Rohit Sharma Injury Scare: ఐర్లాండ్(IRE)తో జరిగిన మ్యాచ్‌లో అర్ధ శతకంతో మంచి టచ్‌లో కనిపించిన టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడం అభిమానుల్లో ఆందోళనను రేపింది. స్వల్ప లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ... టీమిండియాను విజయం దిశగా నడిపించాడు. పిచ్ బౌలింగ్‌కు అనుకూలిస్తున్న ఐర్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి మెరుపు బ్యాటింగ్ చేశాడు. మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ కేవలం ఒకే పరుగుకు వెనుదిరిగినా రోహిత్ మాత్రం ధనాధన్ బ్యాటింగ్‌తో భారత జట్టుకు సునాయస విజయాన్ని అందించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ భుజం నొప్పితో రిటైర్డ్‌గా వెనుదిరగడం అభిమానుల్లో ఆందోళనను పెంచింది.
రోహిత్ రిటైర్డ్ హర్ట్
టీ20 ప్రపంచకప్ 2024 ( T20 World Cup 2024)లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేసి పూర్తి చేసిన తర్వాత భుజం నొప్పితో మైదానాన్ని వీడాడు. 97 పరుగుల లక్ష్య ఛేదనలో తొమ్మిదో ఓవర్‌లో ఐర్లాండ్ బౌలర్ జాషువా లిటిల్ వేసిన బంతి రోహిత్‌కు బలంగా తాకింది. ఈ దెబ్బ తగిలినప్పటికీ రోహిత్ రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. కానీ ఆ తర్వాత జాషువా లిటిల్ వేసిన మరో లెంగ్త్ బంతి అనూహ్యంగా స్వింగ్ అయి రోహిత్ ఎడమ మోచేయిపై బలంగా తాకింది. రోహిత్‌ను ఫిజియో పరీక్షించిన తర్వాత రోహిత్ మైదానాన్ని వీడాడు. రిటైర్డ్ హర్ట్ అయ్యే సమయానికి రోహిత్ 37 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. రోహిత్ గాయంతో మైదానాన్ని వీడడంతో గాయం తీవ్రతపై అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కీలకమైన టీ 20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే రోహిత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడంతో గాయం తీవ్రంగానే ఉందని అభిమానులు భయపడ్డారు. అయితే దీనిపై రోహిత్ శర్మ మ్యాచ్ పూర్తయిన తర్వాత స్పష్టత ఇచ్చాడు.
రోహిత్ స్పష్టత
బంతి తగిలిన తర్వాత భుజం కాస్త నొప్పిగా అనిపించిందని అందుకే ముందు జాగ్రత్తగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగానని రోహిత్ క్లారిటీని ఇచ్చాడు. తమకు న్యూయార్క్‌లోని నుసావు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోని పిచ్ ఎలా స్పందిస్తున్న దానిపై తమకు ఎలాంటి వివరాలు తెలీదని రోహిత్ తెలిపాడు. అందుకే టాస్ గెలవగానే మరో ఆలోచన లేకుండా బౌలింగ్ తీసుకున్నట్లు తెలిపాడు. మొదట బౌలింగ్ తీసుకోవడం వల్ల పిచ్ ఎలా స్పందిస్తుందో తెలుస్తుందని... లక్ష్య ఛేదనలో అది ఉపయోగ పడుతుందని రోహిత్ తెలిపాడు. పిచ్ పరిస్థితులను తెలుసుకోవడం కోసం సెకండ్ బ్యాటింగ్ చేయాలనుకున్నామని హిట్ మ్యాన్ తెలిపాడు. తుది జట్టు ఎంపికపై కూడా హిట్ మ్యాన్ స్పందించాడు. తమ జట్టు ఎంపిక ఎప్పుడు సమతూకంగా ఉండాలని అనుకుంటామని... అందుకే పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉంటే ఒక విధంగా, పిచ్ స్పిన్‌కు సహకరిస్తుందనుకుంటే మరో విధంగా జట్టు ఎంపిక ఉంటుందని రోహిత్ తెలిపాడు.