Roger Binny Replaced Sourav Ganguly: అనుకున్నదే జరిగింది! బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్‌ రోజర్‌ బిన్నీ ఎంపికయ్యారు. ముంబయిలోని తాజ్ మహల్‌ హోటల్లో మంగళవారం బీసీసీఐ 91వ వార్షిక సాధారణ సమావేశం జరిగింది. మరెవ్వరి నుంచీ పోటీ లేకపోవడంతో ఆయన ఎంపిక ఏకగ్రీవంగా మారింది. బోర్డు 36వ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. సౌరవ్‌ గంగూలీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు. 1983 ప్రపంచకప్‌ గెలిచిన జట్టు నుంచి ఎంపికైన మొదటి అధ్యక్షుడు ఆయనే కావడం ప్రత్యేకం.






2019లో KSCA బాధ్యతలు


భారత క్రికెట్లో రోజర్‌ బిన్నీ అనేక బాధ్యతలు చేపట్టారు. 1983 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా తరఫున అత్యధిక వికెట్ల వీరుడిగా చరిత్ర సృష్టించారు. 8 మ్యాచుల్లో 18 వికెట్లు పడగొట్టారు. ఆటకు వీడ్కోలు పలికాక కోచ్‌గా మారారు. బీసీసీఐ సెలక్టర్‌గా పనిచేశారు. 2015 వన్డే ప్రపంచకప్‌ ఎంపిక చేసిన సెలక్టర్ల బృందంలో ఆయనా ఉన్నారు. 2019లో కర్ణాటక క్రికెట్‌ సంఘం (KSCA) అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 2022లో బీసీసీఐ అధినేతగా మారారు. ప్రస్తుతం ఆయన వయసు 67 సంవత్సరాలు. మూడేళ్ల వరకు ఆయన పదవిలో ఉంటారు. 70 ఏళ్ల తర్వాత పదవులు చేపట్టలేరు.




ఆటగాడిగా అదుర్స్


సౌరవ్‌ గంగూలీ తర్వాత మరో క్రికెటర్‌కే అవకాశం ఇస్తే బాగుంటుందని రాష్ట్ర సంఘాల సభ్యులు భావించారు. దాంతో రోజర్‌ బిన్నీకి అవకాశం దొరికింది. 1979-1987 మధ్యన టీమ్‌ఇండియా తరఫున ఆయన 27 టెస్టులు ఆడి 47 వికెట్లు పడగొట్టారు. 72 వన్డేలు ఆడారు. 1983 ప్రపంచకప్‌లో 18 వికెట్లు తీయడం కెరీర్‌కే హైలైట్‌గా నిలిచింది. 1985లో ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్‌ సిరీస్ క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ ఆయన 17 వికెట్లతో లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచారు. 2000లో ఆయన కోచింగ్‌లోనే మహ్మద్‌ కైఫ్‌ కెప్టెన్సీలో అండర్‌-19 జట్టు ప్రపంచకప్‌ గెలిచింది. ఈ జట్టులో యువీ కీలకంగా ఉన్నాడు. బెంగాల్‌, కర్ణాటక రంజీ జట్లకు కోచింగ్‌ ఇచ్చారు.


బీసీసీఐ పాలక వర్గం


అధ్యక్షుడు - రోజర్‌ బిన్నీ
ఉపాధ్యక్షుడు - రాజీవ్‌ శుక్లా
కార్యదర్శి - జే షా
సంయుక్త కార్యదర్శి - దేవజిత్‌ లోన్‌ సాకి
కోశాధికారి - ఆశీష్ షెలార్‌
ఐపీఎల్‌ ఛైర్మన్‌ - అరుణ్‌ సింగ్‌ ధూమాల్‌
అపెక్స్‌ కౌన్సిల్‌ మెంబర్‌ - ఖైరుల్‌ జమాల్‌ మజుందార్‌