ICC Champions Trophy 2025 Live Updates: ఆఫ్టానిస్తాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్.. చాంపియన్స్ ట్రోఫీలో రికార్డు బద్దలు కొట్టాడు. టోర్నీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్ గా రికార్డులకెక్కాడు. బుధవారం ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారీ సెంచరీ (146 బంతుల్లో 177, 12 ఫోర్లు, 6 సిక్సర్లు)తో సత్తా చాటాడు. దీంతో ఇదే ఎడిషన్ లో నమోదైన అత్యధిక వ్యక్తిగత స్కోరు (బెన్ డకెట్ -165 పరుగులు, ఆస్ట్రేలియా) రికార్డు తెరమరుగైంది. లాహోర్ లో గ్రూపు-బిలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్టానిస్థాన్ భారీ స్కోరు సాధించింది నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 325 పరుగులు సాధించింది. ఓపెనర్ గా బరిలోకి దిగిన ఇబ్రహీం.. చివరి ఓవర్లో ఔటయ్యాడు. ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు టోర్నీలో నిలుస్తుంది. ఓడిపోయిన జట్టు ఇంటిముఖం పడుతుంది. ఇప్పటికే ఈ రెండు జట్లు తొలి మ్యాచ్ ఓడిపోవడంతో ఈ మ్యాచ్ వాటికి చావోరేవోలాగా మారిపోయింది.
దిగ్గజాలకు సాధ్యం కానిది.. నిజానికి 1998 నుంచి ఈ టోర్నీని నిర్వహిస్తున్న, అత్యధిక వ్యక్తిగత స్కోరు మాత్రం న్యూజిలాండ్ కు చెందిన నాథన్ ఆస్టిల్ పైన ఉంది. 145 పరుగులతో 2004లో తను అమెరికా జట్టుపై ఈ రికార్డును నమోదు చేశాడు. ఆ తర్వాత చాలా ఎడిషన్లు జరిగినా, ఇప్పటివరకు ఈ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేక పోయారు. అయితే భారత దిగ్గజాలు ఇద్దరు సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ మాత్రం టోర్నీ హైయెస్ట్ ఇండివిడ్యువల్ స్కోర్ జాబితాలో చోటు సంపాదించారు. ఇక 2000లో సౌతాఫ్రికాపై 141 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో గంగూలీ ఐదో స్థానంలో నిలిచాడు. 1998లో ఆస్ట్రేలియాపై 141 పరుగుల ఇన్నింగ్స్ తో సచిన్ టెండూల్కర్ ఆరో స్థానం దక్కించుకున్నాడు. ఇబ్రహీం, ఆస్టిల్, ఆండ్రూ ఫ్లవర్ (జింబాబ్వే, 145, ఇండియాపై, 2002) టాప్ త్రీలో ఉన్నారు.
ఆఫ్టాన్ భారీ స్కోరు.. ఈ మ్యాచ్ లో ఇబ్రహీంతోపాటు అజ్మతుల్లా ఒమర్ జాయ్ (41), కెప్టెన్ హస్మతుల్లా షాహిది, మహ్మద్ నబీ చెరో 40 పరుగులు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ లో ఆఫ్గాన్ కు శుభాంరంభం దక్కలేదు. విధ్వంసక ఓపెనర్ రహ్మనుల్లా గుర్భాజ్ (6), సాధికుల్లా అటల్ (4), రహ్మత్ షా (4) విఫలమవ్వడంతో ఓ దశలో 3-37తో కష్టాల్లో పడింది. దీంతో మిడిలార్డర్ బ్యాటర్లతో కలిసి జట్టును ముందుకు నడిపించిన ఇబ్రహీం.. 106 బంతుల్లో సెంచరీ చేసి, దాన్ని భారీగా మలిచాడు. ఇక బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు తీయగా, లియామ్ లివింగ్ స్టన్ కు రెండు, జేమీ ఒవర్టన్, ఆదిల్ రషీద్ కు చెరో వికెట్ దక్కింది.