SA vs BAN, T20 Worldcup 2022:  ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా దూసుకుపోతోంది! బంగ్లాదేశ్‌తో సూపర్‌ 12 మ్యాచులో 104 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిడ్నీ మైదానంలో పరుగుల వరద పారించింది. ఆపై వికెట్ల మోత మోగించింది. 206 టార్గెట్‌ ఛేదనకు దిగిన బంగ్లాను 16.3 ఓవర్లకు 101కే కుప్పకూల్చింది. లిటన్‌ దాస్‌ (34; 31 బంతుల్లో 1x4, 1x6) టాప్‌ స్కోరర్‌. అంతకు ముందు సఫారీలు ప్రత్యర్థి బౌలింగ్‌ను ఊచకోత కోశారు. రిలీ రొసొ (109; 56 బంతుల్లో 7x4, 8x6) అద్వితీయ సెంచరీ బాదేశాడు. అతడికి డికాక్‌ (63; 38 బంతుల్లో 7x4, 3x6) అండగా నిలిచాడు.




రొసో అదుర్స్‌


ఇప్పటికే ఉపయోగించిన పిచ్‌ అవ్వడంతో దక్షిణాఫ్రికా టాస్‌ గెలిచిన బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే మరోసారి కెప్టెన్‌ తెంబా బవుమా (2) నిరాశపరిచాడు. జట్టు స్కోరు 2 వద్దే ఔటయ్యాడు. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన రిలి రొసొ, ఓపెనర్‌ క్వింటన్ డికాక్‌ ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగారు. ఎడాపెడా బౌండరీలు సాధించాడు. పవర్‌ ప్లే ముగిసే సరికి 63 రన్స్‌ చేశారు.


ఆఖరి వరకు దంచుడే


ఇదే టైమ్‌లో వర్షం పడటంతో కాసేపు అంతరాయం కలిగించింది. మళ్లీ ఆట మొదలయ్యాక రొసొ దూకుడు పెంచాడు. 30 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేశాడు. మరోవైపు డికాక్‌ 33 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకోవడంతో 13.3 ఓవర్లకు సఫారీ స్కోరు 150 దాటేసింది. 170 వద్ద డికాక్‌, 180 వద్ద ట్రిస్టన్‌ స్టబ్స్‌ (7)  ఔటైనా 52 బంతుల్లో రొసో సెంచరీ కొట్టేశాడు. 197 వద్ద అతడిని షకిబ్‌ ఔట్‌ చేసినా దక్షిణాఫ్రికా 206/5తో నిలిచింది.


ఫామ్‌లోకి నోకియా


భారీ లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌ను ఆన్రిచ్‌ నోకియా(4/10), తబ్రైజ్‌ శంశి (3/20) దెబ్బకొట్టారు. సగటున 10 పరుగులకు ఒక వికెట్‌ పడగొట్టారు. జట్టు స్కోరు 26 వద్ద సౌమ్య సర్కార్‌ (15), 27 వద్ద నజ్ముల్‌ హుస్సేన్‌ పెవిలియన్ చేరారు. ఈ క్రమంలో లిటన్‌ దాస్‌ (34) ఒంటరి పోరాటం చేశాడు. అయితే పిచ్‌ పరిస్థితులను సఫారీ బౌలర్లు అద్భుతంగా ఉపయోగించుకున్నారు. అటు స్పిన్‌, ఇటు పేస్‌తో వారిని పంపించారు. 16.3 ఓవర్లకు 101కే కుప్పకూల్చారు.