Kane Williamson Injury: ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్. ఆ జట్టు స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికీ దూరమయ్యే ప్రమాదంలో పడ్డాడు. శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన టోర్నమెంట్ ఓపెనర్లో ఫీల్డింగ్ చేస్తూ విలియమ్సన్ గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే కేన్ మామకు తాకిన గాయం సాధారణమైనదేం కాదని.. ఈ సీజన్ మొత్తానికి అతడు దూరమయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది.
ఏం జరిగిందంటే..
చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ లో భాగంగా మొదట సీఎస్కే బ్యాటింగ్ చేసింది. జోషువా లిటిల్ వేసిన 13వ ఓవర్లో రెండో బంతిని డీప్ స్క్వేర్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడాడు. అప్పటికే పరిగెత్తుకుంటూ వచ్చిన విలియమ్సన్.. గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్నాడు. అయితే బౌండరీ లైన్ అవతల ఉన్నానని గ్రహించిన అతడు.. బంతిని వలయం లోపలికి విసిరేశాడు. ఇదే క్రమంలో కింద పడుతుండగా కేన్ మామ కాలు గ్రౌండ్‌కు బలంగా తాకింది. ఉన్నఫళంగా కింద పడటంతో విలియమ్సన్ విలవిల్లాడాడు.
నొప్పితో ఇబ్బందిపడుతున్న విలియమ్సన్‌కు గుజరాత్ టీమ్ ఫిజియోలు వచ్చి ప్రాథమిక చికిత్స అందించారు. కానీ నొప్పి వేధిస్తుండటంతో ఇద్దరు మనుషుల సాయంతో అతడు పెవిలియన్‌కు చేరాడు.
ఇప్పుడెలా ఉంది..?
సీఎస్కే - జీటీమ్యాచ్ జరుగుతున్న క్రమంలో గుజరాత్ మెంటార్ గ్యారీ కిర్‌స్టెన్ కేన్ మామ ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడుతూ.. ‘కేన్ మోకాలికి గాయమైంది. అతడు మా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. స్కానింగ్ కు పంపారు..’ అని అన్నాడు. ఇదే విషయమై న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ స్పందిస్తూ... ‘కేన్‌కు గాయమైందని తెలియగానే మేమంతా ఆందోళన చెందాం. ప్రస్తుతం మా ఆలోచనలన్నీ కేన్ గురించే.. అతడికి అయిన గాయం ఎంత తీవ్రమైందో తెలియడం లేదు. రాబోయే 48 గంటలూ అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడు. ఆ తర్వాతే ఏ విషయమన్నది తెలుస్తుందని నాతో అన్నాడు..’అని తెలిపాడు.
తప్పుకోవడం తప్పదా..
గుజరాత్ టైటాన్స్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు కేన్ మామ గాయం తీవ్రమైందేనని.. ఏప్రిల్ 4న ఢిల్లీ వేదికగా జరిగే మ్యాచ్ కు ముందే అతడి రిప్లేస్‌మెంట్‌ను ప్రకటించనుందని సమాచారం. గత సీజన్ వరకూ సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఉన్న విలియమ్సన్ ను 2022 డిసెంబర్ లో జరిగిన వేలంలో గుజరాత్ రూ. 2 కోట్లు వెచ్చించి దక్కించుకుంది.
ఇక చెన్నై - గుజరాత్ మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (92) తృటిలో సెంచరీ కోల్పోయాడు. లక్ష్యాన్ని గుజరాత్.. 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. గుజరాత్ తరఫున ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (63) రాణించాడు. ఈ మ్యాచ్ లో సీఎస్కే తరఫున ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగిన తుషార్ దేశ్‌పాండే.. 3.2 ఓవర్లు వేసి 51 పరుగులు సమర్పించుకున్నాడు. చెన్నైకి అతడు చూపిన ‘ఇంపాక్ట్’ కంటే చేసిన నష్టమే ఎక్కువ.