IND vs NZ Ranchi T20:  పృథ్వీ షా మరో సంజూ శాంసన్ అవుతాడా! కివీస్ తో తొలి టీ20కి తుది జట్టులో షాను ఎందుకు తీసుకోలేదు! టీ20లకు పృథ్వీ షా రాంగ్ ఛాయిస్ ఆ! ఇవీ న్యూజిలాండ్ తో తొలి టీ20కి టీమిండియా తుది జట్టును చూశాక క్రికెట్ అభిమానులు, నెటిజన్ల నుంచి వచ్చిన ప్రశ్నలు. దాదాపు రెండేళ్ల తర్వాత భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్న యువ బ్యాటర్ పృథ్వీ షాకు తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. దీనిపై ఫ్యాన్స్, నెటిజన్లు అసహనం వ్యక్తంచేస్తున్నారు. 


షా వద్దు గిల్ ముద్దు


రాంచీ వేదికగా నిన్న భారత్- న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ కు భారత తుది జట్టును చూశాక క్రికెట్ ప్రేమికులు తమ  నిరాశను వ్యక్తంచేశారు. పృథ్వీ షాను ఎందుకు తీసుకోలేదని అడుగుతున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత భారత జట్టులో షాకు స్థానం లభించింది. అయితే కెప్టెన్ హార్దిక్ పాండ్య మాత్రం షా కు బదులు శుభ్ మన్ గిల్ నే ప్లేయింగ్ ఎలెవన్ లో తీసుకున్నాడు. ఇషాన్ కిషన్, గిల్ ఓపెనర్లుగా ఆడారు. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో అద్భుతంగా ఆడిన గిల్ కే తుది జట్టులో చోటు దక్కింది. 


దేశవాళీల్లో సూపర్ షో.. అయినా నో ఛాన్స్


కివీస్ తో తొలి టీ20 కు ముందు పృథ్వీ షా నెట్స్ లో చాలా సమయం గడిపాడు. ఇటీవల జరిగిన దేశవాళీ టోర్నీల్లోనూ షా పరుగుల వరద పారించాడు. రంజీ ట్రోఫీలో రికార్డు ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. ఆ ప్రదర్శన ఆధారంగానే న్యూజిలాండ్ తో టీ20లకు సెలక్టర్లు పృథ్వీ షాను జట్టులోకి తీసుకున్నారు. అయితే తుది జట్టులో స్థానం కోసం షా మరికొంతకాలం వేచి చూడక తప్పేలా లేదు. 



  • పృథ్వీ షా తన చివరి టీ20 ను జూలై 2021లో శ్రీలంకతో ఆడాడు. 

  • దేశవాళీల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసినప్పటికీ సెలక్టర్లు మళ్లీ ఇప్పటివరకు షాను భారత్ కు సెలక్ట్ చేయలేదు. 

  • ఈ ఏడాది రంజీ ట్రోఫీలో షా 379 పరుగులతో రికార్డులు బద్దలు కొట్టాడు, ఈ ప్రదర్శన అతనికి జాతీయ జట్టులోకి పిలుపునిచ్చింది.

  • 20 ఓవర్ల ఫార్మాట్‌లో షాకు మంచి రికార్డ్ ఉంది.

  • 23 ఏళ్ల పృథ్వీ 92 టీ20 మ్యాచ్‌లు ఆడి 2401 పరుగులు చేశాడు.

  • అందులో 151.67 స్ట్రైక్ రేట్‌తో 18 అర్ధసెంచరీలు,  ఒక సెంచరీ ఉన్నాయి.


సంజూలా షా!


సంజూ శాంసన్ కూడా దాదాపు ఆరేళ్ల క్రితం టీ20 ఫార్మాట్ లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఫామ్ లేమి, నిలకడ లేమితో జట్టుకు దూరమయ్యాడు. గత కొన్నాళ్లుగా దేశవాళీల్లో, ఐపీఎల్ లో నిలకడగా పరుగులు చేస్తున్నప్పటికీ సంజూను సెలక్టర్లు విస్మరిస్తూ వస్తున్నారు. చాలాకాలం తర్వాత శ్రీలంకతో టీ20లకు సంజూ శాంసన్ ను ఎంపిక చేశారు. అయితే లంకతో తొలి మ్యాచ్ లో గాయపడ్డ సంజూ ప్రస్తుతం జరుగుతున్న న్యూజిలాండ్ సిరీస్ కు ఎంపిక కాలేకపోయాడు. ఇప్పుడు పృథ్వీ షా పరిస్థితి కూడా సంజూ శాంసన్ లానే అవుతుందేమోనని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు.