టీమిండియా(Team India) నయా ఫినిషర్ రింకూ సింగ్(Rinku Singh)పై దక్షిణాఫ్రికా(South Africa) పర్యటనలో అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ సిరీస్‌లో సత్తా చాటి రానున్న టీ 20 ప్రపంచకప్(T20 World Cup) వేళకు రింకూ జట్టులోకి వస్తాడని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఆస్ట్రేలియా(Austrelia)తో జరిగిన టీ 20 సిరీస్‌లోనూ రింకూ సింగ్ సామర్థ్యం మేరకు రాణించాడు. ఇప్పుడు దక్షిణాఫ్రికా పర్యటనలోనూ రాణిస్తే ఇక తిరుగుండదు. విధ్వంసకర బ్యాటర్‌గా రాణిస్తున్న రింకూ సింగ్.. ఆస్ట్రేలియా తో జరిగిన తొలి టీ 20 (T20)మ్యాచ్‌లో చివరి బంతికి సిక్సు కొట్టి టీమిండియాకు విజయం అందించాడు. ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండి 14 బంతుల్లోనే నాలుగు బౌండరీల సాయంతో 22 పరుగులు చేసిన రింకూపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
నయా ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న రింకూసింగ్ దక్షిణాఫ్రికా పర్యటనలోనూ కీలక పాత్ర పోషించాలని పట్టుదలగా ఉన్నాడు. ఈ క్రమంలోనే భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తనతో సుదీర్ఘంగా సంభాషించినట్లు రింకూ సింగ్ వెల్లడించాడు. రాహుల్ ద్రావిడ్ తనకు ఇచ్చిన సూచన తనకు ఎంతో నచ్చిందని కూడా ఈ నయా ఫినిషర్ అన్నాడు. రాహుల్ ద్రవిడ్ తనకు ఒకే మాట చెప్పాడని.. సహజంగా నువ్వు ఎలా ఆడతావో అలానే షాట్లు కొట్టేయ్’ అని చెప్పాడని రింకూ తెలిపాడు. ఇది తనకు నచ్చిన చాలా మంచి సలహా అని తెలిపాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని.. ప్రాక్టీస్ సెషన్ కూడా అద్భుతంగా జరిగిందని రింకూ వెల్లడించాడు. ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని కూడా ద్రవిడ్ సూచించాడని దానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. అలాంటి స్థానంలో ఆడాలంటే సవాల్‌తో కూడుకున్నదేనని... ఏమాత్రం కుదురుకోవడానికి సమయం ఉండదని.... అయితే వ్యక్తిగతంగా ఆత్మవిశ్వాసంతో ఉండాలని ద్రవిడ్ చెప్పాడని రింకూసింగ్ చెప్పాడు. తాను ఉత్తరప్రదేశ్ తరపున ఇదే స్థానంలో చాన్నాళ్లు బ్యాటింగ్ చేశానని... అది తనకెంతో కలిసొచ్చిన స్థానమని కూడా ఈ నయా ఫినిషర్ అన్నాడు.
ఆస్ట్రేలియాతో టీ 20 సిరీస్‌ను కైవసం చేసుకుని మంచి ఊపుమీదున్న యువ భారత్ దక్షిణాఫ్రికాతో తొలి టీ 20 మ్యాచ్‌కు సిద్ధమైంది. ఫ్రీడమ్ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచి ఈ పర్యటనలో శుభారంభం చేయాలని టీమిండియా భావిస్తోంది. జస్ప్రిత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, కోహ్లీ సహా సీనియర్ ఆటగాళ్లు జట్టులో లేకపోవడంతో అనుభవం అంతగా లేని యువ జట్టు ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. స్వదేశంలో ఆస్ట్రేలియాపై 4-1తో విజయం సాధించినా సఫారీ గడ్డపై కఠిన సవాలు ఎదురుకానుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు స్వదేశంలో అద్భుతమైన బ్యాటింగ్ ట్రాక్‌లపై ఆస్ట్రేలియాను 4-1తో ఓడించింది. కానీ దక్షిణాఫ్రికాలో భారత బ్యాటర్లకు పేస్ ట్రాక్‌లతో సవాల్ ఎదురుకానుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు ప్రొటీస్ బౌలర్లను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. అనుభవజ్ఞులు లేని ఆస్ట్రేలియా బౌలింగ్ దళంపై స్వదేశంలో టీమిండియా బాగానే రాణించింది. అయితే దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను దక్షిణాఫ్రికాలో ఎదుర్కోవడం అంత తేలిక కాదు.