Rohit Sharma and Ritika Sajdeh blessed with baby boy | టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. రోహిత్ శర్మ మరోసారి తండ్రయ్యాడు. ఆయన భార్య రితికా సజ్దే శుక్రవారం నాడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రోహిత్ శర్మ, రితికా సజ్దే దంపతులకు సమైరా అనే కుమార్తె జన్మించిన సమయంలో తొలిసారి తల్లిదండ్రులు అయ్యారు. తాజాగా రితికా ఓ బాబుకు జన్మనివ్వడంతో రోహిత్ శర్మ కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి.
రోహిత్, రితికా ప్రేమించి పెళ్లి..
రోహిత్ శర్మ, తన మేనేజర్ అయిన రితికా సజ్దేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తమ ప్రేమ విషయంలో పెద్దలను ఒప్పించి 2015 డిసెంబర్ 13న రోహిత్, రితికాల వివాహం ఘనంగా జరిగింది. వీరి ప్రేమకు గుర్తుగా 2018 డిసెంబరు 30న ఓ పాప పుట్టగా, సమైరాగా నామకరణం చేశారు. తాజాగా శుక్రవారం నాడు రోహిత్, రితికాలు మరోసారి తల్లిదండ్రులయ్యారని శుభవార్త బయటకు వచ్చింది. రితికా ఓ పండంటి బాబుకు జన్మనివ్వగా.. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని సమాచారం. వీలైతే రోహిత్ శర్మ రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా చేరుకోవచ్చు. ఐదు టెస్టుల బోర్డర్, గవాస్కర్ ట్రోఫీలో పాల్గొనేందుకు తొలి టెస్టుకు ముందు సైతం కెప్టెన్ రోహిత్ శర్మ భారత్ నుంచి బయలుదేరే అవకాశం ఉంది.
భార్య రితికా సజ్దే నిండు గర్భిణి కావడం, డెలివరీపై డాక్టర్లు ఇచ్చిన సమాచారం కారణంగా రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనకు ఇంకా బయలుదేరలేదు. తన భార్య రితికా త్వరలో రెండోసారి బిడ్డకు జన్మనివ్వనుందని, తనను తొలి టెస్టు నుంచి మినహాయించాలని రోహిత్ శర్మ ఇటీవల బీసీసీఐని కోరాడు. కోచ్ గౌతమ్ గంభీర్ కు ఇదే విషయాన్ని చెప్పగా.. మేనేజ్‌మెంట్ రోహిత్ శర్మకు ఊరట ఇచ్చింది. వ్యక్తిగత, కుటుంబ కారణాలతో ఆటగాళ్లు మ్యాచ్‌లకు దూరం కావడం ఇదేమీ కొత్త కాదు. గతంలో పలువురు ఆటగాళ్లు సిరీస్ మధ్యలోనే ఇంటికి వెళ్లి తండ్రి అయ్యానన్న సంతోషాన్ని కుటుంబసభ్యులతో పంచుకున్నారు.
అదే కారణంగా రోహిత్ శర్మ జట్టుతో పాటు ఆస్ట్రేలియా వెళ్లకుండా భారత్ లో ఉండిపోయాడు. దీనిపై విమర్శలు సైతం వచ్చాయి. రోహిత్ శర్మ కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చి జాతీయ జట్టును పక్కన పెట్టడం సబబు కాదని కొందరు మాజీలు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్ మాత్రం రోహిత్ నిర్ణయాన్ని సమర్థించాడు. ఇలాంటి బ్యూటిఫుల్ మూమెంట్ లో కుటుంబంతో పాటే రోహిత్ ఉండాలనుకోవడం సరైన నిర్ణయమని పేర్కొన్నాడు. ఫించ్ ప్రకటనపై రోహిత్ శర్మ భార్య రితికా సైతం స్పందించింది. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపేలా పోస్ట్ చేసింది.