Greater Noida Stadium fate : రెండు రోజులుగా అక్కడ వర్షం లేదు. ఇరు జట్ల ఆటగాళ్లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. మ్యాచ్‌ నిర్వహించేందుకు అంతా సిద్ధంగా ఉంది ఒక్క పిచ్‌ తప్ప. వర్షం లేకపోయినా  రెండు రోజులుగా పిచ్‌ మ్యాచ్‌ నిర్వహించేందుకు సిద్ధం చేయకపోవడంతో ఆ పిచ్‌పై ఇప్పుడు నిషేధం వేటు వేలాడుతోంది. 

 

ఇంతకీ అసలేమైంది..?

ఢిల్లీకి సమీపంలో ఉన్న నోయిడా(Greater Noida Stadium)లోని షాహీద్‌ విజయ్‌ సింగ్‌ పతీక్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ మైదానంలో అఫ్గానిస్థాన్‌- న్యూజిలాండ్‌(AFG vs NZ) మధ్య  ఏకైక టెస్టు జరగాల్సి ఉంది. అయితే ఈ ఏకైక టెస్ట్‌ రెండో రోజూ ఆట కూడా ఒక్క బంతి కూడా పడకుండా రద్దైంది. సోమవారం ప్రారంభం కావాల్సిన ఈ టెస్ట్‌లో ఇంతవరకూ టాస్‌ కూడా వేయలేదు. రెండు రోజుల నుంచి వర్షం పడకపోయినా.. మ్యాచ్‌ నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్‌ రూంలకే పరిమితమయ్యారు. ఇప్పటికే రెండు రోజుల ఆట రద్దు కావడం.. ఇవాళ కూడా మ్యాచ్‌ జరిగే పరిస్థితులు లేకపోవడంతో ఈ ఏకైక టెస్టును రద్దు చేస్తారని మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. నోయిడాలో రెండు రోజులుగా అసలు వర్షం కురవలేదు. కానీ గత వారం కురిసిన భారీ వర్షాల వల్ల కారణంగా నోయిడాలోని మైదానం అవుట్‌ ఫీల్డ్‌ అంతా చిత్తడిగా మారింది. ఈ మైదానంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ సిస్టమ్‌ లేకపోవడంతో... అవుట్‌ ఫీల్డ్‌ అంతా ఇంకా తడిగానే ఉంది. నోయిడా మైదానంలో సదుపాయాల కొరత తీవ్రంగా ఉంది. దీంతో పాటు ఇక్కడ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు కూడా గతంలో వినిపించాయి. ఈ కారణాలతో 20196 నుంచే నోయిడాలోని మైదానంలో బీసీసీఐ దేశవాళీ మ్యాచ్‌లు కూడా నిర్వహించడం లేదు. గ్రౌండ్‌ సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఇంతవరకూ మైదానంలో మ్యాచ్‌ నిర్వహించే పరిస్థితులు కనిపించలేదు.  చిత్తడిగా ఉన్న మైదానంలో ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో అఫ్గాన్‌ ప్లేయర్  ఇబ్రహీం జద్రాన్‌కు గాయపడ్డాడు. 

 


 

గ్రేటర్ నోయిడాలోనే ఎందుకు..?

అఫ్గానిస్థాన్‌కు స్వదేశంలో మైదానాలు లేకపోవడం.. అక్కడి పరిస్థితుల నేపథ్యంలో ఆ జట్టు భారత్‌ మైదానాలనే హోమ్‌ గ్రౌండ్‌లుగా వాడుకుంటోంది. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు మైదానాన్ని కేటాయించాలని అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు బీసీసీఐని కోరింది. దీంతో బీసీసీఐ  చిన్నస్వామి స్టేడియం, కాన్పూర్‌లోని గ్రీన్‌ పార్క్‌, నోయిడాలోని మైదానాలను సూచించింది. అఫ్గాన్‌ మాత్రం గతంలో తాము ఆడిన నోయిడానే కివీస్‌తో సిరీస్‌కు ఎంచుకుంది. గతంలో ఈ వేదికపై అప్గాన్‌ ఐదు వన్డేలు, ఆరు టీ20లు ఆడింది.  అందుకే సౌకర్యాలు లేకపోయినా నోయిడాలోనే అఫ్గాన్‌-కివీస్‌ మ్యాచ్‌ నిర్వహించాల్సి వచ్చింది.

 


 

మైదానంపై నిషేదమేనా..?

రెండురోజులుగా మ్యాచ్‌  జరగకపోవడంతో ఇరు జట్ల ఆటగాళ్లు, అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మూడో రోజూ ఇక్కడ మ్యాచ్‌ జరిగే పరిస్థితి లేకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేసే అవకాశం ఉంది. అదే జరిగితే నోయిడాలో అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించకుండా నిషేధం విధిస్తారు. ఈ మ్యాచ్‌కు ఐసీసీ మ్యాచ్‌ రిఫరీ అయిన భారత మాజీ పేసర్ జవగళ్‌ శ్రీనాథ్‌ ఇచ్చే నివేదికపై నోయిడా భవిష్యత్‌ ఆధారపడి ఉంది.