ICC Champions Trophy 2025 Live Updates: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ ప్రస్థానం ముగిసింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్ లో ఆఫ్గానిస్థాన్ చేతిలో 8 పరుగులతో పరాజయం పాలైంది. లాహోర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 325 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (146 బంతుల్లో 177, 12 ఫోర్లు, 6 సిక్సర్లు)తో సత్తా చాటాడు. మెగాటోర్నీలో అత్యధిక వ్యక్తిగత స్కోరుతో జద్రాన్ రికార్డులకెక్కాడు. అలాగే ఆఫ్గాన్ తరఫున కూడా ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. బౌలర్లలో జోప్రా ఆర్ఛర్ కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనలో ఇంగ్లాండ్ చతికిల పడింది. 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌటైంది. మాజీ కెప్టెన్ జో రూట్ సెంచరీ (111 బంతుల్లో 120, 11 ఫోర్లు, 1 సిక్సర్) బాదినా ఫలితం లేకుండా పోయింది. అజ్మతుల్లా ఒమర్ జాయ్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. ఇబ్రహీంకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. తర్వాతి మ్యాచ్ లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఆడుతాయి. తాజా పరాజయంతో ఇంగ్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పటికే పాక్, బంగ్లాలు టోర్నీ నుంచి ఔట్ కాగా, ఇంగ్లీష్ జట్టు మూడో టీమ్ గా అపఖ్యాతి మూటగట్టుకుంది.
సత్తా చాటిన ఇబ్రహీం..బారీ సెంచరీతో ఒంటిచేత్తో ఆఫ్గానిస్తాన్ కు ఇబ్రహీం భారీ స్కోరు అందించాడు. టీమ్ పరుగుల్తో అతనివే దాదాపు 55 శాతం ఉండటం విశేషం. ఈ మ్యాచ్ లో ఇబ్రహీంతోపాటు అజ్మతుల్లా ఒమర్ జాయ్ (41), కెప్టెన్ హస్మతుల్లా షాహిది, మహ్మద్ నబీ చెరో 40 పరుగులు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ లో ఆఫ్గాన్ కు శుభాంరంభం దక్కలేదు. విధ్వంసక ఓపెనర్ రహ్మనుల్లా గుర్భాజ్ (6), సాధికుల్లా అటల్ (4), రహ్మత్ షా (4) విఫలమవ్వడంతో ఓ దశలో 3-37తో కష్టాల్లో పడింది. దీంతో మిడిలార్డర్ బ్యాటర్లతో కలిసి జట్టును ముందుకు నడిపించిన ఇబ్రహీం.. 106 బంతుల్లో సెంచరీ చేసి, దాన్ని భారీగా మలిచాడు. ఇక బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు తీయగా, లియామ్ లివింగ్ స్టన్ కు రెండు, జేమీ ఒవర్టన్, ఆదిల్ రషీద్ కు చెరో వికెట్ దక్కింది.
ఉత్కంఠభరితంగా..ఛేదన చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా జరిగింది. ఇరుజట్ల మధ్య విజయం దోబూచులాడింది. బంతి బంతికి సమీకరణాలు మారిపోయి, వన్డేల్లోని మజాను అభిమానులకు పంచాయి. ఆరంభంలో ఫిల్ సాల్ట్ (12), జేమీ స్మిత్ (9) విఫలమైనా బెన్ డకెట్ (38)తో కలిసి రూట్ జట్టును నడిపించాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు 68 పరుగులు జోడించి మంచి పునాది వేశారు. ఆ తర్వాత జోస్ బట్లర్ (38), జేమీ ఓవర్టన్ (32) తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి రూట్ జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఈక్రమంలో 98 బంతుల్లో సెంచరీ చేశాడు. ఆరేళ్ల తర్వాత రూట్ చేసిన సెంచరీ ఇదే కావడం విశేషం. అయితే సెంచరీ తర్వాత రూట్ ఔటయిపోవడంతో మ్యాచ్ లోకి వచ్చిన ఆఫ్గాన్లు.. తర్వాత చకచకా వికెట్లు తీసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ముఖ్యంగా చివరి రెండు ఓవర్లలో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. ఒత్తిడిని అధిగమించిన ఆఫ్గన్ విజేతగా నిలిచింది. మిగతా బౌలర్లలో నబీకి రెండు, ఫారూఖీ, రషీద్ ఖాన్, గుల్బదిన్ నైబ్ కు తలో వికెట్ దక్కింది.