ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఏర్పాట్లపై బీసీసీఐ దృష్టి సారించింది. పురుషుల ఐపీఎల్‌ నిర్వహణ, ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్‌పైనా దృష్టి సారించింది. పురుషుల ఐపీఎల్ 2024 సీజన్ వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఐపీఎల్ 2024 మార్చి రెండో వారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే ఐపీఎల్-17 షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన రానుంది. అయితే ఇప్పటికే ఆటగాళ్ల రిలీజ్‌, రిటెన్షన్‌ ప్రక్రియ పూర్తయింది. వచ్చే నెల 19న ఐపీఎల్‌ మినీ వేలం జరగనుంది. పది ప్రాంఛైజీలు కొంతమంది ఆటగాళ్లను వదులుకోగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు 1166 మంది ఆటగాళ్లు పేర్లను నమోదు చేసుకున్నారు. 



 ఇప్పటికే బెన్‌ స్టోక్స్‌ ఈ ఐపీఎల్‌కు దూరమవ్వడంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు బిగ్‌ షాక్‌ తగలగా... ఇప్పుడు మరో ఇంగ్లండ్‌ ప్లేయర్‌ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌కు ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ దూరం కానున్నాడు. టీ20 వరల్డ్‌క్‌పను దృష్టిలో ఉంచుకుని అతడిపై పనిభారం పడకుండా ఉండాలని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు భావిస్తోంది. అందుకే వేలంలో పాల్గొనేందుకు తన పేరును కూడా రిజిస్టర్‌ చేసుకోలేదు. ఇటీవలే అతడిని ముంబై ఇండియన్స్‌ వదిలేసుకుంది. గాయం కారణంగా ఈ ఏడాది మే నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. ఏప్రిల్‌, మేలో తమ పర్యవేక్షణలో ఉంటేనే ఆర్చర్‌ త్వరగా కోలుకుంటాడని ఈసీబీ అధికారి ఒకరు తెలిపారు. 2022 ఐపీఎల్‌‌ వేలంలో ఆర్చర్‌‌‌‌ను రూ. 8 కోట్లకు కొనుగులు చేసి ముంబై ఇండియన్స్ గత వారం అతడిని రిలీజ్‌‌ చేసింది.  వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌‌ కప్‌‌లో పాల్గొనేందుకు పని భారం తగ్గించుకుందుకు ఐపీఎల్‌‌లో ఆడొద్దని అతడిని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈనెల19న దుబాయ్‌‌లో జరగనున్న ఐపీఎల్ వేలానికి రిజిస్టర్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో అతని పేరు లేదు. ఆర్చర్ పలు గాయాలతో బాధ పడుతున్నాడు. గత సీజన్‌‌లో ఆడుతుండగా మోచేయి గాయం తిరగబెట్టింది. అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్‌‌లోనూ ఆడలేదు.


 మరోవైపు ఐపీఎల్‌ 2024 సీజన్‌ నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి. డిసెంబరు 19న ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. అయితే, ఈ సారి భారత్‌ కాకుండా దుబాయ్‌లో వేలం నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 వేలం తేదీని బీసీసీఐ అధికారికంగా అనౌన్స్ చేసింది. డిసెంబర్ 19వ తేదీన ఈ వేలం జరగనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దుబాయ్‌ వేదికగా ఈ వేలం జరగనుంది. ఈ వేలంలో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. రానున్న ఐపీఎల్‌ వేలంలో ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్లు ట్రావిస్‌ హెడ్‌, ప్యాట్‌ కమిన్స్‌, మిషెల్‌ స్టార్క్‌‌లకు మంచి ధర లభించే అవకాశం ఉంది. ఇటీవలే ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో కంగారూల జట్టు ఆరోసారి టైటిల్‌ గెలువడంలో వీరు కీలకంగా వ్యవహరించారు. దుబాయ్‌ వేదికగా ఈ నెల 19వ తేదీన జరిగే వేలంలో ఈ ఆసీస్‌ త్రయంరూ.  2 కోట్ల కనీస ధరతో వేలంలోకి ప్రవేశిస్తున్నారు. 



భారత పేసర్లు ఉమేశ్‌ యాదవ్‌, హర్షల్‌ పటేల్‌, బ్యాటర్‌ కేదార్‌ జాదవ్‌ కూడా ఈ జాబితాలోనే ఉన్నారు. ప్రపంచకప్‌లో సత్తా చాటిన కివీస్‌ ఆల్‌రౌండర్‌ రచిన్‌ రవీంద్ర కనీస ధర రూ.50 లక్షలుగా ఉంది. దీని కన్నా 20 రెట్లు అధిక మొత్తానికి రచిన్ రవీంద్ర అమ్ముడయ్యే అవకాశాలున్నాయి. 1166 మంది క్రికెటర్ల జాబితాను ఐపీఎల్‌... అన్ని ఫ్రాంఛైజీలకు పంపింది. ఈ 1166 మంది కోసం ప్రాంచైజీలు ఏకంగా రూ. 262.95 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఈ ఆటగాళ్లలో ఫ్రాంఛైజీలు ఆసక్తి ప్రదర్శించిన వారితో తుది జాబితాను రూపొందిస్తారు.