ICC Champions News: ఇటీవల ప్రకటించిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కేరళకు చెందిన సంజూ శాంసన్‌కు మొండిచెయ్యి ఎదురైన సంగతి తెలిసిందే. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన సంజూకు కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌ల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైంది. దీంతో స్క్వాడ్‌‌లో వాళ్లిద్దరినే చేర్చుకుని, సంజూను పక్కనపెట్టారు. నిజానికి గత పదేళ్లుగా వన్డేల్లో అడపాదడపా ఆడుతున్న సంజూకు మంచి రికార్డే ఉంది. 16 వన్డేల్లో 516 పరుగులు చేసిన సంజూ.. ఒక సెంచరీ, మూడు ఫిఫ్టీలు బాదాడు. 56కి పైగా సగటు, 99కిపైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు. తాజాగా సంజూని పక్కన పెట్టడంపై దిగ్గజ క్రికెటర్, లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్ విచారం వ్యక్తం చేశాడు. తప్పనిసరి పరిస్థితుల్లోనే సంజూకు మొండిచేయి ఎదురైందని వ్యాఖ్యానించాడు. 

ఆ ఓక్క కారణంతోనే..ముఖ్యంగా పంత్‌తోనే సంజూకు పోటీ ఎదురైందని, అయితే నిమిషాల్లో ఆటను మార్చే సామర్థ్యం పంత్‌కు సాధ్యమని, అందుకే అతడికే సెలెక్టర్లు ఓటేశారని గావస్కర్ తెలిపాడు. నిజానికి పంత్ కంటే సంజూ మంచి బ్యాటరని, అయితే వికెట్ కీపింగ్‌తో పాటు దూకుడైన ఆటతీరుతో పంత్ సెలెక్టర్ల మనసు దోచాడని చెప్పుకొచ్చాడు. అయినా జాతీయ జట్టులోకి ఎంపిక కానందుకు సంజూ ఫీల్ కావాల్సిన అవసరం లేదని, దేశ ప్రజలంతా తన ఆటతీరును ఎప్పటీకీ స్మరించుకుంటారని తెలిపాడు. ఆటలో ఇవన్నీ సహజమని, ముందుకు వెళ్లాలని ఏదో ఒకరోజు ఫలితముంటుందని బెస్టాఫ్ లక్ చెప్పాడు. టీ20 జట్టులో రెగ్యులర్ ఓపెనర్‌గా ఉన్న సంజూకి, అటు టెస్టులు, ఇటు వన్డేల్లో స్థానం దక్కడం లేదు. అయితే ఇటీవల పొట్టి ఫార్మాట్‌లో తను సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నాడు. 

సంజూ నిర్లక్ష్యం కూడా కారణమా..?క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడటంతోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే సువర్ణవకాశాన్ని సంజూ శాంసన్ కోల్పోయినట్లు తెలుస్తోంది. దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనడం ద్వారా బీసీసీఐ ఫోకస్‌లో పడాలని సంజూ కోరుకున్నాడు. అయితే కేరళ క్రికెట్ సంఘం ధోరణితో అతనికి ఈ సువర్ణావకాశం మిస్సయ్యిందని తెలుస్తోంది. ఇందులో సంజూ తప్పు కూడా ఉందని సమాచారం. విజయ్ హజారే ట్రోఫీ కోసం 30 మందితో కూడిన ప్రిపరేటరీ క్యాంపునకు వచ్చేందుకు సంజూ విముఖత చూపుతూ, తను అందుబాటులో లేనని కేరళ క్రికట్ సంఘానికి తెలిపాడు. క్యాంపు ముగిసి జట్టును ఎంపిక చేశాక, తను జట్టులోకి వస్తానని సంజూ కోరాడని, అతని అభ్యర్థనను తిరస్కరించినట్లు తెలుస్తోంది. జాతీయ జట్టుకు కేరళ సంఘం ద్వారానే సంజూ వెళ్లాడని, అయితే సంఘం నిబంధనలను పాటించకపోవడం ఏంటని సంఘం ప్రెసిడెంట్ జయేశ్ జార్జ్ ఫైరయ్యారు. ఇలా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తే సహించేది లేదని పేర్కొన్నారు. విజయ్ హజారే ట్రోఫీలో ఆడని కారణంగానే చాంపియన్స్ ట్రోపీలో పాల్గొనే చాన్స్ ను సంజూ కోల్పోయాడా అనే విషయం తనకు తెలియదని తెలిపారు. ఏదేమైనా బంగారం లాంటి ఐసీసీ టోర్నీలో పాల్గొనే అవకాశాన్ని సంజూ మిస్సవ్వడంపై అతని అభిమానులు ఫీలవుతున్నారు. 

Also Read: Himani Mor: నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ గురించి తెలుసా...? తను కూడా గోల్డ్ మెడల్ తెచ్చింది