Prithvi Shaw Selfie Row:


టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ పృథ్వీ షాపై బేస్‌బాల్‌ బ్యాటుతో దాడి చేస్తున్న వీడియోలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఓ యువతి బ్యాటుతో కారు అద్దాలు పగలగొట్టడమే కాకుండా అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. వెంటనే అప్రమత్తమైన ఈ యువ ఓపెనర్‌ బ్యాటును ఆమె నుంచి లాగేసుకున్నాడు. అయినప్పటికీ ఆమె ఆగలేదు.




దాడికి గురైన పృథ్వీ షాకు అభిమానులు అండగా నిలుస్తున్నారు. అతడు ధైర్యంగా ఉండాలని చెబుతున్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 'కొందరు తాగుబోతులు పృథ్వీ షాపై దాడి చేశారు. ఈ వీడియో చూస్తుంటే భయమేస్తోంది. సెలబ్రిటీలతో అసభ్యంగా ప్రవర్తించకూడదని అభిమానులు అర్థం చేసుకోవాలి. పృథ్వీ షా ఆ అమ్మాయి దగ్గరున్న బ్యాటును ఎలాగోలా లాగేసుకున్నాడు. ఆ అమ్మాయే అతడి కారుపై దాడి చేసింది' అని ఒకరు ట్వీట్‌ చేశారు.




ఇంతకీ ఏం జరిగింది?


టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ పృథ్వీ షా స్నేహితుడి కారుపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ముంబయిలోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటళ్లో రెండో సెల్ఫీ ఇచ్చేందుకు షా నిరాకరించడమే ఇందుకు కారణం! బుధవారం రాత్రి సహారా స్టార్‌ హోటల్లోని మాన్షన్‌ కబ్ల్‌లో ఈ ఘటన చోటు చేసుకుందని ఏబీపీ న్యూస్‌కు కొందరు చెప్పారు. సనా గిల్‌, శోభిత్‌ ఠాకూర్‌ను నిందితులుగా గుర్తించారు.


క్లబ్‌లో సెల్ఫీ ఇవ్వాల్సిందిగా పృథ్వీ షాను సనా, శోభిత్‌ సంప్రదించారు. ఇందుకు అంగీకరించిన షా ఒక సెల్ఫీ ఇచ్చాడు. అయితే నిందితులు మరోటి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు షా నిరాకరించడంతో వాగ్వాదం చెలరేగింది. దాంతో క్లబ్‌ మేనేజర్‌ వారిని బయటకు పంపించారు.


ఆగ్రహానికి గురైన నిందితులు షా అతడి స్నేహితుడు క్లబ్‌ బయటకు వచ్చేంత వరకు ఎదురుచూసినట్టు తెలిసింది. పృథ్వీ షా ఉన్నాడేమోనని భావించి అతడి స్నేహితుడి కారును వెంబడించారు. జోగీశ్వరీ లింక్‌ రోడ్‌లోని లోటస్‌ పెట్రోల్‌ పంప్‌ వద్ద కారుని అడ్డగించారు. బేస్‌బాల్‌ బ్యాటుతో కారు అద్దాలు పగలగొట్టారు. దాడి జరిగినప్పుడు పృథ్వీ షా అందులో లేడు. వేరే కారులో ఇంటికి వెళ్లాడని సమాచారం.


దాడి చేశాక నిందితులు పృథ్వీ షా స్నేహితుడిని బెదిరించారు. గొడవను అక్కడితో ఆపేసేందుకు రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తప్పుడు కేసులో ఇరికిస్తామని బెదిరించారు. కాగా ఘటన జరిగాక షా మిత్రుడు ఓషివారా పోలిస్ట్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దాంతో అధికారులు సనా గిల్‌, శోభిత్‌ ఠాకూర్‌పై 384,143, 148,149, 427,504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపడతామన్నారు. వీరిని అరెస్టు చేశారని తెలిసింది.