Ranji Trophy Semi-Final: రంజీ ట్రోఫీ సీజన్ 2022- 23 ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. ట్రోఫీ కోసం బెంగాల్, సౌరాష్ట్ర ఫైనల్ లో తలపడనున్నాయి. ఫిబ్రవరి 16న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
రంజీ ట్రోఫీ 2022- 23 సీజన్ లో కర్ణాటకతో జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో సౌరాష్ట్ర విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో గెలిచిన ఆ జట్టు ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్ లో బెంగాల్ తో తలపడనుంది.
రంజీ ట్రోఫీలో రెండో సెమీఫైనల్ మ్యాచ్ కర్ణాటక- సౌరాష్ట్ర జట్ల మధ్య జరిగింది. కర్ణాటక తొలి ఇన్నింగ్స్ లో 407 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (429 బంతుల్లో 249) డబుల్ సెంచరీతో రాణించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీనివాస్ 66 పరుగులు చేశాడు. దానికి సమాధానంలో సౌరాష్ట్ర జట్టు తొలి ఇన్నింగ్స్ లో 527 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సౌరాష్ట్ర కెప్టెన్ అర్పిత్ వాసవాడ (406 బంతుల్లో 202) డబుల్ సెంచరీ సాదించాడు. షెల్డన్ జాక్సన్ సెంచరీ (160) తో ఆకట్టుకున్నాడు. దీంతో సౌరాష్ట్రకు 120 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
కర్ణాటక విఫలం
రెండో ఇన్నింగ్స్ లో కర్ణాటక జట్టు బ్యాటర్లు విఫలమయ్యారు. కెప్టెన్ మయాంక్ (55), నికిన్ జోస్ (109) సెంచరీతో రాణించినా మిగతా బ్యాటర్లు విఫలమవటంతో 234 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక 117 పరుగుల లక్ష్యాన్ని సౌరాష్ట్ర 6 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ అర్పిత్ వాసవాడ 47 పరుగులతో రాణించి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో సౌరాష్ట్ర ఫైనల్ కు చేరుకుంది. ఫిబ్రవరి 16న జరిగే ఫైనల్ లో ట్రోఫీ కోసం బెంగాల్ తో తలపడనుంది.
మధ్య ప్రదేశ్ పై బెంగాల్ విజయం
అంతకుముందు జరిగిన మొదటి సెమీ ఫైనల్‌లో మధ్యప్రదేశ్‌పై బెంగాల్ 306 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ధృవ్ షోరే అత్యధికంగా 860 పరుగులు చేశాడు. అతను 3 సెంచరీలు చేశాడు. కాగా ప్రశాంత్ చోప్రా 5 సెంచరీలు సాధించాడు. అయితే అత్యధిక పరుగులు చేసిన వారిలో ప్రశాంత్ ఐదో స్థానంలో ఉన్నాడు. అతను 783 పరుగులు చేశాడు.