Mohammed Shami: భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌(World Cup)లో అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న పేసర్‌ మహ్మద్ షమీ.. ఇంగ్లండ్‌(England)తో టెస్ట్‌ సిరీస్‌కు సిద్ధమేనని ప్రకటించాడు. స్వదేశంలో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌కు అందుబాటులో ఉండేందుకు శాయ‌శ‌క్తులా ప్రయ‌త్నిస్తున్నా అని షమీ ప్రకటించాడు. సెలక్షన్‌ కమిటీ కోరితే ఈ ఏడాది వెస్టిండీస్, అమెరికా వేదిక‌గా జ‌రుగ‌బోయే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లోనూ ఆడాల‌ని ఉంద‌ని షమీ వెల్లడించాడు. తాను టీ 20లు, వన్డేలు కూడా ఆడతానని... మేనేజ్‌మెంట్ కోరితే పొట్టి ప్రపంచ క‌ప్‌లో ఆడుతా’ అని ష‌మీ తెలిపాడు. ప్రస్తుతం షమీ బెంగ‌ళూరులోని క్రికెట్ అకాడ‌మీలో ఫిట్‌నెస్‌ సాధించేందుకు ప్రయత్నిస్తున్నాడు. గాయం కారణంగా షమీ తొలి రెండు టెస్టుల‌కు దూర‌మ‌య్యే అవ‌కాశ‌ముంద‌నే వార్తలు వినిపించాయి. అయితే ష‌మీ త‌నంత‌ట తానుగా వ‌చ్చేస్తున్నానంటూ తీపి క‌బురు చెప్పాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా జ‌న‌వ‌రి 25న భార‌త్, ఇంగ్లండ్ మ‌ధ్య తొలి టెస్టు జ‌రుగ‌నుంది. 


అవార్డు అందుకున్న షమి


ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నేడు క్రీడా అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి షమీ, ఇతర క్రీడాకారులు హాజరయ్యారు. షమీకి అర్జునుడి ప్రతిమ, ప్రశంసాపత్రం అందజేశారు. భారత్ తరఫున అంతర్జాతీయంగా సత్తా చాటిన అత్యంత ప్రతిభావంతులైన పేసర్లలో మహ్మద్ షమీ ఒకడు. ఇటీవల  భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో భారత స్టార్‌ పేసర్ మహ్మద్‌ షమీ(Mohammed Shami).. ప్రదర్శన  క్రికెట్‌ అభిమానులకు చిరకాలం  గుర్తుండిపోతుంది. అది మాములు ప్రదర్శన. ప్రతీ బంతికి వికెట్‌ తీసేలా.. బంతిబంతికి పరీక్ష పెట్టేలా..బుమ్రా, సిరాజ్‌లకు ఆత్మ విశ్వాసం పెరిగేలా షమీ చెలరేగిపోతున్నాడు. బంతితో నిప్పులు చెరుగుతున్నాడు. బాల్‌ అందుకుంటే వికెట్‌ పక్కా అనేంతలా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ప్రతీ బంతికి వికెట్‌ తప్పదేమో అని బ్యాట్స్‌మెన్‌ను భయపెడుతున్నాడు. తొలి నాలుగు మ్యాచుల్లో తుది జట్టులో ఆడే అవకాశమే దక్కని షమీ.. ఒక్కసారి అవకాశం దక్కిన తర్వాత తానేంటో నిరూపించాడు. 


ప్రపంచ కప్‌లో నిప్పులు చెరిగిన షమి


భార్య పెట్టిన గృహ హింస కేసు, వ్యక్తిగత జీవితంలో ఆటుపోట్లు కోర్టు సమన్లు ఆత్మహత్య చేసుకొందామన్న ఆలోచనలు రోడ్డు ప్రమాదం ఇలా ఒకటా రెండా షమీని సమస్యలు చుట్టుముట్టాయి. అయినా షమీ వెనక్కి తగ్గాడా.... లేదు.. ఇంకా దృఢంగా తయారయ్యాడు. జట్టులో చోటు దొరకకపోయినా కుంగిపోయాడా లేదు తానేంటో నిరూపించుకోవాలన్న కసితో తీవ్రంగా సాధన చేశాడు. ఇప్పుడు దానికి తగ్గ ఫలాలను అందిస్తున్నాడు.  ఈ ప్రపంచకప్‌లో లీగ్‌ దశలో తొలి నాలుగు మ్యాచ్‌లకు షమీని తుది జట్టులోకి తీసుకోలేదు. హార్దిక్‌ గాయం కారణంగా జట్టులోకి వచ్చిన షమీ తొలి మ్యాచ్‌లోనే పటిష్ఠమైన న్యూజిలాండ్‌ (New Zealand)  బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఐదు వికెట్ల ప్రదర్శన చేసి తానేంటో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌పై 4, శ్రీలంకపై 5, దక్షిణాఫ్రికాపై 2 వికెట్లు తీశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో  షమీ’ విధ్వంసమే సృష్టించాడు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి కివీస్‌ పతనాన్ని శాసించాడు. ఏడు వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించడంతో.. అతనికే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ ఇచ్చారు. భారత బౌలింగ్‌ దళం రారాజుగా నిలిచి తనలో ఎంత కసి ఉందో చాటి చెప్పాడు. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 23 వికెట్లతో ఈసారి టోర్నీలో.. టాప్‌ బౌలర్‌ స్థానానికి దూసుకొచ్చాడు. 


వ‌న్డే ప్ర‌పంచ క‌ప్‌లో అమోఘంగా రాణించిన షమీ ప్ర‌తిష్థాత్మ‌క అర్జున అవార్డు(Arjuna Award) అందుకున్నాడు.  రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము(Droupadi Murmu) చేతుల మీదుగా  ఈ అవార్డు స్వీక‌రించాడు. భార‌త క్రీడా రంగంలో ఖేల్ ర‌త్నత‌ర్వాత రెండో అత్యుత్త‌న్న‌త అవార్డు అందుకున్న ష‌మీ త‌న క‌ల నిజ‌మైంద‌ని అన్నాడు.