ఈ మ్యాచ్‌కు వచ్చిందని కామెంట్లు పెడుతున్నారు. గతేడాది క్రితం వరకు సారా టెండూల్కర్, శుభ్‌మన్ గిల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ ఇద్దరి మధ్య బ్రేకప్ అయిందని, బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్‌తో శుభ్‌మన్ గిల్ ప్రేమాయణం సాగిస్తున్నట్లు కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ ఇద్దరూ కలిసి ఓ కాఫీ షాప్‌లో కనిపించడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. దాంతో సారా టెండూల్కర్-శుభ్‌మన్ గిల్ లవ్‌కు సంబంధించిన గాసిప్స్‌కు బ్రేక్ పడింది. సారా టెండూల్కర్.. టీమిండియా మ్యాచ్‌కు హాజరవ్వడంతో మరోసారి ఈ ఇద్దరి ప్రేమయాణం వార్తల్లో నిలిచింది. గిల్ బౌండరీ కొట్టిన కెమెరామెన్ సారాను చూపించడంతో స్టాండ్లలో ఉన్న ఫ్యాన్స్ ఈలలు, కేరింతలతో ఊగిపోయారు.