INDW vs PAKW: భారత్‌తో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ముందుగా అనుకున్నట్లే కీలక బ్యాటర్ స్మృతి మంథన గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం అయింది. తన స్థానంలో యస్తిక భాటియా ఓపెనింగ్ చేయనుంది.


వేలికి గాయం కావడంతో స్మృతి మంథన ఇబ్బంది పడుతోంది. ఈ కారణంగానే ఆమె పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు దూరమైంది. అయితే స్మృతి మంథన వేలికి ఎలాంటి ఫ్రాక్చర్ లేదని రిషికేశ్ కనిట్కర్ చెప్పారు. ఇది కొంచెం ఉపశమనం కలిగించే అంశం. కాబట్టి రెండో మ్యాచ్‌కు స్మృతి మంథన అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


కేప్ టౌన్ వేదికగా వెస్టిండీస్‌తో టీమిండియా తన తర్వాతి మ్యాచ్ ఆడనుంది. అనంతరం ఇంగ్లండ్‌తో భారత్‌ మూడో మ్యాచ్‌‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 18వ తేదీన జరగనుంది. అదే సమయంలో భారత జట్టు ఫిబ్రవరి 20వ తేదీన ఐర్లాండ్‌తో చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది. టోర్నమెంట్‌లోని మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 23వ తేదీన కేప్‌టౌన్‌లో జరగనుండగా, ఫిబ్రవరి 24వ తేదీన రెండో సెమీ ఫైనల్ జరగనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 26వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది.


పాకిస్థాన్ మహిళలు (ప్లేయింగ్ XI)
జవేరియా ఖాన్, మునీబా అలీ(వికెట్ కీపర్), బిస్మాహ్ మరూఫ్(కెప్టెన్), నిదా దార్, సిద్రా అమీన్, అలియా రియాజ్, అయేషా నసీమ్, ఫాతిమా సనా, ఐమాన్ అన్వర్, నష్రా సంధు, సాదియా ఇక్బాల్


భారత మహిళలు (ప్లేయింగ్ XI)
షెఫాలీ వర్మ, యాస్తికా భాటియా, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, రాజేశ్వరి గయక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్


ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం కూడా ఫిబ్రవరి 13వ తేదీన ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ఈ వేలంలో జట్లు కొనుగోలు చేయడానికి మొత్తంగా 409 మంది మహిళా క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు. ఈ ఆటగాళ్ల నుంచి ఫ్రాంచైజీలు తమ జట్లను ఎంపిక చేసుకుంటాయి. వేలంలో పాల్గొననున్న ఐదు జట్లకు తలో రూ.12 కోట్ల పర్స్ అందుబాటులో ఉండనుంది. ఒక్కో జట్టులో కనీసం 15 మంది, గరిష్టంగా 18 మంది ప్లేయర్స్‌ను కొనుగోలు చేయగలవు. ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో అత్యధిక ధరను పొందే అవకాశం కూడా స్మృతి మంథనకే ఉంది.


భారత క్రికెటర్ స్మృతి మంథన గత కొన్నేళ్లుగా టీమ్ ఇండియాకు అత్యంత ముఖ్యమైన ప్లేయర్. తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చాలా సందర్భాలలో జట్టును గెలిపించింది. ప్రస్తుతం ఆమె మహిళా బ్యాట్స్‌మెన్‌ల టీ20 ర్యాంకింగ్స్‌లో కూడా మూడో స్థానంలో ఉంది. స్మృతి మంథన మంచి పాపులర్ ఫేస్. కాబట్టి ఆమె చేరబోయే టీమ్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో WPL వేలంలో స్మృతి మంథన అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో నిలిచే అవకాశం ఉంది. మొత్తం అందరికంటే కాస్ట్లీ ప్లేయర్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.