దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన రెండో టీ ట్వంటీ రింకూ సింగ్ బ్యాట్‌తో చెలరేగాడు. రెండో టీ20లో దూకుడైన బ్యాటింగ్‌తో 39 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 నాటౌట్‌తో ఆకట్టుకున్నాడు. అయితే సఫారీ జట్టు కెప్టెన్ మర్క్ క్రమ్ వేసిన ఓవర్లో రింకూ సింగ్ వరుసగా సిక్స్‌లు కొట్టాడు. 19వ ఓవర్ చివరి బంతిని రింకూ క్రీజు బయటకు వచ్చి బలంగా బాదాడు. లాంగాన్ దిశగా దూసుకెళ్లిన బంతి.. నేరుగా వెళ్లి ప్రెస్ బాక్స్‌లోని కిటికీ అద్దాన్ని పగలగొట్టింది. గ్లాస్ పగిలిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. దీనిపై రింకూ సింగ్ స్పందించాడు. వాస్తవానికి తన షాట్ కారణంగానే అద్దం పగలిపోయిందనే విషయం తనకు తెలీదని రింకూసింగ్ అన్నాడు. తోటీ ఆటగాళ్లు చెప్పడంతోనే తనకు ఆ విషయం తెలిసిందని... మీడియా బాక్స్ పగలగొట్టినందుకు క్షమించాలంటూ రింకూ తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
నయా ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న రింకూసింగ్ దక్షిణాఫ్రికా పర్యటనలోనూ కీలక పాత్ర పోషించాలని పట్టుదలగా ఉన్నాడు. ఈ క్రమంలోనే భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తనతో సుదీర్ఘంగా సంభాషించినట్లు రింకూ సింగ్ వెల్లడించాడు. రాహుల్ ద్రావిడ్ తనకు ఇచ్చిన సూచన తనకు ఎంతో నచ్చిందని కూడా ఈ నయా ఫినిషర్ అన్నాడు. రాహుల్ ద్రవిడ్ తనకు ఒకే మాట చెప్పాడని.. సహజంగా నువ్వు ఎలా ఆడతావో అలానే షాట్లు కొట్టేయ్’అని చెప్పాడని రింకూ తెలిపాడు. ఇది తనకు నచ్చిన చాలా మంచి సలహా అని తెలిపాడు. ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని కూడా ద్రవిడ్ సూచించాడని దానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. అలాంటి స్థానంలో ఆడాలంటే సవాల్‌తో కూడుకున్నదేనని... ఏమాత్రం కుదురుకోవడానికి సమయం ఉండదని.... అయితే వ్యక్తిగతంగా ఆత్మవిశ్వాసంతో ఉండాలని ద్రవిడ్ చెప్పాడని రింకూసింగ్ చెప్పాడు. తాను ఉత్తరప్రదేశ్ తరపున ఇదే స్థానంలో చాన్నాళ్లు బ్యాటింగ్ చేశానని... అది తనకెంతో కలిసొచ్చిన స్థానమని కూడా ఈ నయా ఫినిషర్ అన్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌లో చివరి ఓవర్‌లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టి అందరి దృష్టిని ఆకర్షించిన రింకూ సింగ్.. టీమిండియా తరఫున సైతం సత్తాచాటుతున్నాడు. ఐర్లాండ్‌తో సిరీస్ సందర్భంగా ఈ ఏడాది ఆగస్టులో అరంగేట్రం చేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్.. ఫినిషర్ పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లోనూ సత్తాచాటాడు. ఆస్ట్రేలియా తో జరిగిన తొలి టీ 20 (T20)మ్యాచ్‌లో చివరి బంతికి సిక్సు కొట్టి టీమిండియాకు విజయం అందించాడు. ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండి 14 బంతుల్లోనే నాలుగు బౌండరీల సాయంతో 22 పరుగులు చేసిన రింకూపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటివరకు టీమిండియా తరఫున 11 మ్యాచుల్లో 7 సార్లు బ్యాటింగ్‌కు దిగిన రింకూ సింగ్.. 248 పరుగులు చేశాడు. 180కి పైగా స్ట్రైక్ రేటుతో ఈ పరుగులు రాబట్టాడు.
రెండో టీ20 మ్యాచ్ లో అన్ని విభాగాల్లోనూ సత్తా చాటిన సౌతాఫ్రికా ఘనవిజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే భారీ దెబ్బ పడింది. ఖాతా తెరవకుండానే ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, శుభ్ మాన్ గిల్ డక్ అవుట్‌గా వెనుదిరిగారు. ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌ను తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆదుకున్నారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన స్కై ఐదుఫోర్లు, మూడుసిక్సర్లతో 56పరుగులు చేసి టీమ్ ను నిలబెట్టాడు. రింకూసింగ్ ప్రారంభంలో నెమ్మదిగా ఆడినా.. 9ఫోర్లు 2 సిక్సర్లతో 39బంతుల్లోనే 68పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 19.3 ఓవర్లలో భారత్ 180పరుగులు చేసిన టైమ్‌లో వర్షం మొదలైంది. ఈ పిచ్‌పై 180 పరుగులు భారీస్కోరే అయినా వర్షం కారణంగా పిచ్ పరిస్థితులు మారిపోయాయి. బంతి బ్యాట్ మీదకు తేలికగా రావటంతో సౌతాఫ్రికాకు పని ఈజీ అయిపోయింది.