ODI World Cup 2023: 1980వ దశకంతో వెస్టిండీస్‌ బౌలింగ్‌కు దిగిందంటే ప్రత్యర్థి బ్యాటర్లు వణికిపోయేవారు. కోట్నీ వాల్ష్‌, కర్ట్‌లీ ఆంబ్రోస్‌, మాల్కమ్‌ మార్షల్‌, మైఖెల్‌ హోల్డింగ్‌, ఆండీ రాబర్ట్స్, జోల్‌ గార్నర్‌ బంతితో పిచ్‌పై నిప్పులు చెరిగేవారు. వీరి బౌలింగ్‌ను ఎదుర్కొవాలంటే ప్రత్యర్థి బ్యాటర్లకు వణుకు పుట్టేది. క్రమక్రమంగా విండీస్‌ పేస్‌ బౌలింగ్ క్షీణించింది. మళ్లీ ఆ దశలో ప్రపంచ క్రికెట్‌ను శాసించే బౌలింగ్‌ దళం కరేబియన్‌ జట్టు నుంచి ఉద్భవించలేదు. విండీస్‌ వదలిన చోటు నుంచే ఆస్ట్రేలియా పుట్టుకువచ్చింది. విండీస్‌ శకం ముగిసిన దశ నుంచి కంగారుల బౌలింగ్‌ దళం ప్రారంభమైంది. రే లిండ్‌వాల్‌.. డెన్నిస్‌ లిల్లీ, మెక్‌గ్రాత్‌, గిలెస్పీ, బ్రెట్‌లీ, మిచెల్‌ జాన్సన్‌, మిచెల్‌  స్టార్క్‌లతో ఆసిస్‌ బౌలింగ్‌ను చూసి ప్రత్యర్థి జట్టు సగం మ్యాచ్‌ను ఓడిపోయేవి. సచిన్‌ దశకంలో మెక్‌గ్రాత్‌ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. పదునైన ఇన్‌, అవుట్‌ స్వింగర్లతో మెక్‌.. ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టేవాడు. సచిన్‌కు.. మెక్‌గ్రాత్‌ మధ్య దాదాపుగా యుద్ధ వాతావరణం ఉండేది. ఒక్కోసారి ఒక్కొక్కరు విజయం సాధించేవారు. ఈ పేస్ దళాలు ఎన్నోసార్లు తమ జట్టుకు ఒంటిచేత్తో విజయాలు అందిచేవి.


ఇది గతం.. మరి భవిష్యత్తు
విండీస్‌ ముగించిన దగ్గరి నుంచి ఆస్ట్రేలియా ప్రారంభించింది. ఇప్పుడు ఆస్ట్రేలియా బౌలింగ్‌ బాగున్నా మునుపటి అంతా వాడిగా లేదన్నది సుస్పష్టం. ఇప్పుడు కంగారులు ముగించిన దగ్గరి నుంచి టీమిండియా ప్రారంభించింది. అది అలా ఇలా కాదు. ప్రత్యర్థి బ్యాటర్లకు చెమటలు పట్టించేలా... స్వల్ప లక్ష్యాన్నైనా కాపాడుకునేలా భారత బౌలర్లు పిచ్‌పై అద్భుతాలు చేస్తున్నారు. ఒకప్పుడు టీమిండియా బరిలోకి దిగుతుందంటే ప్రత్యర్ధి జట్లు స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలా అని ప్రణాళికలు రచించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారత పేస్‌ దళం ప్రత్యర్థి జట్లను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగిస్తుంది. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా బౌలర్ల ప్రదర్శనే దానికి నిదర్శ నం. మాములుగా భారత్‌లో పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి. మాములుగా డర్బన్‌, గబ్బా, సిడ్నీ లాంటి విదేశీ పిచ్‌లు పేస్‌కు అనుకూలిస్తాయి. కానీ బ్యాటింగ్‌కు, స్పిన్‌కు అనుకూలంగా ఉండే భారత పిచ్‌లపై భారత పేస్‌ దళం అద్భుతాలు సృష్టిస్తోంది.


బుమ్రా, షమీ, సిరాజ్‌తో కూడిన టీమిండియా పేస్‌ త్రయం.. అంచనాలను మించి రాణిస్తోంది. భారత పేస్ త్రయంతో సృష్టిస్తున్న సునామీలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లు కొట్టుకుపోతున్నారు. బుల్లెట్లలా దూసుకుస్తున్న బంతులకు బ్యాటర్లు చిత్తు అవుతున్నారు. ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో పోరు మొదలు శ్రీలంకతో మ్యాచ్‌ వరకూ భారత పేసర్ల ప్రదర్శన నభూతో నభవిష్యతి అనే రీతిలో సాగింది. ఒకప్పుడు టీమిండియాలో మ్యాచ్‌ అంటే కనీసం ముగ్గురు స్పిన్నర్లు బరిలోకి దిగి ప్రత్యర్థిని చుట్టేసేవారు. ఇప్పుడు అదే బాధ్యతను భారత పేస్‌ త్రయం తీసుకుంది. భారత పిచ్‌లపై స్పిన్నర్లను తోసిరాజని భారత పేసర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రపంచకప్‌లో ప్రస్తుతం అత్యుత్తమ పేస్‌ త్రయం మనదే అనడంలో సందేహం లేదు. జస్‌ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమి, మహమ్మద్‌ సిరాజ్‌ కలిసి ప్రత్యర్థి పని పడుతున్నారు.  ఈ పేస్ త్రయం మొదట బ్యాటింగ్‌లోనైనా, ఛేదనలోనైనా ప్రత్యర్థి వెన్ను విరుస్తున్నారు. తొలి 15 ఓవర్లలోనే ప్రత్యర్థిని దెబ్బకొట్టి ఈ పేసర్లు మ్యాచ్‌ను మనవైపు తిప్పేస్తున్నారు. 


ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ ఏడు మ్యాచ్‌ల్లో భారత్‌ మొత్తం 64 వికెట్లు పడగొట్టగా.. అందులో పేసర్లే 45 వికెట్లు పడగొట్టారంటే మన పేసర్ల ఆధిపత్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 7 మ్యాచ్‌ల్లో బుమ్రా 15, సిరాజ్‌ 9 వికెట్లు సాధించగా.. షమి మూడు మ్యాచుల్లోనే  14 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. హార్దిక్‌, శార్దూల్‌ కలిసి 7 వికెట్లు తీశారు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బుమ్రా, షమీ వరుసగా అయిదు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్నారు. మన పేసర్లు ఇదే ఫామ్‌ కొనసాగిస్తే కప్పు దక్కడం ఖాయమే. అందుకే ఈ పేస్‌ త్రయం షానా యేళ్లు యాదికుంటది.