దక్షిణాఫ్రికా పర్యటనను భారత జట్టు పరాజయంతో ప్రారంభించింది. మూడో మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవ్వగా.. రెండో మ్యాచ్‌ను ఆతిథ్య ప్రొటీస్‌ విజయం సాధించింది. అన్ని విభాగాల్లో రాణించిన దక్షిణాఫ్రికా టీమిండియాపై సాధికార విజయం సాధించింది. టీమ్‌ఇండియా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్థతిలో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు 19.3 ఓవర్లలో 180 పరుగులు చేసింది. ఈ పరిస్థితుల్లో వర్షం కురవడంతో ప్రొటీస్‌ లక్ష్యాన్ని 15 ఓవర్లలో 152 పరుగులకు నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని 13.5 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి ఛేదించింది.


ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా... టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆరంభంలోనే భారత జట్టుకు దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. యశస్వి జైస్వాల్‌ , శుభ్‌మన్‌ ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్‌ చేరిపోయారు. జైస్వాల్‌ను జాన్సన్‌ అవుట్‌ చేయగా... గిల్‌ను విలియమ్స్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ తిలక్‌ వర్మ 29 పరుగులతో రాణించడం...కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ క్రీజులో నిలబడడంతో ఇన్నింగ్స్‌ ముందుకు సాగింది.  తిలక్‌, సూర్య చూడచక్కని షాట్లతో అలరించారు. కొయెట్జీ బౌలింగ్‌లో వరుసగా 6, 4 దంచిన సూర్య.. విలియమ్స్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాడు. జట్టు స్కోరు 55 పరుగుల వద్ద తిలక్‌ వర్మ పెవిలియన్‌ చేరాడు. కానీ ఆ తర్వాత రింకూ సింగ్‌తో కలిసి సూర్య స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పది ఓవర్లు ముగిసే సరికి భారత్‌ మూడు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. తొలి 11 బంతుల్లో 9 పరుగులే చేసిన రింకూ క్రీజులో కుదురుకున్న తర్వాత.. జాన్సన్‌ ఓవర్లో వరుసగా 4, 4 కొట్టాడు. ఫెలుక్వాయో ఓవర్లో మూడు బంతులను బౌండరీ దాటించాడు. 


 కానీ ఇన్నింగ్స్‌ జోరుగా సాగిపోతున్న దశలో సూర్య ఔట్‌ కావడంతో 70 పరుగుల నాలుగో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. సూర్యకుమార్‌ యాదవ్‌ 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 56 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత జితేశ్‌ శర్మ ఇలా వచ్చి అలా వెనుదిరిగాడు. జడేజా 19 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. చివర్లో రింకూ సింగ్‌ చెలరేగిపోయాడు. కేవలం 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. రింకు సింగ్‌ 39 బంతుల్లో 68 పరుగులు చేశాడు. అతడు కొట్టిన ఓ సిక్స్‌ ప్రెస్‌ గ్యాలరీలోని అద్దాలను ధ్వంసం చేసింది. చివరి ఓవర్‌ తొలి మూడు బంతుల్లో భారత జట్టు.. జడేజా, అర్ష్‌దీప్‌ వికెట్లు కోల్పోయింది. తర్వాత వర్షం రావడంతో ఇన్నింగ్స్‌ అక్కడే ఆగిపోయింది. దీంతో వర్షం వల్ల టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌ 19.3 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. 


వర్షం తగ్గకపోవడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 15 ఓవర్లలో 152 పరుగులుగా నిర్దేశించారు. భారత బౌలర్లు విఫలం కావడంతో ప్రొటీస్‌ 13.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి రెండు ఓవర్లలో 38 పరుగులు రాబట్టిన హెండ్రిక్స్‌, బ్రీజ్కె .. దక్షిణాఫ్రికాకు అదిరే ఆరంభాన్నిచ్చారు. పేలవ బౌలింగ్‌తో అర్ష్‌దీప్‌ రెండో ఓవర్లో ఏకంగా 24 పరుగులు సమర్పించుకున్నాడు. 


 హెండ్రిక్స్‌  27 బంతుల్లో 49.. మార్‌క్రమ్‌17 బంతుల్లో 30పరుగులతో చెలరేగడంతో ప్రొటీస్‌ మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన ప్రొటీస్‌ బౌలర్‌ షంసి (1/18)కి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. చివరిదైన మూడో టీ20 గురువారం జరుగుతుంది. 8 ఓవర్లలోనే దక్షిణాఫ్రికా 96 సాధించి దక్షిణాఫ్రికా తిరుగులేని స్థితిలో నిలిచింది. విజయం కోసం చివరి అయిదు ఓవర్లలో 36 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో మిల్లర్‌, స్టబ్స్‌ ఆ లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించారు.