వచ్చే ఏడాది జనవరి 19 నుంచి దక్షిణాఫ్రికా వేదికగా జరిగే అండర్‌-19 వన్డే ప్రపంచకప్‌లో పోటీపడే భారత జట్టులో హైదరాబాద్‌ కుర్రాళ్లు ఆరవెల్లి అవినాశ్‌ రావు, మురుగన్‌ అభిషేక్‌కు చోటు దక్కింది. జనవరి 19న దక్షిణాఫ్రికాలో ఆరంభమయ్యే ఈ టోర్నీతో పాటు.. అంతకంటే ముందు అక్కడే జరిగే ముక్కోణపు సిరీస్‌కు బీసీసీఐ సెలక్టర్లు జట్టును ప్రకటించారు. ఈ జట్టులో ఆరవెల్లి అవినాశ్‌ రావు, మురుగన్‌ అభిషేక్‌లకు స్థానం దక్కింది. 18 ఏళ్ల అవనీశ్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌కాగా ఈ ఏడాది నవంబర్‌లో అండర్‌-19 నాలుగు జట్ల టోర్నీలో భారత్‌-ఏ తరఫున ఆడిన అతడు భారత్‌-బిపై 163 పరుగులతో అదరగొట్టాడు. 19 ఏళ్ల మురుగన్‌ అభిషేక్‌ ఆఫ్‌ స్పిన్నర్‌. లెఫ్ట్‌ ఆర్మ్‌ బ్యాటర్‌. ఇటీవల అండర్‌-19 నాలుగు జట్ల టోర్నీలో ఇండియా-ఏకు ఆడుతూ ఇండియా-బిపై 81 పరుగులు చేయడమే కాక, 2 వికెట్లు పడగొట్టాడు. 7 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు కూడా తీశాడు. వీరిద్దరూ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న అండర్‌-19 ఆసియాక్‌ప్‌లో ఆడుతున్న భారత జట్టులో సభ్యులు. ఉదయ్‌ శరణ్‌ కెప్టెన్‌గా, సౌమీకుమార్‌ పాండే వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు.

 

హైదరాబాద్‌ నుంచి అరవెల్లి అవినాశ్‌ రావు, మురుగన్‌ అభిషేక్‌ అండర్‌ 19  వన్డే ప్రపంచకప్‌ జట్టులో స్థానం దక్కించుకోవడంపై తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ శాఖ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అభినందనలు తెలిపారు. వీరిద్దరు కెరీర్‌లో అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. అండర్‌-19 క్రికెట్‌ వరల్డ్‌కప్‌నకు ఎంపికైన అవినాశ్‌ రావుకు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్‌... అవినాశ్‌ రాజన్న సిరిసిల్ల నియోజకవర్గం పోత్గల్‌ గ్రామంలో పుట్టిపెరిగాడని గుర్తు చేశాడు. మరో ట్వీట్‌లో మురుగన్‌ అభిషేక్‌కు కూడా అభినందనలు తెలిపారు. అవినాశ్‌, అభిషేక్‌ ఇద్దరూ మెగా టోర్నీలో రాణించి సీనియర్‌ జట్టులోకి రావాలని కోరుకుంటున్నానని కేటీఆర్‌ పేర్కొన్నారు.

 

భారత జట్టు: ఉదయ్‌ సహారన్‌ (కెప్టెన్‌), సౌమీ కుమార్‌ పాండే, అర్షిన్‌ కులకర్ణి, ఆదర్శ్‌ సింగ్‌, రుద్ర మయూర్‌ పటేల్‌, సచిన్‌ దాస్‌, ప్రియాంశు మోలియా, ముషీర్‌ఖాన్‌, మురుగన్‌ అభిషేక్‌, అవనీశ్‌ రావు, ఇనీశ్‌ మహాజన్‌, ధనుశ్‌ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్‌ లింబాని, నమన్‌ తివారి; స్టాండ్‌బై: ప్రేమ్‌ దేవ్‌కర్‌, అన్ష్‌ గొసాయ్‌, మహ్మద్‌ అమన్‌

 

2024లో నిర్వహించనున్న ఐసీసీ మెన్స్ అండర్ 19 వరల్డ్ కప్ (Under19 Mens World Cup 2024) హోస్టింగ్ బాధ్యతల నుంచి లంకను తప్పించింది. ఆ అవకాశాన్ని దక్షిణాఫ్రికాకు కల్పిస్తూ ఐసీసీ బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది. దాంతో వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న అండర్ 19 వరల్డ్ కప్ ను దక్షిణాఫ్రికా నిర్వహించనుందని బోర్డు స్పష్టం చేసింది. లంక క్రికెట్ కి నిధులు ఐసీసీ తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ కారణంగా వచ్చే జనవరిలో జరగాల్సిన మెన్స్ అండర్ 19 ప్రపంచ కప్ నిర్వహణ నుంచి లంకను తప్పించి దక్షిణాఫ్రికాకు బాధ్యతల్ని అప్పగించింది. ఈ ఏడాది మహిళల U19 T20 ప్రపంచ కప్ నిర్వహించిన దక్షిణాఫ్రికా పురుషుల అండర్ 19 అవకాశాన్ని దక్కించుకుంది.