MLC 2023: ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్.. అమెరికాలో వచ్చే నెల నుంచి జరుగబోయే మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ)లో కూడా ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. టెక్సాస్ ఫ్రాంచైజీని టెక్సాస్ సూపర్ కింగ్స్ (టీఎస్కే) గా నామకరణం చేసి ఇటీవలే ఆ జట్టు తరఫున ఆడబోయే పలువురు ఆటగాళ్లను ప్రకటించిన ఆ జట్టు.. తాజాగా సారథి పేరును కూడా వెల్లడించింది. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్‌గా ఉన్న దక్షిణాఫ్రికా వెటరన్ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్.. టీఎస్కే సారథిగా వ్యవహరించనున్నాడు.
ఈ మేరకు టీఎస్కే తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఫాఫ్ డుప్లెసిస్‌తో రూపొందించిన ఓ వీడియోలో అతడే సారథి అని ప్రకటించడంతో పాటు మరో ట్వీట్‌లో ‘యెల్లో అగేన్ ఫాఫ్’ అని ఓ ఆసక్తికర ఫోటోను షేర్ చేసింది.
ఫాఫ్ డుప్లెసిస్ ఐపీఎల్‌లో రెండు సీజన్ల నుంచి ఆర్సీబీకి ఆడుతున్నా గతంలో అతడు సీఎస్కే ఆస్థాన ఓపెనర్. 2011 నుంచి 2021 వరకూ ఆ జట్టుతోనే ఉన్నాడు. 2016, 2017 లో చెన్నైపై బ్యాన్ ఉన్నప్పుడు మాత్రం అతడు మరో జట్టుతో ఆడాడు. గత దశాబ్దంలో సీఎస్కే విజయాలలో డుప్లెసిస్ పాత్ర మరువలేనిది. కానీ 2022లో సీఎస్కే అతడిని రిటైన్ చేసుకోకపోగా వేలంలో కూడా దక్కించుకోలేకపోయింది.
అయితే ఐపీఎల్‌లో మిస్ అయినా ఫాఫ్‌ను సీఎస్కే.. దక్షిణాఫ్రికా లీగ్‌లో దక్కించుకుంది. సీఎస్కే కొనుగోలు చేసిన జోహన్నస్‌బర్గ్ ఫ్రాంచైజీకి ఫాఫ్ డుప్లెసిసే సారథిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా అతడు మరోసారి సీఎస్కే యెల్లో జెర్సీలో మెరువనుండటం గమనార్హం.
మిల్లర్ కూడా..
ఈసారి ఫాఫ్ ఒక్కడే కాదు.. మరో దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు డేవిడ్ మిల్లర్ కూడా టెక్సాస్ కే ఆడుతుండటం విశేషం. ఈ విషయాన్ని కూడా టీఎస్కే ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. వీరితో పాటు రెండ్రోజుల క్రితమే టీఎస్కే.. సీఎస్కేలో ఆడే డెవాన్ కాన్వే, మిచెల్ సాంట్నర్, డేనియల్ సామ్స్, గెరాల్డ్ కొయెట్జ్, డ్వేన్ బ్రావో, అంబటి రాయుడుల పేర్లను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. జులై 13 నుంచి మొదలుకాబోయే ఈ లీగ్ 17 రోజుల పాటు నార్త్ టెక్సాస్ వేదికగా అభిమానులను అలరించనున్నది. జులై 30న ఫైనల్ జరుగుతుంది.
టెక్సాస్ ఓవర్సీస్ ప్లేయర్స్: ఫాఫ్ డుప్లెసిస్, డేవిడ్ మిల్లర్, అంబటి రాయుడు, డ్వేన్ బ్రావో, డేవిడ్ మిల్లర్, గెరాల్డ్ కోయిట్జ్ (సౌతాఫ్రికా పేసర్), డేనియల్ సామ్స్ (ఆస్ట్రేలియా), మిచెల్ శాంట్నర్, డెవాన్ కాన్వే (న్యూజిలాండ్)
సపోర్ట్ స్టాఫ్ : స్టీఫెన్ ఫ్లెమింగ్ (హెడ్ కోచ్), ఎరిక్ సిమ్మన్స్ (అసిస్టెంట్ కోచ్), ఆల్బీ మోర్కెల్ (అసిస్టెంట్ కోచ్), రసెల్ రాధాకృష్ణన్ (టీమ్ మేనేజర్)