Ind Vs NZ Updates: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటికే సెమీస్ కు వెళ్లిన భారత్.. వచ్చేనెల 2న జరిగే లీగ్ మ్యాచ్ కోసం సన్నాహకాలు స్టార్ట్ చేసింది. న్యూజిలాండ్ తో దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్లో చురుకుగా పాలు పంచుకోకవపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పాక్ తో మ్యాచ్ సందర్భంగా తను తొడ కండరాల గాయానికి గురయ్యాడు. ఆ గాయం వల్ల తను ప్రాక్టీస్ సరిగ్గా చేయడం లేదా..? అనే సందేహాలు ముసురుకుంటున్నాయి. ఇక కివీస్ మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు చెమటోడుస్తున్నారు. కింగ్ విరాట్ కోహ్లీ తన సహజ ధోరణిలో కఠోరంగా శ్రమించాడు. ముఖ్యంగా స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాను ఎదుర్కొన్నాడు. అలాగే టీమ్ లోని మిగతా పేసర్లను కూడా ఎదుర్కొన్నాడు. పాక్ తో మ్యాచ్ లో అజేయ సెంచరీ (100 నాటౌట్) తో సత్తా చాటిన కోహ్లీ.. సెమీస్ కు ముందు కివీస్ తో మ్యాచ్ లోనూ అదే తరహా సత్తా చాటాలని భావిస్తున్నాడు.
ఉత్సాహంగా షమీ..పాక్ తో మ్యాచ్ లో బౌలింగ్ చేయడంలో ఇబ్బంది పడిన వెటరన్ పేసర్ మహ్మద్ షమీ.. ప్రాక్టీస్ సెషన్ లో ఉత్సాహంగా కనిపించాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడానికి ప్రయత్నించాడు. అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా కూడా ఫుల్లు జోష్ లో కనిపించారు. ఇక రోహిత్ విషయానికొస్తే తను హెడ్ కోచ్ గౌతం గంభీర్ తో చర్చిస్తూ కనిపించాడు. అలాగే కాసేపు షాడో బ్యాటింగ్ చేసిన హిట్ మ్యాన్.. ప్రాక్టీస్ లో ఎక్కువగా గడపలేదు. మిగతా ప్లేయర్లు ఫుట్ బాల్ ఆడటంతోపాటు, రన్నింగ్ ప్రాక్టీస్, చిన్న చిన్న కసరత్తులు చేస్తూ కనిపించారు. టోర్నీలో సూపర్ ఫామ్ లో ఉన్న స్టార్ ఓపెనర్ శుభమాన్ గిల్ ప్రాక్టీస్ రాలేదు. మ్యాచ్ కు ఇంకా మూడురోజులు సమయం ఉండటంతో తను విశ్రాంతి తీసుకున్నాడేమోనని పలువురు భావిస్తున్నారు.
జట్టుతో కలిసిన మోర్కెల్..మెగాటోర్నీ ప్రారంభానికి ముందు స్వదేశానికి వెళ్లిన బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తాజాగా జట్టుతో కలిశాడు. వ్యక్తిగత కారణాలతో ఈనెల 18న తను సౌతాఫ్రికాకు వెళ్లాడు. అయితే పనులు ముగించుకుని జట్టుతో కలిసి, ఆటగాళ్ల ప్రాక్టీస్ ను పర్యవేక్షించాడు. అలాగే గంభీర్ తో కలిసి చర్చిస్తూ కనిపించాడు. స్థానిక ఐసీసీ అకాడమీలో ప్రాక్టీస్ నిర్వహించిన భారత ఆటగాళ్లు ఉత్సాహంగా కనిపించారు. ఇక కివీస్ తో మ్యాచ్ లో గెలిస్తే గ్రూపు లో అగ్రస్థానంలో నిలుస్తుంది. సెమీస్ కు ముందు ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు ఇది ఉపకరించగలదని నిపుణులు వ్యక్తం చేశారు.
Read Also: AFG Vs Eng Result Update: ఆఫ్గాన్ అద్భుత విజయం.. టోర్నీ నుంచి ఇంగ్లాండ్ ఔట్.. రూట్ సెంచరీ వృథా