టీమిండియాలో అత్యంత ఫిట్‌గా ఉండే క్రికెటర్‌ ఎవరంటే.. అందరి నోటి నుంచి వచ్చే ఒకే మాట కింగ్‌ కోహ్లీ. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత ఫిట్‌గా ఉండే క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీ అగ్రస్థానంలో ఉంటాడు. అందుకే వికెట్ల మధ్య పరిగెత్తెటప్పుడైనా... మైదానంలో ఫీల్డింగ్‌ చేసేటప్పుడైనా చాలా ఉత్సాహంగా ఉంటాడు. మైదానంలో ఎప్పుడు అలసిపోయినట్లు కనిపించడు. వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాను అద్భుతంగా నడిపించిన సారధి రోహిత్‌ శర్మ కూడా చూడడానికి కొంచెం లావుగా ఉన్నా చాలా ఫిట్‌గా ఉంటాడు. చాలా తేలిగ్గా సిక్సులు కొడుతూ... మైదానంలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ చురుగ్గా కదులుతాడు. వీరిద్దరి ఫిట్‌నెస్‌పై స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌ అంకిత్‌ కలియార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 


ఫిట్‌నెస్‌ విషయంలో విరాట్‌ కోహ్లీనే అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటాడని అంకిత్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత క్రికెటర్లు ఫిట్‌నెస్‌పై ఇంతగా అవగాహన పెంచుకోవడానికి కారణం కూడా కోహ్లీనే అని కొనియాడాడు. యువ ఆటగాళ్లలో శుభ్‌మన్‌ గిల్‌ కోహ్లి మాదిరే సూపర్‌ ఫిట్‌గా ఉంటాడని.. విరాట్‌ భాయ్‌ తన రోల్‌ మోడల్‌గా భావిస్తాడని చెప్పుకొచ్చాడు. కేవలం ఫిట్‌నెస్‌ విషయంలోనే కాకుండా ఆటలోనూ విరాట్‌ భాయ్‌ను గిల్‌ తన రోల్‌మోడల్‌గా భావిస్తాడని... ప్రతి విషయంలోనూ కోహ్లినే ఫాలో అవుతూ ఉంటాడని కూడా అంకిత్‌ తెలిపాడు. కెప్టెన్‌గా ఉన్న సమయంలో కోహ్లి ప్రతి ఒక్కరిని ఫిట్‌నెస్‌ విషయంలో మోటివేట్‌ చేశాడని కూడా గుర్తు చేశాడు. టీమిండియా సారధి రోహిత్‌ శర్మ చూడటానికి బొద్దుగా ఉన్నా మైదానంలో చాలా చురుగ్గా ఉంటాడని అంకిత్‌ అన్నాడు. మైదానంలో రోహిత్‌ కదలికలు చూస్తే ఎవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమైపోతుందని అంకిత్‌ అన్నాడు. అత్యంత ఫిట్‌గా ఉండే క్రికెటర్లలో రోహిత్‌ శర్మ పేరు కూడా ఉంటుందిని స్పష్టం చేశాడు. 


మరో ఆరు నెలల్లో జరిగే టీ 20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకునేందుకు భారత జట్టు ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఈ టీ 20 ప్రపంచకప్‌లో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ బరిలోకి దిగుతాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2022లో జరిగిన టీ20 ప్రపంచ‌క‌ప్ సెమీ ఫైన‌ల్‌లో భార‌త జ‌ట్టు ఓడిపోయిన త‌రువాత ఈ ఫార్మాట్‌లో టీమ్ఇండియా త‌రుపున కోహ్లీ మ‌రో టీ20 మ్యాచ్ ఆడలేదు. దీంతో టీ 20 క్రికెట్‌కు విరాట్‌ వీడ్కోలు పలికినట్లేనని అతడి స్థానంలో మరో ఆటగాడి ఎంపికపై అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ కసరత్తులు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. విరాట్‌ను వన్‌డౌన్‌లో పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదనే బీసీసీఐ భావిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. విరాట్‌ కోహ్లీ నిజానికి ఈ ఇద్దరు సీనియర్లు గతేడాది పొట్టి వరల్డ్‌కప్‌ సెమీస్‌ అనంతరం ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ కూడా ఆడలేదు. అలాగే రాబోయే దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌ల్లోనూ విరాట్‌, రోహిత్‌, బుమ్రా ఆడడం లేదు. అయితే పొట్టి వరల్డ్‌కప్‌లో మాత్రం రోహిత్‌, బుమ్రా ఆడడం ఖాయమేనని, కానీ విరాట్‌కు మాత్రం చోటు దక్కకపోవచ్చని కథనాలు వస్తున్నాయి. టీ 20 మెగా టోర్నీ కోసం ఇప్పటి నుంచే జ‌ట్టును సిద్ధం చేసే ప‌నిలో బీసీసీఐ నిమ‌గ్నమైంది. ఇందుకోసం ఇటీవ‌ల ఢిల్లీలో స‌మావేశ‌మైన బీసీసీఐ అధికారులు, కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, కోచ్ రాహుల్ ద్రవిడ్‌, సెల‌క్షన్ క‌మిటీ చీఫ్ అజిత్ అగార్కర్‌ల‌తో క‌లిసి పొట్టి ప్రపంచ‌క‌ప్ కోసం రోడ్ మ్యాప్‌ను రూపొందించిన‌ట్లు తెలుస్తోంది.