Ipl 2025 Aakash Chopra Feels Rohit Sharmas Journey With Mumbai Indians Is Closed: టీమిండియా సారధి, ముంబై ఇండియన్స్‌కు అయిదుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ అందించిన రోహిత్‌ శర్మ(Rohit Sharma) కీలక నిర్ణయం తీసుకున్నాడన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. గత ఐపీఎల్ సీజన్‌లో అనూహ్యంగా రోహిత్‌శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన ముంబై(MI) యాజమాన్యం.. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా(Hardic Pandya)కు ఆ బాధ్యతలు అప్పగించింది. ఆ సమయంలో రోహిత్‌ శర్మ అభిమానులు.. హార్దిక్‌ను ఘోరంగా ట్రోల్‌ కూడా  చేశారు. అప్పటినుంచే హిట్‌మ్యాన్‌.. ముంబైను వీడుతారని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా(Aakash Chopra) కీలక కామెంట్లు చేశాడు. ముంబై ఇండియన్స్‌లో రోహిత్‌ శర్మ శకం ముగిసిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు.


 

కీలక వ్యాఖ్యలు

ఐపీఎల్‌లో 14 ఏళ్లుగా ముంబైలో రోహిత్‌శర్మ కొనసాగుతున్నాడు. అయితే గత ఐపీఎల్‌ సీజన్‌లో రోహిత్‌ను ఎప్పుడైతే కెప్టెన్సీ నుంచి తప్పించారో అప్పటినుంచి... హిట్‌మ్యాన్‌ ముంబైను వీడాలని అతని అభిమానులు కూడా సోషల్‌ మీడియాలో భారీగా డిమాండ్‌ చేశారు. కానీ ఆ సీజన్‌ను ఎలాగోలా నెట్టుకొచ్చిన రోహిత్‌... వచ్చే ఐపీఎల్‌ మెగా వేలానికి అందుబాటులో ఉండాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో నిర్వహించే ఐపీఎల్‌ 2025 వేలంలోకి హిట్‌మ్యాన్‌ రావడం ఖాయమని కూడా తెలుస్తోంది. రోహిత్‌ కనుక వేలంలోకి వస్తే భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసేందుకు లక్నో, ఢిల్లీ జట్లు సంసిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముంబైని వీడి వేలంలోకి రావాలని రోహిత్‌శర్మ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఐపీఎల్‌ కౌన్సిల్... ఈ మెగా వేలానికి  సంబంధించిన అధికారిక నియమాలు, తేదీలను ఇంకా రూపొందించలేదు. అయినా రోహిత్‌ శర్మ గురించి విస్తృత చర్చ జరుగుతోంది. అయితే ముంబై యాజమాన్యం... రోహిత్‌ను విడుదల చేయవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్‌ కెప్టెన్‌గా  రోహిత్ రావడం ఖాయమన్న పుకార్లతో మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా ఏకీభవించాడు. 

 

దాదాపు ఖాయమే..!

గత ఏడాది ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను కొత్త కెప్టెన్‌గా ఎంపిక చేయడంతో, రోహిత్- ముంబై యాజమాన్యం మధ్య సంబంధాలు దిగజారాయి. అయితే దీనిపై రోహిత్ ఎప్పుడూ దీనిపై స్పందించలేదు. ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా పరిస్థితులు బాగా లేవని కూడా పుకార్లు వచ్చాయి. రోహిత్‌- హార్దిక్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోందని కూడా వార్తలు వచ్చాయి. ముంబై ఇండియన్స్‌తో రోహిత్  శర్మ కెరీర్‌ ముగిసిందని... ముంబై ఫ్రాంచైజీ అతనిని విడుదల చేయవచ్చని ఆకాశ్‌ చోప్రా అన్నాడు. రోహిత్‌ ముంబై జట్టులో ఉండడని తాను అనుకుంటున్నట్లు.. వెల్లడించాడు. చెన్నై జట్టు ధోనీని రిటైన్‌ చేసుకుంటుందని... ఎందుకంటే ధోనీ చెన్నై జట్టు ఎమోషన్‌ అని.. కానీ రోహిత్‌ ప్రయాణం అలా కాదని ఆకాశ్ చోప్రా అన్నాడు. చెన్నై ధోనీని రిటైన్‌ చేసుకోవడం ఖాయమని... రోహిత్‌ ముంబైను వీడడం కూడా ఖాయమేనని తెలిపాడు. 

 


 

లక్నోకు రోహిత్‌ శర్మ

భారత్‌కు ఇటీవలే టీ 20 ప్రపంచకప్‌ను అందించిన రోహిత్‌శర్మను తమ జట్టు కెప్టెన్‌గా చేయాలని లక్నో సూపర్‌ జెయింట్స్‌ గట్టి పట్టుదలతో ఉందన్న ఊహాగానాలు వస్తున్నాయి. రోహిత్ తన జట్టుకు కెప్టెన్‌గా ఉండాలన్నది తన కలని LSG యజమాని సంజీవ్ గోయెంకా అన్నారు. వేలంలో రోహిత్‌ను కొనుగోలు చేయడానికి రూ. 50 కోట్లు ఉంచిందనే పుకార్లను ఆయన ఖండించాడు. అయితే అత్యుత్తమ కెప్టెన్, అద్భుత ఆటగాడు జట్టులో ఉండాలని ప్రతీ ఆటగాడు కోరుకుంటాడని అన్నాడు.