గురువారం అడిలైడ్ ఓవల్‌లో జరిగిన రెండో సెమీఫైనల్‌లోఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో రోహిత్ శర్మ నేతృత్వంలోని  టీమ్ ఇండియాపై విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడారు. సీనియర్ ఆటగాళ్ల భవితవ్యం గురించి మాట్లాడటానికి ఇది సరైన వేదిక కాదని తెలిపారు.


'సెమీస్‌లో మా ప్రదర్శన నిరాశపరిచింది. ఫైనల్‌కు వెళ్లాలని అనుకున్నా. ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో మెరుగైన జట్టుగా నిలిచారు.మొత్తమ్మీద, మేం చాలా మంచి క్రికెట్ ఆడాం. మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మేం కొన్ని విషయాల్లో మెరుగుపడ్డాం. తదుపరి ప్రపంచ కప్ కోసం ఇవి ఉపయోగపడతాయి. మేం టోర్నమెంట్‌లో బాగా బ్యాటింగ్ చేశాం. ఆట ప్రారంభమైనప్పుడు, వికెట్ నెమ్మదిగా ఉందని జట్టు సభ్యులు చెప్పారు. చివరి ఓవర్లు బాగా సాగాయి. మేము 180 నుంచి 185 పరుగులు సాధించగలిగి ఉండాల్సింది.' అని భారత మాజీ కెప్టెన్ చెప్పాడు.


గురువారం అడిలైడ్‌ వేదికగా జరిగిన సెమీఫైనల్లో భారత్‌ ఓటమి చవిచూసింది. 169 పరుగులను డిఫెండ్‌ చేసుకోలేక తెల్లముఖం వేసింది. కనీసం ఒక్క వికెట్టైనా పడగొట్టలేక అవమానం మూటగట్టుకుంది. ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్‌ బట్లర్‌ (80 నాటౌట్; 49 బంతుల్లో 9x4, 3x6), అలెక్స్ హేల్స్‌ (86 నాటౌట్; 47 బంతుల్లో 4x4, 7x6) టీమ్‌ఇండియా బౌలింగ్‌ను చితకబాదేశారు. అంతకు ముందు విరాట్‌ కోహ్లీ (50; 40 బంతుల్లో 4x4, 1x6), హార్దిక్‌ పాండ్యా (63; 33 బంతుల్లో 4x4, 5x6) రాణించారు.


ఛేదనకు దిగిన ఆంగ్లేయులను అడ్డుకోవడంలో టీమ్‌ఇండియా బౌలర్లు విఫలమయ్యారు. పిచ్‌ కండిషన్‌ను అర్థం చేసుకోకుండా వేగంగా బంతులు విసిరారు. దాంతో అలెక్స్‌ హేల్స్‌, జోస్‌ బట్లర్‌ పవర్‌ప్లేను సద్వినియోగం చేసుకున్నారు. స్వింగ్‌ లభించకపోవడంతో భువనేశ్వర్‌ను బట్లర్‌ టార్గెట్‌ చేసుకున్నాడు. అర్షదీప్‌ సైతం ప్రభావం చూపలేదు. మహ్మద్‌ షమి సైతం ఎక్కువ రన్స్‌ ఇచ్చాడు. దాంతో 6 ఓవర్లకు ఇంగ్లాండ్‌ 63 పరుగులు చేసింది. అక్షర్‌ పటేల్‌ సైతం ఎఫెక్టివ్‌గా లేకపోవడంతో వారికి అడ్డేలేకుండా పోయింది. హేల్స్‌ 28, బట్లర్‌ 36 బంతుల్లో హాఫ్‌ సెంచరీలు అందుకోవడంతో 10.1 ఓవర్లకే ఇంగ్లాండ్‌ స్కోరు 100 దాటేసింది.  ఆ తర్వాత వారిద్దరూ మరింత జోరు పెంచడంతో 83 బంతుల్లోనే 150కి చేరుకుంది. 16 ఓవర్లకే విజయం అందుకుంది.


అడిలైడ్‌లో రాత్రంతా వర్షం. కవర్ల కిందే పిచ్‌. ఔట్‌ ఫీల్డ్‌పై తేమ. ఆకాశంలో మబ్బులు! ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో టీమ్‌ఇండియా మొదట బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. టాస్‌ గెలవడంతో జోస్‌ బట్లర్‌ బౌలింగ్‌ తీసుకొని భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టేందుకు ప్రయత్నించాడు. జట్టు స్కోరు 9 వద్దే ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (5) క్రిస్‌ వోక్స్‌ ఔట్‌ చేశాడు. అదనపు బౌన్స్‌తో వచ్చిన బంతిని ఆడబోయి జోస్‌ బట్లర్‌కు కేఎల్‌ క్యాచ్‌ ఇచ్చాడు.


ఆంగ్లేయులు కఠినంగా బౌలింగ్‌ చేస్తుండటంతో కోహ్లీ, రోహిత్ నిలకడగా ఆడారు. రెండో వికెట్‌కు 47 రన్స్‌ భాగస్వామ్యం అందించడంతో 7.5 ఓవర్లకు స్కోరు 50కి చేరుకుంది. వేగం పెంచే క్రమంలో రోహిత్‌ 8.5వ బంతికి ఔటయ్యాడు. సూర్యకుమార్‌ (14) త్వరగానే పెవిలియన్‌ చేరడంతో హార్దిక్‌ పాండ్య క్రీజులోకి వచ్చాడు. 39 బంతుల్లో 50 చేసిన కోహ్లీకి అండగా నిలిచాడు. నాలుగో వికెట్ కు 40 బంతుల్లో 61 పరుగుల భాగస్వామ్యం నెకలొల్పాడు. మొదట్లో ఒకట్రెండు బంతుల్ని నిలకడగా ఆడిన పాండ్య డెత్‌ ఓవర్లలో వరుస సిక్సర్లు, బౌండరీలు బాదేశాడు. 29 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. జట్టు స్కోరును 168/6కి చేర్చాడు.