Ind Vs Pak: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో కొత్త వివాదం ప్రారంభమైంది. బీసీసీఐ వైఖరితోనే అనవసర వివాదం చోటు చేసుకుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆరోపిస్తోంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని వచ్చేనెల 19 నుంచి పాక్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. టోర్నీలో పాల్గొంటున్న అన్ని జట్ల జెర్సీలపై పాక్ పేరు ఉండాలి. అయితే బీసీసీఐ తాజాగా విడుదల చేసిన టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరు లేదని తెలుస్తోంది. దీనిపై పీసీబీ విరుచుక పడింది. బోర్డు అధికారి మాట్లాడుతూ.. క్రీడల్లోకి రాజకీయాలను తేవడం సరికాదని వ్యాఖ్యానించాడు. టోర్నీకి సంబంధించిన కొన్ని సంప్రదాయాలను కూడా బీసీసీఐ పాటించడం లేదని ఆక్షేపించాడు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇరుదేశాల అభిమానులు కామెంట్లతో చర్చను హాట్ గా మారుస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం వైరలైంది.
కెప్టెన్ మీటింగ్ కు నో..
భారత ప్రభుత్వ సూచనతో టీమిండియాను పాక్ కు పంపించేందుకు బీసీసీఐ ససేమిరా అంటోంది. బీసీసీఐ పట్టుదల కారణంగానే ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ నిర్వహణలోకి దుబాయ్ కూడా వచ్చి చేరింది. హైబ్రిడ్ మోడల్లో జరుగుతున్న ఈ టోర్నీలో కేవలం భారత్ ఆడే మ్యాచ్ లు మాత్రమే దుబాయ్ లో జరుగుతాయి. లీగ్ మ్యాచ్ లతోపాటు నాకౌట్ చేరుకుంటే సెమీస్, ఫైనల్ మ్యాచ్ లు కూడా దుబాయ్ లోనే జరిపేందుకు పీసీబీ అంగీకరించింది. అలాగే ఐసీసీ చాంపియన్స్ టోర్నీకి ముందు కెప్టెన్లతో జరిపే సమావేశానికి భారత కెప్టెన్ రోహిత్ శర్మను కూడా పంపబోమని వెల్లడించింది. ఏదేనా ఐసీసీ టోర్నీ జరిగేముందు కెప్టెన్లతో మీటింగ్ నిర్వహించి, ఫొటో షూట్ తీయించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సమావేశం పాక్ లో జరుగుతుండటంతో అక్కడకి రోహిత్ ను పంపేందుకు బీసీసీఐ నో చెప్పినట్లు తెలిసింది.
ద్వైపాక్షిక సిరీస్ లు రద్దు..
2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత భారత్, పాక్ ల మధ్య క్రికెట్ సంబంధాలు క్షీణించాయి. దాదాపు ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు చెల్లు చీటి పడింది. చివరగా ఇరుజట్ల మధ్య 2013 జనవరిలో ఆఖరుగా ద్వైపాక్షిక వన్డే, టీ20 సిరీస్ లు జరిగాయి. అప్పటి నుంచి ఆసియాకప్, ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఇరుజట్లు పాల్గొంటున్నాయి. భారత్ లో పర్యటించేందుకు పాక్ ఆసక్తిగానే ఉన్నా, బీసీసీఐ ఖాతరు చేయడం లేదు. అలాగే పాక్ కు తమ జట్టును ససేమిరా పంపబోమని పలుమార్లు వెల్లడించింది. అయితే ఈసారి ఐసీసీ టోర్నీ 29 సంవత్సరాల తర్వాత పాక్ లో జరుగుతుండటంతో హైబ్రిడ్ మోడల్లో ఆడటానికి అంగీకరించింది. దీనికి బదులుగా పాక్ కూడా భారత్ లో పర్యటించబోదు. ఆసియాకప్, ఐసీసీ టోర్నీలు భారత్ లో జరిగినా, తటస్థ వేదికలపైనే ఆడుతుంది. దీనికి బీసీసీఐ కూడా అంగీకరించింది. ఏదేమైనా రాజకీయ కారణాలతో ఇరుజట్ల మధ్య క్రికెట్ సంబంధాలు దెబ్బతినడంపై ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు నిరాశ పడుతున్నారు.